అభినవ చాణక్యుడు….అతడే కేసీయార్ .

0
471

ఎక్కడా డైలమా లేదు.ఏ విషయంలోనూ కన్ఫ్యూజన్ లేదు.అంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది.ప్రతీ అడుగూ పక్కాగా పడుతోంది. పర్ఫెక్ట్ పొలిటీషియన్ అని నిరూపించుకుంటున్నారు కేసీయార్.ఆయన పన్నే వ్యూహాలు,రాజకీయ ఎత్తుగడలు ప్రత్యర్ధుల అంచనాకు అందటం లేదు.ఆయన వేసే మొదటి ఎత్తు చూడగానే పప్పులో కాలేశారు అన్పిస్తుంది.కానీ,ఆట ముందుకు సాగుతున్న కొద్దీ ఆయన యెంత ముందుచూపుతో ఆ ఎత్తు వేశారో అర్ధం అవుతుంది.

ప్రత్యర్ధులు ఊహించనంత మెరుపువేగంతో వ్యూహాలు రచించి అంతే వేగంతో అమలు చేస్తారు.ముందస్తు అనుకున్నప్పటి నుంచీ ఇప్పటిదాకా ఆయన చేసిన వాటిని ఒకసారి విశ్లేషిద్దాం.కేసీయార్ ను వ్యతిరేకిస్తున్న వివిధ పక్షాలు గత నాలుగేళ్ళుగా వివిధ రూపాల్లో వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టి పని చేస్తున్నాయి.ఎవరికి వారుగా విడివిడిగా పనిచేసుకుంటూ పోతున్నాయి.వాస్తవానికి రాష్ట్రంలో ఎన్నికలు పార్లమెంటుతో పాటు 2019 మే నెలలో జరగాలి.వైరి పక్షాలు అన్నీ అదే ఆలోచనలో ఉండేవి.ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇవన్నీ ఏకమై పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మించాలని ప్లాన్ చేశాయి.ఉద్యమాలను సుదీర్ఘ కాలం నడపటం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరు నెలల ముందైతే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను లేవనెత్తి దాన్ని ఎన్నికల వరకూ కొనసాగించి లబ్ది పొందవచ్చని భావించాయి.దాంతో ఇంకా చాలా టైం ఉందిలే అనుకుంటూ అలసత్వాన్ని ప్రదర్శించాయి.అపర చాణక్యుడైన కేసీయార్ ఇదంతా ముందే ఊహించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ఆ అవకాశం ఇవ్వకూడదు,వాళ్ళు ఏమరుపాటుగా ఉన్నప్పుడే కోలుకోలేని దెబ్బ కొట్టాలీ అని నిర్ణయించుకున్నారు. దాంతో ముందస్తు ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

అనుకున్నదే తడవుగా తన చతురంగ బలాలను రంగంలోకి దింపారు.ముందస్తు ఎన్నికల సాధ్యాసాధ్యాలు,సాంకేతిక సమస్యలు,వాటిని అధిగమించటం ఎలా ? అనే అంశాలపై కూలంకుషంగా వర్కవుట్ చేశారు.ముందస్తుకు లైన్ క్లియర్ చేసుకున్నారు. ఆ తర్వాత తనకు సన్నిహితులైన మంత్రులు,ఎమ్మెల్ల్యేలతో రహస్యంగా మాట్లాడారు.ముందస్తుకు వెళితే ఎలా ఉంటుంది అని అడిగారు.కొందరు మీరెలా నిర్ణయిస్తే అలాగే అన్నారు.మరికొందరేమో ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు ఎన్నికలు అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా ,తట్టుకో గలమా? అని సందేహాలు వ్యక్తం చేశారు.దాంతో తన ఆలోచనలను వారికి విడమర్చి చెప్పారు.పార్లమెంట్ తో పాటు ఎన్నికలకు వెళితే స్థానికంగా మనం సాధించిన విజయాల కన్నా,జాతీయ అంశాలే ప్రాధాన్యత సంతరించుకుంటాయి.అప్పుడు మనం కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది ,ముందస్తుకు వెళితే మనం ఖచ్చితంగా గెలుస్తాం.ఒకసారి రాష్ట్రంలో మనం అధికారం లోకి వస్తే ,పార్లమెంట్ ఎన్నికలను సునాయాసంగా ఎదుర్కోవచ్చు అని హితోపదేశం చేసి అందరినీ ఒప్పించారు.తద్వారా పార్టీలో తన నిర్ణయానికి ఎదురు లేకుండా చేసుకున్నారు. అలా అన్ని వైపులా నుంచీ లైన్ క్లియర్ చేసుకున్నాక చకచకా పావులు కదిపారు.

