సెంటిమెంట్లు రెచ్చగొట్టే ప్రయత్నంలో చంద్రబాబు

0
390

ఎన్నికలు సమీపిస్తుండడం, ఓటమి తప్పదని సర్వేలు తెలియజేస్తుండడంతో తెలుగు తమ్ముళ్ళకు, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడుకి ముచ్చెమటలు పడుతున్నాయి. ఎన్ని పధకాలు ప్రకటించినా, ప్రభుత్వ ఖజానానుండి ఎంత సొమ్ము కొల్లగొట్టి పంచిపెట్టినా జనం తనకు ఓట్లు వేయబోవటంలేదనే వాస్తవం చంద్రబాబుకు అయన తమ్ముళ్ళు, పచ్చ మీడియా బానిసలకు మింగుడు పడడం లేదు. ఈ నాలుగున్నరేళ్ళుగా తాము చేసిన అవినీతి, పాల్పడిన అరాచకాలు, ఆడిన అబద్దాలు ప్రజలు మర్చిపోలేదని అర్ధమవుతోంది. అందుకే కొత్తదారులు వెతుక్కుంటున్నారు. తాను ఎన్ని మలుపులు తిరిగినా, ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా పదే పదే తాను చెప్పే అబద్దాలు పచ్చ బానిస మీడియా ఎంత విస్తృతంగా ప్రచారం చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. అందుకే అయన ఇప్పుడు సరికొత్త రాగం అందుకుంటున్నారు. రాష్ట్రంలో 2013 నాటి సీమాంధ్ర సెంటిమెంట్ రెచ్చగొట్టీ ప్రయత్నం మొదలు పెట్టారు. రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోలేక ఇప్పుడు ఈ రాగం మొదలు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కలిసి ఈ రాష్ట్రంపై కుట్ర చేస్తున్నారు అంటూ కూనిరాగం మొదలు పెట్టారు. 2014 నుండి 2018 వరకూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలనూ, ప్రజా సంఘాలను, ప్రజలను బెదిరించి పాలన సాగించిన చంద్రబాబు, తనకు అన్నీ తెలుసనీ, కేంద్రంతో పోరాటం కంటే స్నేహమే మేలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజి మేలని, తనకున్న పాలనానుభవం ప్రతిపక్ష నేతలకు లేదని, ప్రతిపక్ష నేతలు రాక్షసుల్లా తనను వేధిస్తున్నారని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు దేశంలో అందరూ తనపై కక్షసాధింపుకు దిగారని, రాష్ట్రంపై కుట్ర చేస్తున్నారని మొసలి కన్నీరు కారుస్తున్నారు.

చిన్న పిల్లలు నా చాక్లెట్ లాక్కున్నారు అని ఏడ్చినట్టుగా దేశమంతా తిరుగుతూ మోడీ మోసం చేశాడు అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. గడచిన ఏడెనిమిది నెలలుగా చంద్రబాబు కార్చే కన్నీరు కృష్ణా నదిలో ఇప్పుడు వేగంగా ప్రవహిస్తోంది. పట్టిసీమ నుండి కృష్ణా డెల్టాకు ఎంత నీరు వచ్చిందో తెలియదు గాని చంద్రబాబు మొసలి కన్నీరు మాత్రం వేగంగా ప్రవహిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దన్నది ఎవరు? హోదా అడిగితే జైల్లో పెడతా అన్నది ఎవరు? హోదా ఉన్న రాష్ట్రాలు ఏం సాధించాయి అన్నది ఎవరు? ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు కుట్రలు, కుతంత్రాలు, అన్యాయం, అక్రమం అంటూ మొసలి కన్నీరు కారిస్తే జనం నమ్ముతారని, పైగా 2013 నాటి సీమాంధ్ర సెంటిమెంటు రెచ్చగొడితే తాను మళ్ళి గెలవొచ్చని చంద్రబాబు చేస్తున్న సరికొత్త కుట్ర. అందుకే పదేపదే మోడీ, కెసిఆర్, జగన్ కుమ్మక్కయ్యారని, కుట్ర చేస్తున్నారని లబో దిబో అంటూ ఏడ్పులు మొదలు పెట్టారు.

అయితే చంద్రబాబు మర్చిపోతున్నదేమంటే రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలకు పచ్చ బానిస మీడియా కంటే విస్తృతంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందని, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పచ్చమీడియా చెప్పని నిజాలు తెలుస్తున్నాయని. చంద్రబాబు ఎప్పటికప్పుడు యూ టర్న్ తీసుకుంటూ చెప్పే కథలు, పచ్చమీడియా వండి వార్చే కథనాలు ప్రజలు ఇంకా నమ్మరు. ప్రజలు అందర్నీ, అన్నివేళలా మోసం చేయలేరు. ఇప్పటికి చాలాసార్లు ప్రజలు చంద్రబాబు చేతిలో మోసపోయారు. రైతు ఋణమాఫీ, డ్వాక్రా మహిళల ఋణమాఫీ, చేనేత కార్మికుల ఋణమాఫీ వంటి హామీలు గాలికి వదిలేసి కట్టుకథలు చెపితే ఇంకా జనం నమ్ముతారనే భ్రమలో చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఉంటేనే ఈ రాష్ట్రానికి మంచిది. వారు ఆ భ్రమల్లో ఉంటేనే ప్రజలు తగిన బుద్ధి చెపుతారు.

ఇప్పుడు చంద్రబాబు ఎన్ని కన్నీళ్ళు కార్చినా, ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా, పచ్చ బానిస మీడియా ఎంత ప్రచారం చేసినా సీమాంధ్ర సెంటిమెంటు మళ్ళీ రాదు. వచ్చినా అది చంద్రబాబుకు అనుకూలంగా ఉండదు. ప్రజలు అమాయకులు కాదు. మోడీ, కెసిఆర్, జగన్ కుమ్మక్కయ్యారో, లేదో, వాళ్ళు ఈ రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారో లేదో, జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంపై పోరాటం చేస్తున్నాడో లేక తెలుగు ప్రజలపై పోరాటం చేస్తున్నాడో తెలుసుకోలేనంత అమాయకులు, అవివేకులు కాదు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు. చంద్రబాబు కరకట్ట వదిలి హుస్సేన్ సాగర్ గట్టుకు వెళ్ళాల్సిన సమయం అతి దగ్గరలోనే ఉంది. అంతవరకూ చంద్రబాబు ఏడుపులూ, పెడబొబ్బలూ, పచ్చమీడియా పిచ్చి కూతలు భరించక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here