కట్టు కథలు ఆపు – కట్టు బట్టలతో ఎవరు రమ్మన్నారు బాబూ?

0
386

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అయన పచ్చ తమ్ముళ్ళు, పచ్చ మీడియా ప్రతిరోజూ చెప్పే మాట కట్టుబట్టలతో వచ్చాం… బసులో పడుకున్నాం… రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం… రాజధాని నిర్మిస్తున్నాం అని. ఈ కబుర్లతో, కన్నీళ్ళతో ఈ నాలుగున్నరేళ్ళు కబుర్లు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఇవే కబుర్లతో, కన్నీళ్ళతో జనంలోకి వెళ్ళి మరో సారి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి తరిమేశారు అని కూడా చెపుతూ ప్రజల్లో సానుభూతి సంపాదించి ఓట్లు సాధించే ప్రయత్నం కొనసాగుతోంది. అయితే హైదరాబాద్ నుండి కట్టుబట్టలతో విజయవాడ ఎందుకు రావలసి వచ్చింది? ఎవరు తరిమేశారు? నిలువ నీడలేక బసులో ఎందుకు పడుకోవలసి వచ్చింది? ఇక్కడ ఇన్నికోట్లు ఖర్చు పెట్టి ఇంత హడావిడిగా ఎందుకు రాజధాని నిర్మించాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు చంద్రబాబు, అయన పచ్చ తమ్ముళ్ళు, పచ్చ మీడియా జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఇది రాష్ట్రంలో విద్యావంతులు, నిరక్షరాస్యులు అడుగుతున్న ప్రశ్నలు. జవాబు కోసం వారు ఎదురుచూస్తున్న పరిస్థితి.

రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు కొనసాగుతుందని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ మేరకు హైదరాబాద్ లో ఆస్తులను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కూడా కేటాయించారు. సచివాలయ భవనాలు, శాఖాధిపతుల భవనాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస గృహాలు, అధికారుల నివాస గృహాలు, మంత్రులు, ముఖ్యమంత్రి నివాస గృహాలు, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వంటివి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయించారు. ఈ కేటాయించిన భవనాలకు అనుగుణంగా భారీ మార్పులు కూడా చేశారు. ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు కేటాయించిన భవనాల్లో మరోసారి భారీగా ఖర్చు పెట్టి తనకు అనుకూలంగా మార్పులు చేసుకున్నారు. ఈ మార్పుల తర్వాత పదేళ్ళపాటు అక్కడే ఉంటూ ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ భవన సదుపాయాలు కల్పించుకొని పదేళ్ళ తర్వాత నెమ్మదిగా కొత్త రాజధానికి తరలి రావచ్చు. ఒకవేళ పదేళ్ళలోపు ఇక్కడ రాజధాని నిర్మాణం పూర్తికాకపోతే మరో పదేళ్ళ సమయం కూడా తీసుకోవచ్చు.

అయితే ఈ సదుపాయాలు అన్నీ వదిలేసి అర్ధరాత్రి కట్టుబట్టలతో ఇక్కడకు రావలసిన పరిస్థితి ఎందుకొచ్చింది? అధికారం కోసం కుట్రలు చేసి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన తర్వాత అరెస్టుకు భయపడి అర్ధరాత్రి బస్సులో విజయవాడ పారిపోయి రావలసి వచ్చింది. కట్టుబట్టలతో హైదరాబాద్ వదిలి రావాల్సివచ్చింది విభజన కారణంగా కాదు. తన అవినీతి చర్యల ప్రతిఫలంగానే. ఇందులో విభన ప్రభావం ఏమీ లేదు. ఎవరినీ నిందించాల్సిన పని లేదు. బస్సులో నిద్రపోవాల్సిన పరిస్థితికి కూడా విభజన కారణం కాదు. అయన అవినీతే కారణం.అలా అర్ధరాత్రి కట్టుబట్టలతో హైదరాబాద్ వదిలి పారిపోయి వచ్చి ఇప్పుడు కన్నీళ్ళు కారిస్తే ఓట్లు రాలవు. ఇక అయన హైదరాబాద్ వదిలి రావటమే కాకుండా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా విజయవాడకు తరలించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో ఉన్న భవనాలను వదిలేసి ఇక్కడ అద్దె భవనాల్లో భారీ అద్దెలు చెల్లించాల్సిన పరిస్థితి కేవలం చంద్రబాబు వల్లనే కానీ దీనితో రాష్ట్ర విభజనకు ఎలాంటి సంబంధం లేదు. ఉమ్మడి రాజధానిలో ప్రభుత్వ భవనాల్లో ఉండవలసిన ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ భారీ అద్దెలు చెల్లిస్తూ ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టవలసిన పరిస్థితి చంద్రబాబు అధికార దాహం వల్ల ఏర్పడింది తప్ప రాష్ట్ర విభజనలో జరిగిన అన్యాయం కాదు.

వేలకోట్లు చెల్లిస్తూ రాజధాని అత్యధిక వ్యయంతో నిర్మించాల్సిన పరిస్థితి కూడా చంద్రబాబు గొప్పలకే చెల్లింది కానీ వాస్తవానికి ఇంత వ్యయం చేయవలసిన అవసరం లేదు. ఈ విషయం గతంలో శివరామకృష్ణన్ కమిషన్ కూడా స్పష్టం చేసింది. కొత్త రాజధాని నిర్మాణానికి కొన్ని సూచనలు చేసింది. అయితే ఆ సూచనలు ఏవీ చంద్రబాబు పట్టించుకోలేదు. ఆర్ధిక లోటుతో ప్రారంభమైన రాష్ట్రానికి తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించుకోవలసి ఉండగా నాలుగు దశాబ్దాల అనుభవం, ప్రపంచ మేధావి అని చెప్పుకునే చంద్రబాబు ఇంత భారీ ఖర్చులు పెట్టి ఖజానాను కొల్లగొట్టటం సమర్ధనీయం కాదు.

రాజధాని నిర్మాణానికి ఖర్చు. రాజధాని నిర్మాణం అయ్యేలోపు ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె ఖర్చు. హైదరాబాద్ నుండి అమరావతికి వచ్చినందుకు ఉద్యోగులకు, అధికారులకు చెల్లించే నజరానాల ఖర్చు, బడా కాంట్రాక్టర్లకు చెల్లించే ఖర్చులు, ఈ పనులకోసం ప్రచారంపై పెట్టే ఖర్చు… ఇప్పుడు సందర్శకులను తీసుకొస్తూ పెట్టే ఖర్చు. ఇలా చంద్రబాబు రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతూ కట్టుబట్టలతో వచ్చాం అని కన్నీరు పెడితే నమ్మి ఓటేసేందుకు ప్రజలు కేవలం పచ్చమీడియా మాత్రమే చూడడం లేదు. వారికీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. నిజాలు నిర్భయంగా చెప్పే రాజకీయాలు డాట్ కామ్ వంటి మాధ్యమాలు ఉన్నాయి. ఇంకోసారి కట్టుబట్టలతో వచ్చాం అని చంద్రబాబు కానీ అయన తెలుగు తమ్ముళ్ళు కానీ, పచ్చమీడియా కానీ చెపితే ఎందుకొచ్చారు కట్టుబట్టలతో? ఎవరు పంపించారు కట్టుబట్టలతో? ఎవరివల్ల వచ్చారు కట్టుబట్టలతో అని ప్రశ్నించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here