అసెంబ్లీ రద్దుచేయటం,ఒకేసారి 105 మంది అభ్యర్ధులను ప్రకటించటం జరిగింది.మొదటి నుంచీ సిట్టింగ్ లందరికీ టికెట్లు ఇస్తానని చెప్తూ ఉండటం,ఆమాట ప్రకారమే ఇద్దరినీ మినహాయించి అందరికీ టికెట్లు ఇవ్వటం జరిగింది.అప్పటిదాకా 30 శాతం మంది సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వరంటూ సాగిన ఊహాగానాలకు తెర దించారు.పార్టీలో ఉవ్వెత్తున ఎగసిన అసమ్మతికి ఎక్కడా తలవంచలేదు.సామదానభేదదండోపాయలన్నీ ఉపయోగించి చాలావరకు అసమ్మతిని అణచటంలో విజయం సాధించారు. ఆ తర్వాత టికెట్లు ఇచ్చిన వారందరికీ బీ ఫారాలు ఇవ్వరు.కనీసం 30 మందిని మారుస్తారు అనే ప్రచారాన్ని ప్రత్యర్ధులు లేవనెత్తారు.అది కూడా వమ్ము చేస్తూ నిన్ననే అందరికీ ఒకేసారి బీఫారాలు ఇచ్చేశారు.వరుసగా అయన పకడ్బందీగా వేస్తున్న అడుగులకు ఆయన విమర్శకులు కూడా ఫిదా అయిపోతున్నారు.రియల్ లీడర్ అంటే ఇలానే ఉంటాడు అని వాళ్ళ చేతనే ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రతీరోజు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధుల బలాబలాలు,రోజువారీ కార్యక్రమాల నివేదికలు తెప్పించుకోవటం,వాటిని విశ్లేషించటం,ఎప్పటికప్పుడు అభ్యర్ధులతో మాట్లాడటం,దిశానిర్దేశం చేయటం మరో ఎత్తు.ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతీ నియోజక వర్గంలో బూత్ స్థాయిలో ఏం జరుగుతుందో కూడా కళ్ళు మూసుకొని ఫింగర్ టిప్స్ మీద చెప్పగలిగినంత సమాచారం ఆయన మెదడులో నిక్షిప్తమై వుంది.

మరో మాట,టికెట్లు ప్రకటించిన నాడు ఖచ్చితంగా ఓడిపోతారనే భావించిన క్యాండిడేట్లు కొందరు గెలుపు బాట పట్టారు.ఆ నియోజకవర్గాల్లో పరిస్థితులు పూర్తిగా తెరాస కు అనుకూలంగా మారాయి.మరో వైపు కూటమిలో లుకలుకలు,పొత్తులు,టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ అనుసరిస్తున్న ధోరణి కూడా తెరాస కు బాగా కలిసి వస్తోంది.ఇప్పుడు ధైర్యంగా చెప్పగలను.ఈ ఎన్నికల్లో తెరాస ఖచ్చితంగా 100 సీట్లు సాధిస్తుంది.ఒక సీటు ఎక్కువైతే కావచ్చు కానీ,ఒక్కటి కూడా తగ్గదు.ఇది తధ్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here