నిజమే, మోడీని చూసి బాబు భయపడుతున్నారు

0
726

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని చూసి భయపడుతున్నారా? నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు, దేశానికి పలువురు ప్రధానులు, రాష్ట్రపతులను అందించిన మహానేత ఇప్పుడు నరేంద్ర మోడీని చూసి భయపడం విచిత్రంగానే ఉన్నా అయన భయం నిజమేనని ఈ రోజు పచ్చమీడియా చూస్తే ఎవరికైనా ఇట్టే అర్ధం అవుతుంది. నిన్న విశాఖపట్నంలో మాట్లాడిన నరేంద్ర మోడీ కూడా చంద్రబాబుకు తనంటే భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో అవినీతి తారాస్థాయికి చేరిందని, ఆ అవినీతిని తాను ప్రశ్నిస్తున్నందుకే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ పక్షాన తలదాచుకుంటున్నారని నరేంద్ర మోడీ తీవ్ర చేశారు. మరోవైపు అమరావతిలో పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడిన చంద్రబాబు తనలోని భయాన్ని స్పష్టంగా బయట పెట్టారు. “మోడీ తీవ్రస్వరంతో మాట్లాడుతున్నారు. ఆ తీవ్రత చూస్తే ఒకవేళ ఇప్పుడు నేను కనిపిస్తే కొడతారేమో అనే భయం కలుగుతోంది” అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించి తనలో మోడీ పట్ల భయాన్ని బహిరంగంగా అంగీకరించారు.

అయితే  అసలు చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ అంటే భయం ఎందుకు కలుగుతోంది అనేది ప్రధాన ప్రశ్న. రాష్ట్రంలో గడిచిన నాలుగున్నరేళ్ళలో వివిధ సందర్భాల్లో, వివిధ పేర్లతో ప్రభుత్వ ఖజానా నుండి పెద్ద మొత్తంలో వృధా ఖర్చులు చేస్తూనే ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ ఖర్చు వందల కోట్ల రూపాయలు దాటిపోయింది. విదేశీ ప్రయాణాలు, స్వరాష్ట్రంలో ప్రయాణాలు, ఉత్సవాలు, నవనిర్మాణ దీక్షలు, ధర్మపోరాట దీక్షలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పెంచిన అంచనాలు, పోలవరం, అమరావతి నిర్మాణాలు, నిర్మాణాల సందర్శనకు భారీ సంఖ్యలో ప్రజలను తరలించడం, విశాఖలో పెట్టుబడుల సదస్సులు, రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు, ప్రత్యేక విమానంలో ప్రయాణాలు… ఇలా ఒక్కటేమిటి చంద్రబాబు ప్రభుత్వ ఖజానాను దోచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే నారావారి పల్లెలోనూ, హైదరాబాద్ లోనూ, అమరావతి కరకట్ట కింద తన నివాసం కోసం చేసిన ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ముతో అయన తన ఇళ్ళకు మెరుగులు అద్దుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు మోడీ బయటకు తీస్తారనే భయం చంద్రబాబులో కనిపిస్తోంది.

ఇక కేంద్రం నుండి ఈ నాలుగున్నరేళ్ళలో వివిధ పధకాల ద్వారా రాష్ట్రానికి వచ్చిన నిధులు కూడా పెద్ద మొత్తంలో దుర్వినియోగం అయినట్టు ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, భాజపా నాయకులూ పదేపదే చెపుతున్నారు. కొన్ని సందర్భాల్లో కేంద్ర నిధులు దారిమళ్ళించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. విజయవాడ, గుంటూరు నగరాలకు కలిపి కేంద్ర ఇచ్చిన వెయ్యికోట్ల రూపాయలు ఎక్కడికిపోయాయో లెక్కలేదు. కేంద్రం ఇచ్చిన నిధులకు వినియోగ పత్రాలు (యూసీలు) సక్రమంగా ఇవ్వలేదని కేంద్రం అనేక సందర్భాల్లో చెప్పింది. సరైన యూసీలు ఇవ్వాలంటే నిధులు సరైన పద్దతిలో వినియోగించి ఉండాలి. అయితే ఆ నిధులు నవనిర్మాణ దీక్షలకు, ధర్మ పోరాట దీక్షలకు, కేంద్రంపై నిరసన కార్యక్రమాలకు తరలించడం వల్ల యూసీలు ఇవ్వలేని పరిస్థితి. అందువల్లే చంద్రబాబు ప్రధాని మోడీ అంటే భయపడుతున్నారు. కనిపిస్తే కొడతారేమో అనే వ్యాఖ్యలు చేసే పరిస్థితి వచ్చిందంటే నిధుల దుర్వినియోగంపై ప్రధాని ఎంత పట్టుదలగా ఉన్నారో స్పష్టంగా తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here