హైదరాబాద్ కాదు, సైబరాబాదే … దెబ్బకు దిగివచ్చిన బాబు

0
325

తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అబద్దాలే చెపుతారు. దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర శాసనసభలో చెప్పినట్టు చంద్రబాబుకు శాపం ఉంది. నిజం మాట్లాడితే అయన తల వెయ్యి ముక్కలు అవుతుందేమో. అందుకే అయన రాజకీయ జీవితం అంతా అబద్దాల ఇటుకలపై నిర్మించుకున్నారు. “హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా”…. “హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే” … “హైదరాబాద్ కు ఐటీ తెచ్చింది నేనే” … “హై టెక్ సిటీ నావల్లే వచ్చింది” ఇలాంటి ప్రకటనలు గడచిన నాలుగేళ్ళుగా అయన చెప్పగా, అయన పచ్చమీడియా భజంత్రీలు ఓహో అనగా వింటున్నాం. అయితే ఇందుకు భిన్నంగా నిన్న హైదరాబాద్ లో మాట్లాడుతూ పాక్షికంగా ఒక నిజం చెప్పారు. ఆ నిజం కూడా పాక్షికమే కాబట్టి శాపం వర్తించక అయన తల వెయ్యి ముక్కలు కాలేదు. “హైదరాబాద్ కాదు… సైబరాబాద్ నిర్మించింది నేనే” అని తొలిసారి చంద్రబాబు ప్రకటించారు. ఇది ఒక రకంగా అయన మొదటిసారి ఎన్నో మెట్లు దిగినట్టే. తన హయాంలోనే సైబరాబాద్ నిర్మాణం జరిగిందని చెప్పారు. అయితే కులీ కుతుబ్ షా నిర్మించిన హైదరాబాద్ తాను నిర్మించిన సైబరాబాద్ వల్లే ప్రపంచ పటంలోకి వెళ్లిందని పరోక్షంగా అయన మరో అబద్దం చెప్పారు.

Image result for chandrababu

సైబరాబాద్ వల్లే హైదరాబాద్ కు ప్రపంచంలో గుర్తింపు వచ్చిందని అయన ప్రగాఢ విశ్వాసం. అయితే సైబరాబాద్ పేరు పెట్టింది ఆయనే కావచ్చు, కానీ దాని నిర్ణయం, అక్కడ ఐటీ స్థాపన వంటివి ఆయనకంటే ముందు జరిగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా సైబరాబాద్ నగరానికి, ఐటీ సంస్థలకు పునాదిరాయి పడింది. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి మాదాపూర్ ప్రాంతాన్ని ఐటీ కోసం ఎంపిక చేసి హై టెక్ సిటీ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఈ దేశానికి ఐటీ తెచ్చింది నేనే అని చెప్పుకునే చంద్రబాబు అప్పట్లో ప్రతిపక్ష పార్టీ నేతగా ఈ హైటెక్ సిటీ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ నగరంలో ధర్నాలు చేశారు. హై కోర్టులో కేసు వేశారు. మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో భూములు కాజేయడానికి, ప్రభుత్వ భూములు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టటానికి కాంగ్రెస్ ప్రభుత్వం హైటెక్ సిటీ పేరుతొ కుట్రలు చేస్తోందని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ముఖ్యమంత్రి జనార్ధన రెడ్డిని ధనార్జన రెడ్డి అంటూ అవహేళన చేశారు.

Image result for cyberabad

ఒక్క హైటెక్ సిటీ మాత్రమే కాదు అప్పట్లో జనార్ధన రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రైవేట్ యాజమాన్యంలో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతిస్తే కూడా చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను బ్రష్టు పట్టిస్తోందంటూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటూ అనేక ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటూ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఇవన్నీ మర్చిపోయి ప్రైవేట్ కళాశాలలు తెచ్చింది నేనే, టెక్నాలజీ తెచ్చింది నేనే, హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే… హైటెక్ సిటీ నిర్మించింది నేనే… బిల్ క్లింటన్ ని అమెరికా అధ్యక్షుడు చేసింది నేనే … బిల్ గేట్స్ ని బిలియనీర్ చేసింది నేనే… సత్యా నాదెళ్లను ప్రోత్సహించింది నేనే… అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తూ ఆ మోసాలతోనే తన రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్నారు. ఎవరూ ఎల్లకాలం ప్రజలందరినీ మోసం చేయలేరు… అబద్దాలు ఎల్లకాలం చెల్లవు. ఈ వాస్తవాలు ఇప్పుడు చంద్రబాబుకు అర్ధం అవుతున్నట్టున్నాయి. అందుకే అయన పాక్షికంగా అయినా నిజాలు మాట్లాడుతున్నారు. ఈ మాత్రం నిజాలు అయన నోటివెంట రావడం ఎదో గుడ్డిలో మెల్లలా కొంత మేలే. ఇప్పటికైనా ఆయనను గుడ్డిగా నమ్మే యువత, చంద్రబాబు గత చరిత్ర తెలియని యువత ఆలోచించడం మొదలుపెడితే మంచిది. హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే అనే చంద్రబాబు సైబరాబాద్ నిర్మించింది నేనే అని చెప్పుకునే స్థాయికి రావడం ఈ రాష్ట్రానికీ, ప్రజలకు మంచిరోజులు వస్తున్నాయని ఆశించడానికి అవకాశం వచ్చినట్టైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here