RajakeeyaaluRajakeeyaalu

Wednesday, January 24, 2018

నెలరోజుల ఆర్ధిక ఎమర్జెన్సీ కనుచూపులో లేని పరిష్కారం

  • December 8, 2016 | UPDATED 12:08 IST Views: 694
  • Share

 

 మార్చాల్సింది “నోటు” కాదు “నేత”ని  

index

దేశంలో ప్రధానమంత్రి అవినీతి అంతం, నల్లధనం నిర్మూలన పేరుతొ పెద్దనోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి సరిగ్గా నేటితో నెలరోజులు. పెద్దనోట్ల రద్దుతో అవినీతి, నల్లధనం ఎంతమేరకు అదుపులోకి వచ్చాయో తెలియదుగానీ దేశంలో సామాన్యుడు ఆర్ధిక ఎమెర్జెన్సీ పరిస్థితులను అనుభవిస్తున్నాడు. గత నెలరోజులుగా బ్యాంకుల్లో డబ్బుల్లేవు. ఏటీఎంలలో డబ్బులు లేవు. వచ్చిన ఒకటీ ఆరా పెద్ద నోటుకు మార్కెట్లో చిల్లర లేదు. 

cashless-economy-harmfull

డెబిట్ కార్డులూ, క్రెడిట్ కార్డులూ, ఆన్ లైన్ లావాదేవీలూ, ఇతర pay cards ఉన్నవాళ్లు బాగానే ఉన్నారు ఈ నెలరోజులు. కార్డులు వాడి మాల్స్ లో సరుకులు కొనుక్కున్నారు. ప్రయాణాలకు టిక్కెట్లు కొనుక్కున్నారు. హోటల్లో భోజనాలు చేస్తున్నారు. కానీ సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, చిన్నపాటి ఉద్యోగస్తులు, వ్యాపారాలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దె కట్టాలంటే రోజుకు 2000 పరిమితితో, ఖాళీ ఎటిఎం లతో ఎన్నిరోజులు, ఎన్ని గంటలపాటు లైన్లో నిలబడాల్సి వస్తోందో పాలకులకు తెలియటం లేదు. 

ఆర్భాటం కోసం తీసుకున్న నిర్ణయం తప్ప పెద్ద నోట్ల రద్దుపై ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు గట్టిగా కసరత్తు చేసినట్టు కనిపించలేదు. పెద్దనోట్లు రద్దు చేయాలనుకున్నప్పుడు అందుకు సరిపడా చిల్లర మార్కెట్లో ఉంచాలని ప్రభుత్వం ఆలోచన, అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవటం ఈ మొత్తం నిర్ణయంలో పాలకుల చిత్తశుద్ధిని శంకించేలా చేస్తోంది. బ్యాంకులు ఖాళీ అయ్యాయి. ఎటిఎం లు మూతపడ్డాయి. నగదు రహిత లావాదేవీలు అని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం దేశాన్ని ఏకంగా నగదు రహితం చేసింది. 

farmers-affected-story_647_112316062108

గ్రామాల్లో చిల్లర కోట్లు లేవు. రైతులు ఎరువులు కొనలేక పంటలు ఎండబెట్టుకుంటున్నారు. రైతు కూలీలకు వేతనాలు లేవు. బ్యాంకులు లేవు. బ్యాంకు ఖాతాలు లేవు. దేశంలో 70 శాతం ప్రజలు నివసించే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు లేవూ, ఎటిఎం లు లేవూ, కార్డులు లేవూ, మాల్స్ లేవు అనే వాస్తవం కూడా ఈ పాలకులకు తెలియకపోవటం దురదృష్టకరం. మొత్తంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. దీని ప్రభావం వచ్చే ఆర్ధిక సంవత్సరం స్పష్టంగా కనపడబోతోంది. 

మోడీ భక్తులు ఆన్ లైన్, కార్డు లావాదేవీలు చేసుకుంటూ సామజిక మాధ్యమాల్లో గొప్పలు చెప్పుకుంటుంటే, అధికశాతం ప్రజలు రోడ్లపై బ్యాంకులూ, ఎటిఎం ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ బ్యాంకులు, ఎటిఎంలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఏపనీ లేక, చేతిలో చిల్లర లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. “అచ్చేదిన్” సంగతేమో గాని, ఇవి ఖచ్చితంగా “సచ్చే దినాలే”. 

atmm

నెల రోజులు ఆర్ధిక వ్యవస్థను సక్కదిద్దలేక పోయారు. మరో 22 రోజులు ఆగాల్సిందే అంటున్నారు. నిర్ణయం తీసుకున్నాక దాని ఫలితాలు, పరిష్కార మార్గాలూ చూపలేని పాలకులు నిస్సిగ్గుగా తమ నిర్ణయాలను సమర్ధించుకుంటున్నారు. ప్రజలేకేం ఇబ్బందిలేదు అని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. ఇది నిజంగా దుర్మార్గమే. ఇప్పటికీ మూతబడిన ఎటిఎం లు పట్టణాల్లో కనిపిస్తున్నా, “No change” అనే బోర్డులు బ్యాంకుల ముందు కనిపిస్తున్నా పాలకులు మాత్రం జబ్బలు చరుచుకుంటున్నారు. 

నెలరోజులపాటు ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన పాలకులను చూస్తుంటే ప్రజలు లైన్ లో నిలబడాల్సింది నోటు మార్చుకోడానికి కాదు, ఓటు వేసి పాలకుల్ని మార్చుకోడానికి. తప్పదు మరి! అసమర్ధ పాలకులెందుకు? రిజర్వు బ్యాంకు తో తప్పుడు నోట్లు ముద్రించిన ఇంట అసమర్ధ నాయకత్వం ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఏదేశంలోనూ ఇంతవరకూ కనిపించలేదు.