రాజకీయ వ్యాపారి జీవీ ఆంజనేయులు

0
1041

గుంటూరు జిల్లాలో వినుకొండ నియోజకవర్గానికి చాలా ప్రాధాన్యత వుంది . అధికార తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. పదేళ్లుగా శాసనసభ్యుడిగా వ్యవహరిస్తున్న ఆంజనేయులుకు అనతికాలంలోనే పారిశ్రామికవేత్తగా ఎదిగిన నేపథ్యం వుంది. గత రెండుపర్యాయాలుగా గెలిచిన అయన చేబ్రోలు నరేంద్ర,నన్నపనేని సుధా లాంటి కొత్త అభ్యర్థుల మీద పోటీ చేసారు. అందుకే అయన అదృష్టవశాత్తు ఎమ్యెల్యేగా గెలిచారని సొంత పార్టీలోనే కొందరు గుసగుసలాడుతుంటారు. ఎమ్యెల్యేగా పనిచేసిన ఈ పదేళ్లలో అయన వ్యాపారం అభివృద్ధి చెందినంతగా వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని జిల్లాలో పలువురు రాజకీయ విశ్లేషకులు సెటైర్లు వేస్తుంటారు.

వినుకొండ పట్టణ ప్రజలను ఏళ్లతరబడి వేధిస్తున్న మంచినీటి సమస్యకు శాశ్విత పరిష్కారం చూపుతానని,డ్రైనేజీ సమస్యను పరిష్కరించి పారిశుద్ధ్య సమస్య లేకుండా చేస్తానని ,ప్రజలకు అందుబాటులో ఉంటానని, అవినీతికి ఆస్కారమివ్వకుండా పరిపాలన చేస్తానని అనేక హామీలు చేసిన ఆంజనేయులు కనీసం ఒక్క హామీనైనా నెరవేర్చలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించిన సమ్మర్ స్టోరేజిలు మినహాయించి వినుకొండ పట్టణంలో కొత్తగా ఒక్కరక్షిత మంచినీటి పథకం అయినా మంజూరు చేయలేదని విమర్శలు వినవస్తున్నాయి. సరిగ్గా పనిచేయని ఫిల్టర్ బెడ్స్ తో మునిసిపాలిటీ సరఫరా చేస్తున్న నీళ్లు మురుగు నీటిలా దుర్వాసన వేస్తుండటంతో ప్రజలు ఆ నీటిని తాగలేక బబుల్ వాటర్ కొనాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇక సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ఎన్టీఆర్ సుజల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. డ్రైనేజి సమస్య మరింత పెరిగి ఎక్కడి మురుగు అక్కడే అన్న చందంగా తయారయ్యింది. మునిసిపల్ పాలకవర్గం, అధికారులు,తెలుగుదేశం నాయకులు కలిసి కుమ్మక్కై చేతులు తడిపిన వారందరికీ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడంతో కాల్వలమీదే గృహాలు,షాపులు నిర్మించుకున్నారు. దీంతో మురుగు నీరు పారే వీలులేకుండాపోయింది. డ్రైనేజి సమస్య మరింతగా జటిలం అయ్యింది.

వినుకొండ నియోజకవర్గంలో అధికారపార్టీ నాయకుల అవినీతి దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడమే తరువాయి ఎమ్యెల్యే ఆంజనేయులు అవినీతికి తలుపులు బార్లా తెరవడంతో పచ్చ తమ్ముళ్లు అందినకాడికి దోచుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా పేదల బియ్యం మీద కన్నేసిన జీవీ మండలాలవారీగా డీలర్ల మీద ఒత్తిడి చేసి బియ్యం అక్రమ రవాణా పై వచ్చే ఆదాయాన్ని ద్వితీయ శ్రేణి నాయకులకు నెలవారీ మాముళ్లుగా ముట్టచెప్పే ఏర్పాట్లు చేసినట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. కొందరు తెలుగు తమ్ముళ్లయితే సొంత దుకాణం పెట్టుకొని పేదల బియ్యాన్ని అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్నారని తెలుస్తుంది. రెండుచేతులతో దోచుకుంటున్నది సరిపోక ప్రభుత్వ కార్యాలను కూడా కొందరు నాయకులకు పంచిపెట్టినట్లు ప్రజలు చెప్పుకుంటున్నారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ఒక మండల నేతకు, పోలీస్ స్టేషన్ ను ఇద్దరు పట్టణ నాయకులకు,జీవీ సొంత వ్యాపార సంస్థ శివశక్తి మేనేజర్ కు , ఎండీవో కార్యాలయాన్ని ఒకరికి, పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బీ కార్యాలయం మరొకరికి పంచి పెట్టి దానిమీద ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ కొత్త తరహా అవినీతిని చూసి అధికారులు బెంబేలెత్తిపోతున్నారని ఒక అధికారపార్టీ నాయకుడు చెప్పడం గమనార్హం. ఇసుక,మట్టి దోపిడీ యథేచ్ఛగా జరిగిపోతోంది. జన్మభూమి కమిటీల ఆగడాలకు ప్రజలు ఇక్కట్లపాలవుతున్నారని విపక్షాలు విమర్శిష్టున్నాయి.

ఎమ్యెల్యే ఆంజనేయులు చేస్తున్న మరో ముఖ్యమైన కార్యక్రమం ఉచిత కంటి ఆపరేషన్లు. ఎంతో ప్రచారార్భాటంతో నిర్వహించే ఉచిత కంటి ఆపరేషన్ల కార్యక్రమం మాత్రం తెలుగుదేశం పార్టీ పేరు మీద కాకుండా శివశక్తి పేరు మీద నిర్వహిస్తుండటం పలువురిని ఆలోచనకు రేపుతోంది. ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి శంకర నేత్రాలయం వారు చేస్తున్న ఉచిత నేత్ర వైద్యసేవలను శివశక్తి ఉచిత వైద్యసేవలుగా ప్రచారం చేసుకోవడం దారుణమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కంటి ఆపరేషన్ల మీద విచారణ జరిపితే అసలు నిజాలు బయటికి వస్తాయని పలువురు కోరుతున్నారు.ఆంజనేయులు ప్రజాసేవలో డొల్లతనం ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఎమ్యెల్యే ఆంజనేయులు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని పలువురు నాయకులూ వాపోతున్నారు. వినుకొండకు పార్ట్ టైం కేటాయించిన అయన అమరావతిలో ఫుల్ టైమ్ గడుపుతున్నారనే వాదనలున్నాయి. వినుకొండలో ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేస్తే గంటల తరబడి ఆలస్యంగా హాజరవుతూ ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తున్నారని కొందరు ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రతి కార్యక్రమానికి అంగన్ వాడి టీచర్లను,డ్వాక్రా గ్రూపు మహిళలను తరలిస్తుండటంతో వారి పరిస్థితి వర్ణనాతీతంగా తయారయ్యింది. ఎమ్యెల్యే కార్యక్రమం అంటేనే ఉద్యోగులు భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇక ఎమ్యెల్యే ఆంజనేయులు నోరు తెరిస్తే చాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి మొదలుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరకు ప్రతి ఒక్కరి మీద విమర్శలు గుప్పిస్తుండటం హాస్యాస్పదంగా మారిందనే అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి. స్థాయి మరిచి విమర్శలు చేస్తుండటంతో అయన అంటే చులకన భావం ఏర్పడిందని అధికారపార్టీ కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here