మంగళగిరిలో బుజ్జిబాబు బోల్తా పడక తప్పదా?

0
1420

గుంటూరు జిల్లా మంగళగిరి శాసన సభ బరిలోకి దిగాలని చంద్రబాబు పుత్రరత్నం నిర్ణయించుకున్నట్టు వార్తలొస్తున్నాయి. మొదట విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం అన్నారు. ఆ పైన విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం అన్నారు. అంతకు ముందెప్పుడో తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం అని తర్వాత విజయవాడలోని పెనమలూరు నియోజకవర్గం అని ఇలా అనేక నియోజకవర్గాలు ప్రచారం చేసి పరిశీలించిన తర్వాత చివరికి బుజ్జిబాబు మంగళగిరి అయితే ఒకే అనేశారంట. మంగళగిరి ఎన్నికోడానికి కుల పార్టీకి ప్రధానంగా రెండు కారణాలు దొరికాయి. మొదటి కారణం ఈ నియోజకవర్గంలో 2014లో తెలుగుదేశం అభ్యర్థి కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోవడం. ఈ ఐదేళ్ళ తర్వాత 12 ఓట్లు సాధించడం పెద్ద కష్టం కాదని తాము సులువుగా గెలవగలం అని కులపార్టీ, కుల మీడియా నిర్ధారణకు వచ్చేసింది. ఇక బుజ్జి బాబు కోసం మంగళగిరి ఎంపిక చేసుకోడానికి రెండో కారణం తమ కుటుంబం మూడేళ్ళుగా ఉండవల్లిలో నివాసం ఉండడం. అక్కడే ఓటు హక్కు కూడా పొందటం. ఈ కారణాలతో తాము మంగళగిరిలో అవలీలగా గెలవగలం అనే భరోసాతో బరిలో దిగారు.

అయితే వారు అనుకున్న అనుకూల అంశాలేవీ ప్రస్తుతం పనికొస్తాయని రాజకీయ విశ్లేషకులు భావించడం లేదు. మంగళగిరి మొదటినుండి కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గం. డాక్టర్ ఎం ఎస్ ఎస్ కోటేశ్వరరావు హయాంలో 1983, 1985 ఎన్నికల్లో మినహా ఇప్పటివరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది లేదు. సిపిఎం ప్రభావం కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ స్థానం కాంగ్రెస్ పార్టీ అనుకూల స్థానం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఓటర్లంతా వైస్సార్ కాంగ్రెస్ పక్షాన నిలవడంతో 12 ఓట్లు కానీ 10 ఓట్లు కానీ, అవన్నీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం తప్ప తెలుగుదేశానికి అనుకూలంగా మారే అవకాశం లేదు. పైగా ఇక్కడ ప్రస్తుత శాసన సభ్యుడు ఆళ్ళ రాకంకృష్ణా రెడ్డి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి ఇటీవలే తన నివాసాన్ని, పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఇదే నియోజకవర్గం పరిధిలోని తాడేపల్లికి మార్చారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక శాసనసభ్యుడికి మద్దతు పెరుగుతుంది తప్ప కొత్తగా వచ్చే బుజ్జిబాబు (లోకేష్)కు కాదు. అందులోనూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ఆర్కే ని ఓడించడం బుజ్జిబాబుకు సాధ్యమయ్యేపని కాదు.

అన్నిటికంటే మించి మంగళగిరి నియోజక వర్గంలో భాగమైన తాడేపల్లి మండలం వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ రెడ్డి సామజిక వర్గం ఆధిపత్యం కొంత ఎక్కువే. ఇక్కడ ఎన్నికల్లో గెలవాలంటే చేనేత కార్మికుల మద్దతు అవసరం. అది పూర్తిగా ఆర్కే పక్షాన ఉంది. ఇప్పటికే ప్రపంచ రాజధాని నిర్మించాలని కలలు కంటున్న చంద్రబాబు తాడేపల్లి మండలంలోని గ్రామాల్లో పాదం మోపలేకపోయారు. రాజధాని భూసమీకరణ తుళ్ళూరు మండలంలోని గ్రామాల్లో జరిగినంతగా తాడేపల్లి, మంగళగిరి గ్రామాల్లో జరగలేదు. తాడేపల్లి మండలంలోని తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో చంద్రబాబు సెంటు భూమి కూడా సేకరించలేకపోయారు. అందుకే తాను గొప్పగా చెప్పుకుంటున్న రాజధాని సీడ్ యాక్సిస్ రోడ్డు తలా తోకా లేకుండా మొండెంతోనే ఉంది. తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాక గ్రామాల ప్రజలు సహకరిస్తే మాత్రమే ప్రపంచ రాజధాని నిర్మాణం ఎంతో కొంత చేయగలుగుతారు. అలాగే మంగళగిరి మండలంలోని కొన్ని గ్రామాల్లో కూడా ప్రజలు రాజధాని భూసమీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ గ్రామాల ప్రజలంతా చంద్రబాబుకు వ్యతిరేకమే.

ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నడుమ చంద్రబాబు తన పుత్రరత్నాన్ని మంగళగిరి నియోజక వర్గానికి పంపడం ఏ రకం రాజకీయమో కుల మీడియా చెప్పాలి. పైగా మంగళగిరి ప్రాంత ప్రజలు ఈ నాలుగేళ్ళలో రాజధానిలో చంద్రబాబు చేసిన పనులన్నీ స్వయంగా దగ్గరుండి చూస్తున్న వారు. ఇతర ప్రాంతాల ప్రజల్లాగ రాజధాని పనులను డిజిటల్ లో చూడాల్సిన అవసరం లేనివారు. చంద్రబాబు ఎంత చెప్పారో, ఎంత ఖర్చు చేశారో, ఎంత అభివృద్ధి చేశారో చూస్తున్న ప్రత్యక్ష సాక్షులు. వీరిని కుల మీడియా, డిజిటల్ మీడియా మోసం చేయలేదు. అందువల్ల బుజ్జిబాబు ఇక్కడ బోర్లా పడక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here