RajakeeyaaluRajakeeyaalu

Wednesday, January 24, 2018

జగ జగ జగమొండి…

  • December 20, 2016 | UPDATED 22:08 IST Views: 943
  • Share

 

ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా మారని జగన్ వైఖరి…

jagan1

వైఎస్.జగన్మోహన్ రెడ్డి… ఈ పేరు వింటే కొంత మందికి నిద్రకూడా పట్టదు… మరికొంత మందికి ఏదో ఒక తెలియని ఆత్మీయానుభూతి… ఇంకొంత మందికి ఆ పేరే ఒక భరోసా. జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధమైనటువంటి అభిప్రాయం లేని వాళ్లు సైతం తమ ఆలోచనల్లోకి జగన్ రాకుండా నియంత్రించుకోలేని వ్యక్తిత్వం ఆయనది. అయితే ఆయన్ని అభిమానించే వాళ్లు… వ్యతిరేకించే వాళ్లు… తటస్తులు ఎవరైనా సరే ఆయన మనస్తత్వంపై, ఆయన మొండి తనం గురించి చర్చించుకోవాల్సిందే. ఎవరు వారించినా… ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా… ముందంతా ముళ్లదారి అని తెలిసినా తాను నమ్మిన దారిలో మొండిగా ముందుకెళ్లే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది. అది వ్యక్తిగత విషయాల్లో అయినా… వ్యాపార వ్యవహారాల్లో అయినా చివరికి తాను ఎంతగానో ఇష్టపడే రాజకీయాల్లో అయినా జగన్ ది అదే మొండి వైఖరి. ఈ నడత కారణంగానే పట్టుమని ఎనిమిదేళ్లు కూడా నిండని ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో మరపురాని విజయాలు, మరెన్నో అవమానాలు, పరాజయాలు. అయినా సరే తన ధిక్కార స్వరాన్ని మాత్రం ఆయన సవరించుకోవడం లేదు.

మొదటి సారిగా రాష్ట్ర ప్రజలు వైఎస్.జగన్మోహన్ రెడి పేరు విన్నది 2001 మార్చి 20వ తేదీ. అంతకు ముందు వైఎస్ఆర్ కు జగన్మోహన్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడని చాలా మందికి తెలుసుకానీ రాష్ట్ర ప్రజలందరికీ జగన్ గురించి పరిచయం అయ్యింది మాత్రం 2001వ సంవత్సరంలో మాత్రమే. పరిటాల రవిని హతమార్చడానికి అనంతపురంలో అమర్చిన సూట్ కేస్ బాంబు విషయంలో జగన్ హస్తం ఉందని అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ ఆరోపించిన సందర్భంలో ఆ సంవత్సరం మార్చి 20వ తేదీని వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీలో మాట్లాడుతూ తన కుమారుడు తప్పుచేస్తే ఉరి తీయండని అధికారపక్షానికి సవాల్ విసిరారు. ఆవిధంగా యాంటీ హీరో ఇమేజ్ తో రాష్ట్ర ప్రజలకు పరిచయమైన జగన్ 2008 వరకూ మళ్లీ ఎక్కడా రాష్ట్ర తెరపై కనిపించలేదు. కేవలం ఒక సామాజికవర్గం అందునే ఆ రెండు పత్రికలే రాష్ట్ర మీడియాను గుత్తాధిపత్యంతో ఏలుతూ నిజానిజాలను ప్రజలకు చేరకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయన్న ఉద్దేశంతో మీడియా రంగంలోకి అడుగుపెట్టారు జగన్. అయితే ఆయన ఈ నిర్ణయం కారణంగా ఆయనపై అప్పటి ఆధిపత్య మీడియా కత్తిగట్టిందనడంలో సందేహం లేదు. అయినా వెరవకుండా మొండి ధైర్యంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సాక్షి దినపత్రికను, ఆ తరువాతి సంవత్సరం న్యూస్ ఛానల్ ని తీసుకువచ్చారు జగన్మోహన్ రెడ్డి. దాని వల్ల ఒక వర్గం మీడియా మొత్తం ఏకమై తనపై ఎంత కక్షపూరితంగా వ్యవహరించినా వెనక్కి తగ్గలేదు.

