RajakeeyaaluRajakeeyaalu

Wednesday, January 24, 2018

దక్షిణాది ప్రాంతీయ పార్టీలపై బీజేపీ కన్ను

  • December 8, 2016 | UPDATED 10:47 IST Views: 578
  • Share

 

వారసత్వ సెగలు రేపి లబ్ది పొందే ప్రయత్నం 

కేంద్రంలో మోడీ హవాతో 2014లో చారిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై ద్రుష్టి పెట్టింది. ఇప్పటికే కర్ణాటకలో పాగా వేసిన బీజేపీ ఇకపై తమిళ నాడు తో సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టు సాధించేందుకు కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా ప్రాంతీయపార్టీలే అధికారంలో ఉంటున్నాయి. ప్రత్యేకించి తమిళనాడులో నాలుగైదు దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోనిది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, కమ్యూనిస్టులు తమిళనాడులో నామమాత్రంగానే ఉన్నారు. డీఎంకే, అన్నాడిఎంకె అధికారంలో కొనసాగుతున్నాయి. 

janardhanreddy

ఇప్పుడు తాజాగా అధికార అన్నా డీఎంకే అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఆ పార్టీ సంక్షోభంలో పడబోతోంది. జయలలిత మరణంతో ఆ పార్టీలో నాయకత్వ సమస్య తలెత్తింది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా జయలలిత నమ్మిన బంటు పన్నీర్ సెల్వం కొనసాగుతున్నప్పటికీ జయలలిత స్నేహితురాలు శశికళ పార్టీ పగ్గాలు చేపట్టారు. అయితే శశికళ పార్టీ నేతగా కొనసాగి పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రిగా ఉండనిస్తారా లేక ఆ పదవి కూడా ఆమే తీసుకుంటారో తేలాల్సి ఉంది. అయితే వారసత్వం విషయంలో చిచ్చు రాజేసే ప్రయత్నం బీజేపీ ఇప్పటికే చేసింది. జయలలిత మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవికోసం అన్నా డీఎంకే సీనియర్ నేత తంబీ దురై పేరును అనూహ్యంగా తెరపైకి తెచ్చింది బీజేపీ. అయితే శోకసముద్రంలో ఉన్న తమిళ ప్రజలూ, అన్నా డీఎంకే నేతలూ తంబీ దురై పేరుపై చర్చ చేసేందుకు ఇష్టపడక పోవటంతో బీజేపీ ఒక అడుగు వెనక్కి తగ్గి ప్రస్తుతానికి పన్నీర్ సెల్వం పేరు క్లియర్ చేసింది. బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ద్వారా నాయకత్వ మార్పిడి కోసం కొంత ప్రయత్నం చేసిన బీజేపీ ప్రస్తుతానికి ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసింది. 

New Delhi: Prime Minister Narendra Modi greets newly elected Dy Speaker M Thambidurai in the Lok Sabha in New Delhi on Wednesday. PTI Photo / TV GRAB(PTI8_13_2014_000094A)

శశికళ పార్టీ నేతగా కొనసాగుతూ, ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వాన్ని పదవిలో ఉంచినా తంబీ దురై ద్వారా తిరుగుబాటు చేయించి పార్టీలో సీనియర్ నేతలను ఆకట్టుకోవాలని బీజేపీ పథకరచన చేసింది. ఒక వేళ శశికళ పార్టీ నాయకత్వంతో పాటు ముఖ్యమంత్రి పదవి కూడా తనకే కావాలని కోరే పక్షంలో పనీర్ సెల్వాన్ని కూడా ఆకట్టుకునేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. పన్నీర్ సెల్వం, తంబీ దురై కలిసి తిరుగుబాటు చేసే పక్షంలో అధికార మార్పిడికి సహకరించేందుకు గవర్నర్ ద్వారా వ్యూహం సిద్ధం చేస్తున్నట్టు వినికిడి. పన్నీర్ సెల్వం, శశికళ ఉమ్మడిగా పార్టీ నాయకత్వం తీసుకున్న పక్షంలో తంబీ దురై ద్వారా పొగబెట్టేందుకు కూడా బీజేపీ వ్యూహం సిద్ధం చేసినట్టు సమాచారం. ఎలాగైనా అగ్రనేత జయలలిత లేని పార్టీలో కొనసాగడం కంటే జాతీయ పార్టీ అయిన బీజేపీ వైపు వెళ్లడం మంచిదనే సూచనలు కూడా బీజేపీ అన్నాడీఎంకే నాయకులకు చేరవేస్తోంది. 

amit_9_0

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాలక ప్రాంతీయ పార్టీల విషయంలో కూడా బీజేపీ ఇంచుమించు ఇదే వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణాలో ఇప్పటికే ఉన్న కొంత పట్టును మరింత పెంచుకునేందుకు కొంత వేచిచూసే ధోరణితో ఉన్నా ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం 2019 నాటికే బలపడాలనే ఆలోచనలో ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే పార్టీని ఎలా బలపర్చాలో దిశానిర్దేశం చేశారు. టీడీపీతో మిత్ర ధర్మం పాటిస్తూనే పార్టీని బలపర్చేందుకు కొత్త నాయకులనూ, కార్యకర్తలనూ ఆహ్వానించాలని అయన పార్టీ నేతలకు సూచనలు చేశారు. మరోవైపు రాష్ట్రంలో శాసనసభ స్థానాలు పెంచకుండా టీడీపీని చిక్కుల్లోకి నెట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీజేపీని ప్రత్యామ్నాయంగా చూపించేందుకు రంగం సిద్ధం చేశారు. రాష్ట్రంలో 2019 నాటికి అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయనీ, అందరికీ అవకాశాలు కల్పిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. అయితే ప్రస్తుతం అసెంబ్లీ స్థానాలు పెంచేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. స్థానాలు పెంచితే ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా టీడీపీ తరపున 2019లో పోటీ చేస్తారు. అలాంటి అవకాశం ఉన్నప్పుడు నేతలు బీజేపీ వైపు చేసే అవకాశమే లేదు. అందుకే శాసనసభ స్థానాలు పెంచకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరుకులో పడేస్తే ప్రత్యామ్నాయంగా వారు బీజేపీ వైపు వస్తారని ఆ పార్టీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. 

అలాగే 2019లో కాకపోయినా 2024 ఎన్నికల నాటికైనా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీల్లో నాయకత్వ, వారసత్వ సమస్యలు తలెత్తుతాయని, అప్పుడు అవకాశం చూసుకొని నేతలను ఆకర్షించవచ్చని బీజేపీ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం వారసత్వ సమస్య వచ్చిన తమిళనాడులో తమ వ్యూహం ఫలిస్తే అదే వ్యూహాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.