RajakeeyaaluRajakeeyaalu

Wednesday, January 24, 2018

మంత్రి వర్గ విస్తరణను అటకెక్కించిన చంద్రబాబు… సామాజిక సమతుల్య సాధనే విస్తరణకు ప్రధాన అడ్డంకి…

  • January 8, 2017 | UPDATED 19:03 IST Views: 791
  • Share

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చంద్రబాబు ఇప్పట్లో చేపట్టే పరిస్ధితులు కనిపించడం లేదు. ఎప్పటి నుంచో విస్తరణ తాయిలం చూపించి సొంత పార్టీ శాసనసభ్యులను… వశపరచుకున్న ప్రతిపక్ష పార్టీ ఎమ్మల్యేలను ఊరిస్తున్న చంద్రబాబు ఆలోచనలు మాత్రం ఆ దిశగా సాగడం లేదు. శాసనసభ్యుల్లో టెంపరేచర్ పెరిగినప్పుడు మాత్రం ఇదిగో ముహుర్తం… ఫలానా పండుగనాడు మీకందరికీ పండుగే అని లీకులివ్వడం తప్ప ఇదమిద్దంగా ఫలానా రోజున కనీసం ఫలానా నెలలో విస్తరణ అని సాక్షాత్తూ చంద్రబాబే కరాఖండీగా చెప్పలేకపోతున్నారు. వాస్తవానికి విస్తరణ చేపట్టవల్సిన అవసరం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తాను రాజేసిన సామాజిక కుంపట్లు ఇప్పుడు తనకే సెగపుట్టిస్తుండటంతో తన మంత్రివర్గాన్ని విస్తరణ దిశగా చంద్రబాబు అడుగులు వెయ్యలేకపోతున్నారు.

cabinet1

కులాల కార్చిచ్చులా తయారైనా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏం చెయ్యాలన్నా ముందుగా సామాజిక సమతుల్యాన్ని సాధించాల్సిందే. అదే పరిస్ధితి మంత్రివర్గ విస్తరణకు కూడా వర్తిస్తుంది. ఇప్పటికే గడచిన రెండున్నరేళ్లుగా అనేక కులాలను, మతాలను తన మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించలేదు చంద్రబాబు. పై పెచ్చు ఒకట్రెండు కులాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తన మాటల ద్వారా ప్రచారం కల్పించుకుంటుండంతో ఇప్పుడు ఆయా సామాజికవర్గాల శాసనసభ్యులు తమకు ప్రస్తుతం ఇచ్చిన ప్రాతినిధ్యం కన్నా అదనం కావాలని పట్టుబడుతున్నారు. మరో పక్క కుమారుడు లోకేష్.. తనకో బెర్త్ కావాలని ఒత్తిడి. ఈ నేపథ్యంలో ఇప్పుడప్పుడే విస్తరణ తుట్టెను కదిలించకూడదని భావించిన చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ అంకాన్ని అటకెక్కించేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

cabinet3

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్ధానాల సంఖ్య ప్రకారం మంత్రివర్గంలోకి 26 మంది మంత్రులను చేర్చుకునే అవకాశం ఉంది. అయితే 2014 జూన్ 8వ తేదీన ప్రమాణస్వీకారం చేసినప్పుడు చంద్రబాబు తన మంత్రివర్గంలోకి 19 మంది మంత్రులను చేర్చుకున్నారు. మిగిలిన ఏడు బెర్త్ లను భర్తీ చెయ్యకుండా గడచిన రెండున్నరేళ్లుగా ఖాళీగానే అట్టేపెట్టారు చంద్రబాబు. అయితే ఒక సంవత్సర కాలంగా మంత్రివర్గ విస్తరణ ఇవాళ చేస్తా రేపు చేస్తా అని ఊరిస్తూ కాలం వెళ్లదీస్తున్న చంద్రబాబు దానికి కార్యరూపం మాత్రం ఇవ్వడం లేదు. ఓ దశలో కుమారుడు లోకేష్ ని మంత్రివర్గంలోకి తీసుకోవడం తప్పనిసరి అనే ఫీలర్లు వదలడంతో ఆశావాహులందరూ పనిలోపనిగా తమకు కూడా ఆమాత్యయోగం వరిస్తుందని ఆశల పల్లకిలో ఊరేగారు. అయితే చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానని కుమారుడ్ని సైతం ఊరించి ఊరించి బురిడీ కొట్టించారు తప్పితే ఆ శుభముహుర్తాన్ని మాత్రం ఖరారు చెయ్యలేదు. దీంతో మంత్రి పదవి ఆశించి శాసనసభ్యులందరూ డీలాపడిపోయారు. ఉగాది… దీపావళి… సంక్రాంతి ఇలా పండుగలన్నీ వచ్చి వెళ్లిపోతున్నాయి కానీ తమ జీవితాల్లో వసంతం మాత్రం రావడం లేదని ఇంతకాలం టిడిపి శాసనసభ్యులు బాధపడుతుండే వారు ఇప్పుడు వారికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గోడదూకి వచ్చిన శాసనసభ్యులు కూడా తయారయ్యారు. ఎందుకంటే టిడిపిలో చేరిన ఆ 21 మంది వైసిపి శాసనసభ్యుల్లో దాదాపు నలుగురైదుగురికి మంత్రి పదవులు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

