ఫిరాయింపులపై బాబు రెండు నాల్కల ధోరణి

0
388

ఆయనో నిప్పు. ఆ మాట కూడా ఆయనే చెప్పుకుంటారు. అయన నీతి, నిజాయితీలకు మారు పేరు. ఈ మాట కూడా ఆయనే చెప్పుకుంటారు. అయన కష్ట జీవి. ముందుచూపు ఉన్న రాజకీయ నేత. అవినీతికి దూరంగా ఉండే వ్యక్తి. అభివృద్ధే ధ్యేయంగా పనిచేసే గొప్ప నాయకుడు. అయన మరో మహాత్మా గాంధీ. ఇవన్నీ ఎవరో ఆయనగురించి చెప్పినవి కావు. ఆయనే చెప్పుకున్న విషయాలు. ఆయనకు ఆయనే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటారు. ఆయనకు ఆయనే బిరుదులు ఇచ్చుకుంటారు. ఎవరో ఇచ్చేవరకూ ఆగరు. అదీ అయన పద్దతి.ఇలాంటి నిప్పు రాజకీయ పార్టీల్లో నేతల ఫిరాయింపుల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఎప్పుడూ తనకు అనుకూలంగానే మాట్లాడుకుంటారు. ఇప్పుడు అయన మరోసారి ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు. ఇంతకాలం అయన అవకాశవాద రాజకీయాలను భరించిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఒక్కొక్కరుగా ఇక నిన్ను భరించలేం బాబూ అంటూ పార్టీని వీడి పారిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ నుండి వలసలు మొదలయ్యాయి. ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడుని వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తెలుగుదేశం పార్టీ వదిలి వెళ్లిపోయారు. వెళ్ళిపోతున్నవారు చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను ఎండగట్టి మరీ వెళ్లిపోతున్నారు.

తెలుగుదేశం పార్టీ నుండి మొదలైన ఈ వలసలు రానున్న రోజుల్లో మరీ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ వలసలు చంద్రబాబు విజయావకాశాలను భారీగా దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకాలం చంద్రబాబు ఆడుతూ వస్తున్న మైండ్ గేమ్ ఇప్పుడు ఆయనపైనే పనిచేస్తోంది. తెలుగుదేశం పార్టీ వదిలి వెళ్ళిపోతున్న నేతలంతా అయన అవినీతి గురించి, అవకాశవాద రాజకీయాలగురించి విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా అంశంపై అయన తీసుకున్న యూ టర్న్ లు తమను ఎంతగా ఇబ్బంది పెట్టాయో చెపుతున్నారు. ప్రతిరోజూ తాము హోదాకు అనుకూలమా, వ్యతిరేకమా అని ఓసారి చెక్ చేసుకొని మాట్లాడాల్సిన పరిస్థితులగురించి చెప్తున్నారు. అలాగే ప్రతిరోజూ తాము బీజేపీకి అనుకూలమా, వ్యతిరేకమా? కాంగ్రెస్ ను విమర్శించాలా లేక బీజేపీని విమర్శించాలా అని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చెక్ చేసుకొని మాట్లాడాల్సి వచ్చిన దౌర్భాగ్య పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారు.

ప్రత్యేక హోదా కావాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం… ఆ తర్వాత హోదాకు బదులు ప్యాకేజిని స్వాగతించడం… హోదా అన్నవారిని విమర్శించడం… హోదాతో ఏం లాభం వస్తుంది అంటూ ప్రత్యర్థులపై ఎదురు దాడి చేయడం… రాజీనామాలతో ఏం వస్తుంది అనడం… అవిశ్వాస తీర్మానంతో ఏం సాధిస్తాం అనడం… మోడీతో స్నేహం ద్వారానే రాష్ట్రానికి అన్నీ సాధించుకోగలం అనడం …. తర్వాత రాజీనామాలు చేయడం … అవిశ్వాస తీర్మానం పెట్టడం … చివరికి కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం … ఈ అంశాలన్నీ తెలుగుదేశం నేతలకు తలనొప్పి అంశాలే… కేవలం పచ్చమీడియా అండగా ఉందికాబట్టి చంద్రబాబు ఎప్పుడు, ఎలాంటి అబద్దం చెప్పినా చెల్లుబాటు అయింది. కానీ ఇతర నాయకులకు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మొహం చెల్లని పరిస్థితి ఇప్పుడు పార్టీని వదిలి వెళ్ళేనేతలు బహిరంగంగా చెపుతున్నారు.అయితే ఇలా పార్టీ వదిలి వెళ్ళే నేతల పట్ల చంద్రబాబు చాలా చులకన వ్యాఖ్యలు చేస్తున్నారు. పైగా ఇదేదో కొత్త విషయంలాగా ఇందులో పెద్ద కుట్ర ఉందని చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కలిసి రాష్ట్రంపైన, తెలుగుదేశం పార్టీపైనా, తన నాయకత్వంపైనా కుట్ర చేస్తున్నారని చంద్రబాబు ఆరోపణలు మొదలు పెట్టారు. తన రాజకీయ ప్రత్యర్థులను రాష్ట్ర ప్రజలకు ప్రత్యర్థులుగా చెప్పడం చంద్రబాబుకే సాధ్యం. రాష్ట్రంలోని ఐదుకోట్ల మందికి మూకుమ్మడిగా తానే ప్రథినిధిని అనే భ్రమలో అయన ఉండి ప్రజలను కూడా అదే భ్రమలో పెట్టాలని చూస్తున్నారు.

తెలంగాణాలో తెలుగుదేశం శాసనసభ్యులు అధికార తెరాసలో చేరితే చంద్రబాబు స్పందన ఓరకంగానూ, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష వైస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యులు తన తెలుగుదేశం పార్టీలో చేరితే అయన స్పందన మరో రకంగానూ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీనుండి శాసనసభ్యలు వేరే పార్టీలో చేరితే ఇంకోరకంగానూ స్పందించడం చంద్రబాబుకే చెల్లుతుంది. తెలుగుదేశం పార్టీ నుండి శాసనసభ్యులు తెరాసలో చేరితే అది పశువులను సంతలో కొన్నట్టు ఆయనకు కనిపిస్తుంది. అదే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష వైస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరితే తన అభివృద్ధి చూసి వచ్చారని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తెలుగుదేశం పార్టీనుండి వలసలు మొదలైతే అది జాతీయ, అంతర్జాతీయ కుట్రగా ఆయనకు కనిపిస్తుంది. పైగా అది రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రజలపైన కుట్రగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీని కాపాడడం రాష్ట్ర ప్రజల బాధ్యతగా అయన చెపుతారు. అయన అధికారాన్ని కాపాడడం, ఆయన్ని గెలిపించడం ప్రజల బాధ్యత అంటూ నీతులు వల్లిస్తుంటారు. ఇది చంద్రబాబు మార్కు రాజకీయం. అయితే ఎంత పచ్చమీడియా అండ ఉన్నా ఎల్లకాలం అబద్దాలు ప్రజలు నమ్మరు… అంగీకరించరు. ఈ విషయం ఇప్పటికైనా చంద్రబాబుకు అర్ధం అయితే అయన శేషజీవితం అయినా ప్రశాంతంగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here