jaganmohan-reddy

ఇక 2009 సెప్టెంబర్ 2వ తేదీన తండ్రి వైఎస్ఆర్ దుర్మరణం తరువాత ఆయన అశేష అభిమాన పరివారం బాధ్యతనంతా తన భూజాలపై వేసుకున్నారు జగన్. తండ్రి మరణ వార్త విని తట్టుకోలేక అకాల మరణం చెందిన అభిమాన కుటుంబాలకు అండగా నిలవాలని జగన్ తీసుకున్న నిర్ణయం ఆయన జీవితాన్ని అనేక మలుపులు తిప్పింది. అప్పట్లో మరణించిన వైఎస్ అభిమానులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు వెల్లువెత్తిన ప్రజాభిమానం చూసి ఈర్ష్య పడ్డ కాంగ్రెస్ పెద్దలు ఆ ఓదార్పు కార్యక్రమాన్ని నిలిపివేయమని అధిష్టానంతో చెప్పించారు. జగన్ చేసే ఓదార్పు యాత్రల ఫలితాలు కన్సాలిడేషన్ మొత్తంగా కాంగ్రెస్ కే లాభిస్తుందనే లాజిక్కును కూడా మిస్ అయ్యి సోనియా గాంధీ ఓదార్పు ఆపేయమని లక్ష్మణరేఖ గీసారు. అయితే తండ్రి కోసం మరణించిన కుటుంబాలను ఆదుకుంటానని ఇచ్చిన మాటను తప్పలేనని సోనియాను ధిక్కరించి ఓదార్పుయాత్రలను కొనసాగించారు జగన్. ఈ ధిక్కారాన్ని తట్టుకోలేని కాంగ్రెస్ అధిష్టానం జగన్ ని వదులుకోవడానికి నిర్ణయించుకుని ఆయన్ను పార్టీ వీడేలా పరిస్ధితులను ప్రేరేపించింది. ఇక కాంగ్రెస్ పార్టీ తనను పొమ్మనలేక పొగపెడుతోందని అర్ధమైన జగన్ సొంతకుంపటి పెట్టుకోవడానికి సిద్దమైపోయారు.

ys_jagan_vijayamma_ysr_congress

ప్రపంచంలోనే శక్తివంతమైన తొమ్మొదో వ్యక్తిగా కీర్తిగడించిన సోనియాతో ప్రత్యక్ష యుద్దానికి తయారైపోయారు జగన్. తండ్రి వైఎస్ఆర్ పేరుతో పార్టీ పెట్టి తల్లితో పాటు తానూ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. ఉప ఎన్నికల ద్వారా తన సొంత శక్తిని ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా నిరూపించుకోవాలని మొండిగా ముందుకువెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అప్పటి మంత్రులందరూ కడపలో తిష్టవేసి కేవలం ఒక పార్లమెంట్, ఒక అసెంబ్లీ స్ధానం గెలవడం కోసం… కాదు కాదు… జగన్ ని ఓడించడం కోసం వందల కోట్లు ఖర్చుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా సుమారు 5 లక్షల 43 వేల పైచిలుకు మెజార్టీతో కడప పార్లమెంట్ స్ధానంలో కాంగ్రెస్ ను ఎదిరించి విజయం సాధించిన జగన్ సోనియాగాంధీకి పెద్ద సవాల్ విసిరారు. అయితే జగన్ ఈ మొండి వైఖరిని తట్టుకోలేక పోయిన సోనియా గాంధీ ఆయపై సొంతపార్టీ నేతలతో కేసులు పెట్టించి ఆ కేసులను భూతద్దంలో చూపించి 17 నెలలు జైల్లో పెట్టించారు. ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ తనను వ్యక్తిగతంగా ఇంత ఇబ్బంది పెడుతున్నా విడవకుండా జైలు నుంచే తనకు మద్దతుగా నిలిచిన 18 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికల్లో గెలిపించుకున్నారు జగన్. ఈ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి కానీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి కానీ డిపాజిట్లు కూడా దక్కలేదు. తాను జైల్లో ఉండటానికైనా సిద్దపడ్డాడు కానీ కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీలతో రాజీ పడాలని ఏ రోజూ ప్రయత్నించలేదు. కడప ఉప ఎన్నికల సందర్భంగా గులాంనబీ ఆజాద్ జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి కూడా అయ్యేవాడని అనడమే ఇందుకు నిదర్శనం.

