RajakeeyaaluRajakeeyaalu

Wednesday, January 24, 2018

చంద్రబాబు దుబారా తో ఆర్ధికంగా రాష్ట్రం దివాలా….యనమల

  • January 10, 2017 | UPDATED 23:22 IST Views: 457
  • Share

 

ఆంధ్ర ప్ర‌దేశ్ అంటే అన్న‌పూర్ణ‌.. అది ఒక‌ప్ప‌టి మాట‌. మ‌రి ఇప్పుడో…ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుగారి మాట‌ల్లో ద‌రిద్ర ల‌క్ష్మి. ఏమిటీ పోలిక‌..!! అనుకోకండి. మంగ‌ళ‌వారం ఆయ‌న ప‌లికిన చిల‌క‌ప‌లుకులు రానున్న ఉత్పాతాన్ని సూచిస్తున్నాయి. బ‌డ్జెట్ ముందు రోజుల‌లో చేసే ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల వెనుక అంత‌రార్ధం సామాన్య పౌరుడికి సైతం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. త్యాగాల‌కు సిద్ధ‌మైపొమ్మ‌ని చెప్ప‌డ‌మే ఇది. ఇక ఉపోద్ఘాతాన్ని ఆపేసి అస‌లు విష‌యానికి వ‌చ్చేస్తున్నాం. య‌న‌మ‌ల గారు చెప్పిన మాట ఆంధ్ర ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితి అత్యంత ద‌య‌నీయంగానూ, ఆందోళ‌నక‌రంగానూ ఉంద‌ని. 

dubara1
        ఖర్చులు పెరిగిపోతున్నాయట‌.. ఆదాయం అంతగా లేదట‌. అంచనాలకు మించి రెవెన్యూ లోటు 10 వేల కోట్ల మేర పెరిగిందట‌. ద్రవ్యలోటు కూడా 4 వేల కోట్లకు పైగా పెరిగిపోయింద‌ట‌. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత రాష్ట్ర ఆదాయం 7శాతం తగ్గిందట‌. 2016-17 ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించిన 1,35,688 కోట్లలో 94,415 కోట్లు ఇప్పటికే ఖర్చు అయిపోయ‌ట‌. ఎఫ్ఆర్‌బిఎమ్ పరిధిని నాలుగు శాతానికి పెంచితేనే ఆర్థిక వెసులుబాటు సాధ్యమవుతుంద‌ని య‌న‌మ‌ల చెబుతున్నారు. కేంద్ర క్యాబినెట్ దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని ఆయ‌న మొర‌పెట్టుకుంటున్నారు. ఆర్థిక కష్టాలు ఎదుర్కొనేందుకు సమాయత్తమ‌వుతున్నామ‌ని ఆఖ‌రుగా చెప్పారు. 

          అస‌లు విష‌యం ఇక్క‌డే ఉంది. స‌మాయ‌త్త‌మ‌వ‌డ‌మంటే.. ఉద్యోగుల జీతాలు త‌గ్గిస్తారా. లేక ఖ‌ర్చులు త‌గ్గించుకుంటారా.. మొద‌టి చేస్తే ఉద్యోగ వ‌ర్గాలు తాట తీస్తాయి. రెండోది చేయాలంటే మ‌న‌కి ప్ర‌చార‌మే ఉండ‌కుండా పోతుంది. అంటే త్యాగం చేయ‌డానికి ఎవ్వ‌రూ ముందుకురారు. ప్ర‌జ‌లే త్యాగం చేయాలంటారు. ఎప్ప‌టికైనా త్యాగం చేయాల్సింది ప్ర‌జ‌లే. పైన చెప్పిన క‌థ‌తో ఇప్ప‌టివ‌ర‌కూ 12.23శాతం ఆర్థిక ప్ర‌గ‌తి సాధించామంటూ చెప్పుకొచ్చిన కంచికి చేరిపోయిన‌ట్లే. లోటు 14వేల 134కోట్ల‌కు చేరింద‌ని య‌న‌మ‌ల తెలిపారు.

dubara2
      కేవ‌లం నోట్ల ర‌ద్దు కార‌ణంగానే ఇంత‌టి విప‌త్తు క‌లుగుతోంద‌ని అనుకోవ‌డం మూర్ఖ‌త్వ‌మే అవుతుంది. ఒక ఇంటి పెద్ద ఉన్నాడంటే త‌ను నోరు క‌ట్టుకునైనా పిల్ల‌ల‌కి క‌డుపునిండా అన్నం పెడ‌తాడు. ఇక్క‌డ మ‌న ముఖ్య‌మంత్రిగారి తీరు వేరు. లైటేసినా నన్ను గుర్తుచేసుకోండంటూ చెప్పుకుంటున్న ఆయ‌న త‌న ఖ‌ర్చుల‌కు మాత్రం రాజీ ప‌డ‌రు. 2014లో ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర్నుంచి చేసిన దుబారాలు చూస్తే… ఆయ‌న ఒక రాష్ట్రానికి అధినేత‌గా రాష్ట్రం బాగోగులు చూడ్డం మాని ఆయ‌న బాగోగులు చూసుకున్నారు. మూడు కాన్వాయిలు.. మూడు వాస్తు దోషాలు… మూడు ఇళ్ళు మాదిరిగా పాల‌న సాగిపోతోంది. ఆయ‌న ముఖ్య‌మంత్రిగా  ప్ర‌మాణ స్వీకారం చేయ‌డానికి చేసిన ఆర్భాటం నుంచి ఇటీవ‌లి జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల వ‌ర‌కూ అంతా దుబారానే. ఈ దుబారా లెక్క తీస్తే వేల కోట్ల‌లోనే ఉంటుంది. క‌డుపుచించుకుంటే కాలిమీద ప‌డుతుందంటారు. ఆయ‌న చేసిన ఖ‌ర్చులు అదుపు చేసుకుని ఉంటే ఆర్థిక లోటు కొంతైన త‌గ్గుందేన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

dubara3
     దేశంలో ఏ ముఖ్యమంత్రీ ఇంత‌వ‌ర‌కూ చ‌రిత్ర‌లో ఎప్పుడూ చేయ‌నంత దుబారా బాబుగార హ‌యాంలో జ‌రిగింద‌నేది నిష్టుర సత్యం. హైదరాబాద్‌లో ఉండ‌గా సీఎం క్యాంపు కార్యాల‌యం మ‌ర‌మ్మ‌తుల‌కు 20 కోట్లు, స‌చివాల‌యంలో ఆయ‌న చాంబ‌ర్ ఆధునికీక‌ర‌ణ‌కు 20 కోట్లు, జూబ్లీ హిల్స్‌లో ఇంటి మ‌ర‌మ్మ‌తుల‌కు కోటిన్న‌ర‌, మ‌దీనాగుడాలో ఇంటికి ప‌ది కోట్లు ఖ‌ర్చు చేశారు. ఇదంతా ప్ర‌భుత్వ ఖాతానుంచే చేశారు. విజ‌య‌వాడ‌లో క్యాంప్ ఆఫీసుకు 20కోట్లు, కృష్ణా క‌ట్ట‌మీద ఉన్న ఇంటికి 20 కోట్ల రూపాయ‌లు వెచ్చించారు. ఆయ‌న ర‌క్ష‌ణ కోస‌మంటూ కేవ‌లం సెక్యూరిటీ కెమెరాల‌కు ప‌ది కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చుచేశారు.

dubara4
     చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల‌కోసం ప్ర‌త్యేక బ‌స్సును 5 కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో ఆర్టీసీ త‌యారుచేయించింది. లంచాలా, క‌మిష‌న్ల‌కు క‌క్కుర్తిప‌డి ప్రైవేటు విమానాలు, హెలికాప్ట‌ర్ల‌కు ఖ‌ర్చు లెక్కుండ‌దు. మొత్తం 1200 సార్లు ఇలా ప్రైవేటు విమానాలు, హెలికాప్ట‌ర్ల‌పై ఆయ‌న తిరిగుంటారు. శ్రీ‌కాకుళం వెళ్ళాలంటే నేరుగా హెలికాప్ట‌ర్లో వెళ్ళ‌చ్చు. కానీ వెళ్ళ‌రు. విజ‌య‌వాడ నుంచి విశాఖ‌కు ప్ర‌త్యేక విమానంలోనూ, అక్క‌డి నుంచి శ్రీ‌కాకుళానికి ప్రైవేటు హెలికాప్ట‌రులోనూ ప్ర‌యాణిస్తారు. అనంతపురం వెళ్ళాల‌న్నా అంతే బెంగ‌ళూరుకు ప్ర‌త్యేక విమానం అక్క‌డినుంచి హెలికాప్టరులో ప‌య‌నం. దీన్ని దుబారా కాక ఏమ‌నాలి. ఇన్ని ప‌ర్య‌ట‌న‌లున్నాయ‌ని తెలిసిన‌ప్పుడు సొంతంగా ఒక హెలికాప్ట‌ర్ కొనుగోలు చేయ‌వ‌చ్చు క‌దా. కొన‌రు. ఎందుకంటే క‌మిష‌న్లు రావు కాబ‌ట్టి.
    కృష్ణా, గోదావ‌రి పుష్క‌రాల‌కు 4వేల కోట్లు ఖ‌ర్చు చేశారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం మాటేమో గానీ, విజ‌య‌వాడ‌లో పుష్క‌రాల‌కు వేసిన రోడ్లు జారుకుటున్నాయి. స్నాన ఘ‌ట్టాలు అప‌విత్ర‌మ‌వుతున్నాయి. ప‌ట్టిసీమ ఎత్తిపోత‌ల‌కు చేసిన 1600కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు దుబారా కింద‌కే వ‌స్తుంది. పోల‌వ‌రం పూర్త‌యితే ఇది ఎందుకూ కొర‌గాద‌ని అంద‌రికీ తెలుసు. ప్ర‌క‌ట‌న‌లు, హోర్డింగుల‌కు చేసిన ఖ‌ర్చు 12వంద‌ల కోట్ల రూపాయ‌ల పైనే. థ్యాంక్యూ సిఎం అంటూ కృష్ణా పుష్క‌రాల అనంత‌రం చంద్ర‌బాబు బొమ్మ‌తో పెట్టుకున్న హోర్డింగ్ చ‌రిత్ర‌లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో నిలిచిపోతుంది. ఎందుకంటే త‌న‌కు తాను కృతజ్ఞ‌త‌లు చెప్పుకున్న ముఖ్యమంత్రి చ‌రిత్ర‌లో లేరు కాబట్టి.

dubara5
     రాజ‌ధాని అమరావ‌తి శంకుస్థాప‌నంటూ వెయ్యికోట్లు ఖ‌ర్చు చేసి, ప్ర‌ధాని నుంచి స్వర్ణ మృణ్మ‌య‌(మ‌ట్టి నింపిన బంగారు క‌ల‌శం) పాత్ర‌ను అందుకున్నారు మ‌న ఘ‌న‌త వ‌హించిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. ఆయ‌న స‌భ‌ల‌కు జ‌నాల‌ను త‌ర‌లించేందుకు ఇంత‌వ‌ర‌కూ 150 నుంచి 200 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసుంటారు. ప‌వ‌ర్ ప‌ర్చేజ్ ఒప్పందాల‌కు ఏడాదికి 1200 కోట్ల వ‌రకూ సంస్థ‌ల‌కు ధారపోస్తున్నారు. తిరుప‌తిలో ఆంధ్ర జ్యోతి దిన‌ప‌త్రిక‌కు 50 కోట్లు విలువ చేసే భూమిని అప్ప‌నంగా క‌ట్ట‌బెట్టారు. స‌మీక్ష‌లంటూ స్టార్ హొట‌ళ్ల‌కు చెల్లించింది 60 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉంటుంది. ఆర్బీఐ నుంచి అప్పులు, వాటికి వ‌డ్డీలు ఉండ‌నే ఉన్నాయి. 45 మంది ప్ర‌త్యేక స‌ల‌హాదారుల‌కు ఏడా 240 కోట్లు ఖ‌ర్చవుతున్నాయి. దావోస్‌, శ్రీ‌లంక లాంటి దేశాల‌కు వెళ్ళే ఖ‌ర్చుల‌న్నీ ఆయ‌న ప్ర‌తిష్ట‌ను పెంచుకునే పెయిడ్ ట్రిప్పులే. పూణెలో బెస్ట్ సీఎం అనిపించుకున్నా..దావోస్‌లో శ‌భాష్ అనిపించుకున్నా.. ఇండియా టుడే కాన్‌క్లేవ్ లో పాల్గొన్నా అన్నీ ఆయ‌న ఖ‌ర్చుతో చేసుకున్న‌వే. అంటే ప్ర‌జాధ‌నం ఖ‌ర్చుతో సాగిన‌వే. అన్నీ వంద‌ల కోట్ల రూపాయ‌లే.
        విభజన చట్టప్రకారం హక్కు గా పొందాల్సిన రెవెన్యూ లోటు 15 వేల కోట్ల లో గడిచిన 30 నెలల కాలం లొ ఒక్క రూపాయి కూడా సాధించలేని అత్యంత చేతగాని నాయకుడు చంద్రబాబు ని 40 యేళ్ళ అనుభవజ్ఞుడు అని ఊదర కొట్టిన మేధావి వర్గం మాత్రం ఈ దుబారా,చేతగానితనాల మీద నోరు మెదపటం లేదు…కారణాలు బహిరంగ రహస్యమే…   కొత్త రాష్ట్రం.. క‌ష్టాల్లో ఉన్న త‌రుణంలో బాధ్య‌త‌లు స్వీక‌రించిన ముఖ్య‌మంత్రి వ్య‌వ‌హ‌రించాల్సిన తీరు ఇదేనా. ఇదే.. కాబ‌ట్టే… ఆంధ్ర ప్ర‌దేశ్ ఆర్థికంగా ఆందోళ‌న‌క‌ర స్థితిలో ప‌డిపోయింది. చంద్ర‌బాబుగార్ని ప్ర‌తిరోజూ దీపం పెట్టుకునేప‌ట‌ప్పుడు త‌ల‌చుకోవాలంటే.. దుబారా మానాలి. త‌న‌వారికోసం కాక‌, ప్ర‌జ‌ల‌నూ, రాష్ట్రాభివృద్దిని కాంక్షించాలి.

Video Credits: Nyusu Digital Media