cabinet2

ఇలా మలి విడత విస్తరణలో అవకాశం ఇస్తానని కనిపించిన శాసనసభ్యులందరికీ హామీలు ఇవ్వడమే కాకుండా కొనుగోలు చేసిన ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా హామీ ఇవ్వడం.. తొలి క్యాబినేట్ లో స్ధానం కల్పించని కులాలకు, మతాలకు ఖచ్చితంగా ఇప్పుడు స్థానం కల్పించాల్సి రావడంతో చంద్రబాబుకు మంత్రివర్గ విస్తరణ ఓ బ్రహ్మ పదార్ధమై కూర్చుంది. ఇప్పుడా తేనెతుట్టెను కదిపితే అసంతృప్త తేనెటీగలతో ముప్పొచ్చిపడుతుందని మంత్రివర్గ విస్తరణను వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వస్తునారు చంద్రబాబు. తన తొలి మంత్రివర్గంలో క్షత్రియులు, బ్రాహ్మణులు, ముస్లీం మైనార్టీ, క్రీస్టియన్ మైనార్టీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించలేదు చంద్రబాబునాయుడు. ఈ సారి విస్తరణలో తప్పని సరిగా ఆయా కులాలను భర్తీ చేయవల్సి ఉంటుంది. ఇక కుమారుడికి తప్పని సరి. దీంతో ఐదు స్థానాలు అక్కడికే పోతాయి. ఇక మిగిలింది ఒకే ఒక్క మంత్రి పదవి ఇది ఎవరితో భర్తీ చెయ్యాలన్నదే చంద్రబాబుకు పెద్ద సమస్య. కొత్తగా భర్తీ చేసే ఈ ఐదు కేటగిరీలకు గానూ క్యాబినేట్ నుంచి తొలగించడానికి ఆల్టర్నేటివ్ మంత్రులు కూడా లేరు. వచ్చేది ఎన్నికల క్యాబినేట్ కాబట్టి తప్పిని సరిగా సామాజిక సమతుల్యత పాటించవల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు హామీలు ఇచ్చిన శాసనసభ్యులు గౌతు శ్యాంసుందర్ శివాజీ, కిమిడి కళా వెంకట్రావ్, బండారు సత్యనారాయణ మూర్తి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కోడెల శివప్రసాద్, దామచర్ల జనార్ధన్, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, పులివెందుల సతీష్ రెడ్డి తదితరులు ప్లాట్ ఫామ్ టిక్కెట్ తీసుకుని క్యాబినేట్లో బెర్త్ కోసం రెఢీగా ఉన్నారు.

cabinet4

వీరే కాంకుడా మంత్రి పదవులు ఇస్తానని ఆశ చూపి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేర్చుకున్న భూమా నాగిరెడ్డి, అమర్ నాధ్ రెడ్డి, జలీల్ ఖాన్, ఉప్పులేటి కల్పన, జ్యోతుల నెహ్రు, సుజయ్ కృష్ణ రంగారావు, వంటి శాససభ్యులు కూడా ఎప్పుడెప్పుడు విస్తరణ జరుగుతుందా… మంత్రి పదవులు అనుభవించేద్దామా అన్నట్లు కాచుకు కూర్చున్నారు. వీరందరూ ఒకెత్తైతే తెలుగుదేశం పార్టీ కోటాలో కాపులను ముగ్గురినే మంత్రవర్గంలోకి తీసుకున్నారని ఆ కోటా నాలుగుకు పెంచాలనే ఒత్తిడి కాపు సామాజికవర్గం శాసనసభ్యుల నుంచి విపరీతంగా ఉంది. ఒక వేళ ఆ కోటా పెరిగితేగిరిగితే ఆ బెర్త్ కోసం తోట త్రిమూర్తులు, బొండా ఉమామహేశ్వరావులు పోటీ పడుతున్నారు. వీరిలో కొందరికైనా మంత్ర పదవులు అడ్జస్ట్ చెయ్యాలంటే కిమిడి మృణాళిని, అచ్చెంనాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, పీతల సుజాత, పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి తదితరులను క్యాబినేట్ నుంచి డ్రాప్ చెయ్యాల్సి ఉంటుంది. అలా కొందరిని తొలగిస్తే వారు ఊరికినే ఉంటారా… ఎన్నికల సీజను పైగా అధికారపక్షంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి వెరసి వాళ్లలో మెజార్టీ శాసససభ్యులు వైసిపిలోకి జంప్ చెయ్యరన్న గ్యారంటీ లేదు. పైగా 2014 ఎన్నికల్లో వారిలో చాలా మంది వైసిపి మ్యాండెట్ కూడా ట్రై చేసినవాళ్లే. ఇవన్నీ ఆలోచించి చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని చాప చుట్టేసి శమీవృక్షం ఎక్కించేశారు. ఇక దాన్ని ఇప్పట్లో దింపాలని చంద్రబాబు ఆలోచించడం లేదన్నది ఆయన అంతరంగీకుల సమాచారం. అయితే సమాజిక సమతుల్యత సాధించలేక ఈ సారికి ఇలా గడిపేస్తారా లేక ఎన్నికల సంవత్సరంలో ఎంతో కొంత మార్పులు చేర్పులూ చేస్తారో వేచిచూడాలి.