ఇక 2013లో రాష్ట్ర విభజనపై కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్న సమయంలో సైతం తాను నమ్మిన సమైక్యాంధ్రకే కట్టుబడి బహిరంగంగా రాష్ట్ర విభజనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని ధైర్యంగా ప్రకటించారు జగన్. ఇక తనకు ఎంతో ప్రతిష్టాత్మకమైనవే కాకుండా తన రాజకీయ భవిష్యత్ ను నిర్దేశించే 2014 సార్వత్రిక ఎన్నికల్లోకూడా జగన్ మొండి వైఖరిని ఆయన సొంత పార్టీ నేతలే విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 16 మందిపై వ్యతిరేకత బాగుందని వారిని మార్చి వారి స్ధానాల్లో వేరే వాళ్లను పోటీలో నిలపమని ఎందరు చెప్పినా వినలేదు జగన్. ఓడిపోతారని తెలిసినా తానను నమ్ముకుని వచ్చిన వాళ్లను నట్టేట ముంచలేనని అటువంటి రాజకీయాలు తాను చేయనని మొండిగా వారినే పోటీలో నిలబెట్టారు జగన్. అదేవిధంగా ఎన్నికల్లో ప్రత్యర్ధులు ఓటుకు వేల రూపాయలు పంచుతున్నారు మనం కూడా పంచుదామని వైసిపి అభ్యర్ధులు అంటే పార్టీ తరపున తాను ఖర్చుపెట్టక పోగా అభ్యర్ధులను కూడా ఎక్కువ ఖర్చుపెట్టనివ్వలేదు. అలాగే రైతు రుణమాఫీ మనం కూడా ఇద్దామంటే అది అసాధ్యమని సాధ్యం కాని హామీలు తాను ఇవ్వలేనని మొండికేశారు జనగ్మోహన్ రెడ్డి.

hqdefault

ఆ ఎన్నికల్లో ఫలితాలు ప్రతికూలంగా వచ్చినా సరే వెరవకుండా తన రాజకీయ పంధాను మాత్రం మార్చుకోలేదు జగన్. ఈడి కేసులు మెడమీద కత్తులల్లే వేలాడుతున్నా… జగన్ ని తిరిగి జైలుకు పంపాలన్న ఏకైక ధ్యేయంతో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీలు పనిచేస్తున్నా జగన్ మాత్రం తన పోరాటాలు మాత్రం మానలేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాపోరాటాలు చేస్తూనే ఉన్నారు. మోడీని, కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను విమర్శించాలంటే ఇద్దరు చంద్రులతో పాటు పలువురు కాకలు తీరిన నేతలు సైతం ఒణికిపోతుంటే జగన్ మాత్రం ప్రత్యేక హోదా గురించి ఆందోళనలు చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. నేరుగా గవర్నర్ వద్దకే వెళ్లి నోట్ల రద్దు వల్ల సామాన్యులకు ఉత్పన్నమైన కష్టాలను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చివచ్చారు. అంత మొండిగా తాను అనుకున్న రీతిలో రాజకీయాలు నెరుపుతూ తన వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా ప్రజల మధ్య తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరిని ఆంధ్రులు ఆదరిస్తారో లేదో తెలియాలంటే 2019 ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే.

ఏదిఏమైనా తన నడక, నడతలకు ఓ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకుని కష్టాలు ఎదురైనా వెనుకంజ వేయక మొండాడు అనిపించుకుంటూ రాజకీయాలు చేస్తున్న వైఎస్.జగన్మోహన్ రెడ్డికి www.rajakeeyalu.com తరపున హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు.