RajakeeyaaluRajakeeyaalu

Friday, February 23, 2018

T కాంగ్రెస్ కు కొత్త బాస్….?

  • October 12, 2017 | UPDATED 11:00 IST Views: 1600
  • Share

 

కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి చూస్తుంటే ఎక్క‌డేసిన గొంగ‌ళి అక్క‌డే ఉన్న చందంగానే క‌న్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా, స‌రైన వ్యూహం లేక‌పోవ‌టంతో కాంగ్రెస్ పార్టీ   గ‌త ఎన్నిక‌ల్లో బొక్కబోర్ల ప‌డింది. ప్ర‌త్యేక రాష్ట్రం ఇచ్చి కూడా ఫ‌లితాన్ని రాబ‌ట్టుకోలేకపోయింది. ఈ మూడున్న‌ర ఏళ్లలో ప్ర‌తిప‌క్షంగా కూడా చూపాల్సినంతగా ప్ర‌భావం చూపలేక‌పోతుంది. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో తెలంగాణ కాంగ్రెస్‌లో దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది.  గ్రూపులు, ముఠాల‌తో వ‌ర్దిల్లే కాంగ్రెస్‌లో అంద‌ర్ని క‌లుపుకుని పార్టీని ముందుకు తీసుకెళ్ల‌టం అంత సులువైన టాస్క్ కాదు.  నల్గొండ జిల్లా గ్రూపు కుమ్ములాటలు ఓ రేంజ్ లో కొనసాగుతున్న సంగతి తెల్సిందే.  కుంతియా ఏమిటో స్ప‌ష్టం అయిన త‌ర్వాత ఆయ‌న‌పై అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. వ్య‌వ‌హారం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌కు అధిష్టానం భ‌రోసా ఇచ్చింది.  దీంతో  కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ పైచేయి సాధిస్తారా?  పార్టీ అధిష్టానానికి లాయ‌ల్‌గా ఉన్న ఉత్త‌మ కుమార్ రెడ్డి ఏం చేయ‌బోతున్నారు? అనేది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స‌ర్కిల్స్‌లో చ‌ర్చనీయాంశంగా మారింది.

 ఎన్నిక‌ల ముందు నుంచి ఆ మూడున్న‌ర ఏళ్లు రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జిగా ఉన్న‌ దిగ్విజ‌య్ సింగ్‌ ను త‌ప్పించి అప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు స‌హకార్య‌ద‌ర్శిగా ఉన్న కుంతియాకు తెలంగాణ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఆయ‌న ముక్కు సూటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌టంతో  తేడా వ‌చ్చేసింది. కాంగ్రెస్‌లో అంత ముక్కుసూటి త‌నం ప‌నికి రాద‌ని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అంటే చాలా ప‌వ‌ర్ ఫుల్‌. CM ను కూడా నియంత్రించే శ‌క్తి ఉంటుంది. దాంతో  దిగ్విజయ్‌ స్థానంలో పగ్గాలు చేపట్టిన కుంతియాపై చాలా మంది T- కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు ఇన్‌చార్జ్‌గా పార్టీని నడిపించేంత స్థాయి లేదంటూ నేరుగా వెళ్లి సోనియా, రాహుల్‌లకే ఫిర్యాదు చేశారు. కుంతియా కేవలం ఉత్తమ్‌ కుమార్ రెడ్డి చెప్పినట్టు నడుచుకుంటున్నారన్నది కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పాటు చాలా మంది ఫిర్యాదు చేశారు. దీని వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతోందంటూ సోనియాకు బాగా సన్నిహితుడైన ఒక మాజీ రాజ్యసభ సభ్యుడు నేరుగా రాహుల్‌కు ఫిర్యాదు చేశారు. అవ‌స‌రం అయితే పార్టీని వీడ‌తామని కూడా కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ ఓ ద‌శ‌లో ప్ర‌క‌టించారు. దాంతో అధిష్టానం దిగివ‌చ్చింది. కుంతియాను మార్చి ఆజాద్‌ను నియ‌మిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ వ్య‌వ‌హారాల్లో పార్టీ సీనియ‌ర్ నేత జైపాల్ రెడ్డి కీల‌క పాత్ర పోషించారు. ఆయ‌న రాజ‌గోపాల్ రెడ్డితో ఈ విష‌యాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. అంతే కాకుండా పార్టీ అధిష్టానంతో చ‌ర్చించి, రాజ‌గోపాల్ రెడ్డిని ఢిల్లీకి వెళ్ల‌మ‌ని స‌ల‌హా ఇచ్చారు. దాంతో నేరుగా ఆజాద్తో భేటీ అయిన రాజ‌గోపాల్ రెడ్డి అన్ని విష‌యాల‌పై క్లారిటీ తెచ్చుకున్నార‌ని తెలుస్తోంది.
 ఆజాద్ పాత కాపే. తెలుగు రాష్ట్రాల‌తో సుదీర్ఘ‌మైన అనుబంధం ఉంది. చాలా కాలం పాటు ఇన్ ఛార్జి గా వ్య‌వ‌హారించారు. 2004లోదివంగ‌త నేత YS రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాద యాత్ర చేప‌ట్టిన‌ప్పుడు కూడా ఆజాద్ ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఇప్ప‌డు కాంగ్రెస్ గ్రూపులు ఓ రేంజ్‌లో ఉన్నాయి. YS పాద యాత్ర‌ కు పోటీకి హ‌నుమంతురావు కూడా సైకిల్ యాత్ర చేప‌డ‌తాన‌ని ప్ర‌క‌టించారు. కానీ అప్పుడు PCC చీఫ్‌ గా ఉన్న స‌త్య‌న్నారయ‌ణ రావు అందుకు అంగీక‌రించ‌లేదు. ఆజాద్ కూడా ప్ర‌త్య‌ర్దుల‌కు భ‌య‌ప‌డి YS పాదయాత్ర ముగింపు స‌భ‌లో పాల్గొన‌కుండానే ఢిల్లీ వెళ్లారు. ఆయ‌న ఎత్తులు అలా ఉంటాయి. గ్రూపుల‌ను సంతృప్తి ప‌ర్చ‌కుండా పార్టీని ఐక్యంగా ఉంచ‌లేమ‌ని ఆయ‌న‌కు బాగా తెలుసు.అందుకే గ్రూపుల‌తో, కుమ్ములాట‌ల‌తో కొన‌సాగే చోట‌కి ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొందిన ఆజాద్‌ ను నియ‌మిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ అదే చేసింది. ఆజాద్‌కు తెలంగాణ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌టానికి రంగం సిద్దం చేస్తున్నారు.  ఆయ‌న PCC ఇన్‌ఛార్జిగా ఉంటే తిరిగి అధికారంలోకి వ‌స్తుంద‌నే సెంటిమెంట్ కూడా ఉంది. ఆయ‌న గ‌తంలో క‌ర్నాట‌క‌, AP కి ఇన్ ఛార్జిగా ఉండ‌గానే అధికారంలో కాంగ్రెస్ పార్టీ వ‌చ్చింది.  సో తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ కి ఈ సెంటిమెంట్ క‌లిసి వ‌స్తోందా? ఇది వ‌ర్కౌట్ అవుతుందా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆజాద్ ఈ సారి ఏం మాయ చేస్తారో చూద్దాం.