బాబుగారు హాజరైంది యూపీఏ సమావేశానికి

0
659

తెలుగు తమ్ముళ్ళు, పచ్చ మీడియా గత రెండురోజులుగా రాష్ట్రంలో ఊదరగొడుతున్నట్టు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల సమావేశానికి హాజరు కాలేదు . దేశంలో బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తున్నారు అంటూ తెగ ప్రచారం చేశారు. దేశానికీ ఇక చంద్రబాబే దిక్కు అన్నంతగా మీడియాలో ఊదరగొట్టారు. దేశంలో మహాత్మా గాంధీ తర్వాత ప్రజలను పాలకులకు వ్యతిరేకంగా నడిపించబోయే మరో మహాత్ముడు చంద్రబాబే అన్నంతగా ప్రచారం చేశారు.

కొద్దిపాటి రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ ఒక్కరూ ఈ ప్రచారాన్ని నమ్మకపోయినా తెలుగు తమ్ముళ్ళు, పచ్చ మీడియా పదే పదే అదే చెప్తూ వచ్చారు. తీరా ఢిల్లీలో చూస్తే చంద్రబాబు హాజరైంది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సమావేశానికి. యూపీఏ లో భాగస్వాములుగా ఉన్న రాజకీయ పార్టీలూ, వాటి నేతలు సోనియా గాంధీ అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంటులో అనుసరించబోయే విధానంపై నిర్ణయం కోసం రాజకీయ పార్టీలు, కూటములు ఇలాంటి సభలు నిర్వహించడం సర్వసాధారణం.

ప్రభుత్వం కూడా ఇలాంటి సమావేశాన్ని పార్లమెంట్ సమావేశాల ముందురోజు నిర్వహిస్తుంది. దాన్నే అఖిలపక్ష సమావేశం అంటారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి కూడా ఈ సమావేశానికి హాజరై సభను సజావుగా నిర్వహించేందుకు సహకరించవలసినదిగా అన్నిపక్షాలనూ కోరతారు. కేంద్ర పార్లమెంటరీ వ్యహారాలశాఖా మంత్రి నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి అన్ని పక్షాలు హాజరవుతాయి. అలాగే ప్రతిపక్షాలు కూడా ఆయా పార్టీల పార్లమెంటరీ సమావేశం నిర్వహించి సభలో తాము అనుసరించాల్సిన విధానాలను నిర్ణయిస్తారు.

ప్రతిపక్ష కూటమి కూడా మిత్రులైన పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తారు. సరిగ్గా నిన్న ఢిల్లీలో జరిగింది ఇలాంటి సమావేశమే. యూపీఏ నేతృత్వంలో సోనియా గాంధీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆ సమావేశంలోకి మొదటిసారి చంద్రబాబు ప్రవేశించారు. అంతే తప్ప అయన ప్రతిపక్ష నేతల సమావేశం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.

చివరికి నిన్న కేంద్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేసిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధినేత ఉపేంద్ర కుష్వా కూడా ఎన్ డి ఏ నుండి బైటకు వచ్చి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు తప్ప చంద్రబాబు తో సమావేశం కాలేదు. నిన్న మొన్నటివరకు ఉపేంద్ర కుష్వా తో కలిసి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. తాను ఎన్ డి ఏ నుండి బైటకు వస్తూ ఉపేంద్ర లాంటి ఒక్క నేతను కూడా వెంట తీసుకురాలేకపోయారు. చివరికి బయటకు వచ్చిన ఉపేంద్రను కూడా తన నేతృత్వంలో కాంగ్రెస్ కూటమిలో కలిపే ప్రయత్నం జరగలేదు. కేవలం ముగ్గురు ఎంపీలు ఉన్న ఉపేంద్ర కుష్వా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ కూడా చంద్రబాబును గుర్తించలేదు. ఇది వాస్తవం.

దేశం మొత్తాన్ని నరేంద్ర మోడీ, బీజేపీ కి వ్యతిరేకంగా జట్టు కట్టిస్తున్నా అంటూ చంద్రబాబు ఊదరగొడుతుంటే ఉపేంద్ర కుష్వా వంటి నేతకూడా చంద్రబాబును సీరియస్ గా తీసుకోలేదు. ఇది మన బాబుగారి ఢిల్లీ రాజకీయల అసలు రంగు. తమ్ముళ్ళు ఇకైనైనా మీడియా గొప్పలు ఆపి వాస్తవాలకు దగ్గరగా ఉంటె మంచిది. లేకపోతె ఇలా నవ్వులపాలు కావలసి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here