RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

కోటి రూపాయలకు కక్కుర్తి పడిన ప్రజాప్రతి”నిధి”

  • February 23, 2018 | UPDATED 17:31 IST Views: 1060
  • Share

 

ప్రజలకు న్యాయం చేయడానికి వీలైనంతవరకు రాజకీయనేతలు చూస్తుంటారు. ఎందుకంటే వారి ప్రాబల్యం పెంచుకోవడానికి గాని మరలా తానే ప్రజలకు సేవచేయటానికి గానీ పోటీ పడుతూ రాజకీయంగా ఎదుగుతుంటారు.. కానీ విజయవాడ సెంట్రల్ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ప్రజాప్రతినిధి అనే పదానికే అర్ధం మార్ఛేశారు సదరు MLA.  నిత్యం ప్రజలను పీడిస్తూ తన స్వప్రయోజనాలకు వాడుకునే వాడే ఇప్పుడు నిజమైన ప్రతి”నిధి” అని ఈయన నిరూపిస్తున్నారు.  ఊరందరిదీ ఒక బాట అయితే విజయవాడ సెంట్రల్ నేతది ప్రత్యేకమైన బాట. ఆయన అందరూ నడిచే దారిలో నడవరు. తనకంటూ ఓ ట్రెండ్ సృష్టించుకుని ఆమార్గంలోనే ఆయన పయనిస్తూ ఉంటారు. తన దారికి అడ్డం వచ్చిన వారిని అధికార బలంతో పోలీసులను ప్రయోగిస్తూ నయానో, భయానో లొంగదీసుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అవసరమైతే బెదిరింపు లేకపోతే దౌర్జన్యం అంతకూ కుదరకపోతే అక్రమ కేసుల బనాయింపుతో ఎదుటవారిని దారిలో పెట్టడం ఆయన ప్రత్యేకత. రౌడీయిజాన్ని రాజకీయంగా మార్చుకుని దందాలు కొనసాగిస్తున్నా విజయవాడ పోలీసులు మాత్రం ఈయనకు ఎదురొచ్చి సెల్యూట్ చేయాల్సిందే.. అదే ఆయనకున్న ట్రేడ్ మార్క్… ల్యాండ్ సెటిల్ మెంట్స్, భూకబ్జాలు, దౌర్జన్యాలు, దందాలు అన్నీ ఇక్కడ ఈయన సొంతమే. ఆయనను  ప్రశ్నించే పోలీసు ఇక్కడుండడు. అలా ఎవరైనా ఉన్నారని తెలిసిన మరుసటి రోజే ఆయనపై బదిలీ వేటు తప్పదు. ఇదీ ఈయనగారి ఇలాకా..
ఇలా చెప్పుకుంటూ పోతే ఈయనగారి ఇలాకాలో తవ్విన కొద్దీ భూభాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తన నియోజకవర్గాన్నే ఓ మహా “గని” గా ఎంచుకున్న ఆయన కోట్లు దండుకుంటున్నారు. తన అధికార బలంతో భూకబ్జాలకు పాల్పడడమే కాకుండా దొడ్డి దారిలో పట్టాలిప్పిచ్చేస్తానని పేదలనుండి కోటి రూపాయలు గుటకాయ స్వాహా చేసిన వైనం నూతనంగా వెలుగులోకి వచ్చింది.


ఆయనెలాగున్నా పరవాలేదు గానీ ప్రైవేటు స్థలాలను ఆక్రమించేసుకునో, భూ కబ్జాలు చేస్తూ ఉంటే ఎవరైనా ఎలా ఊరుకుంటారు. ఇటీవలే తన భార్య పేరుతో సింగ్ నగర్లో స్వాతంత్ర్య సమరయోధులకు చెందిన ఓ స్థలాన్ని ఆక్రమించిన వైనం వెలుగులోకి వచ్చింది. అది మరువక ముందే మధురానగర్ లోని మరో స్థలవివాదంలో కోటి రూపాయల మేరకు మింగేసి ఇప్పుడు రిక్తహస్తాలు చూపించడంతో సుమారు 230 కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి ఎదురయ్యింది. ఆయన చేష్టలకు విసుగెత్తిన ఆ కుటుంబాలు ఆయనపై దండయాత్ర చేసేందుకు సన్నద్దమవుతున్నారు. ఆయన మాటలు విని మోసపోయామని వారు వాపోతున్నారు. తమకు పట్టాలిప్పిస్తానని చెప్పి తమ వద్ద కోటి రూపాయలు దండుకున్నారని ఆరోపిస్తున్నారు. ఆయన చేసిన దొంగదారి పనులతో తమకు పట్టాలు రాకపోగా ఉన్న డబ్బులన్నీ పోయి తమకున్న దారులన్నీ మూసుకుపోయి తాము రోడ్లపాలు కావాల్సివస్తోందని బాధితులు లబోదిబో మంటున్నారు. ఈ విషయం ఎవరు లీక్ చేసినా తమపని గోవిందా అంటూ గోడు వెళ్లబోసుకుంటున్నారు మధురానగర్లోని ఇందిరానగర్ కాలనీ వాసులు.

మధురానగర్ రైల్వే స్టేషన్ ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం పక్కా ప్రైవేటు ల్యాండ్. అక్షరాలా ఆరు ఎకరాల తొంభై సెంట్ల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం ఇనాం జాగీరుల సంతతిది. సుమారు ఏడుగురు వ్యక్తులకు చెందిన ఈ స్థలం 1947 నుంచి ఖాళీగానే ఉండటంతో స్థానికంగా ఉన్న కొందరు ఆశపరులు  కొంత స్థలాన్ని ఆక్రమించుకుని తాత్కాలికంగా ఇళ్లు కట్టేసుకున్నారు. అంతే కాదు ఇందిరాగాంధీ లేబర్ యూనియన్ సొసైటీకి సదరు స్థల యజమానులు విక్రయించినట్టు అగ్రిమెంటు కాగితాలతో సహా విజయవాడ సివిల్ కోర్టులో 1982లో దావా వేశారు. OS 555/82గా నమోదైన ఈ కేసులో వాయిదాల పర్వం గడుస్తున్న నేపధ్యంలోనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏలూరు సెటిల్మెంట్ ఆఫీసర్ సత్యరాజు ముందు కూడా ఈ కేసును ప్రవేశ పెట్టారు. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన నేపధ్యంలో order 8 rule 4 urban land seeling act ప్రకారం ఇందిరాగాంధి లేబర్ సొసైటీకి ఎలాంటి చట్టబద్ధతలేదని   ధృవీకరికరించారు.2004 వరకూ విజయవాడ సివిల్ కోర్టులోనూ వాయిదాలు జరిగిన అనంతరం ఇందిరాగాంధీ లేబరు సొసైటీకి చట్టబద్ధత లేదంటూ కేసును కొట్టేశారు. దాంతో జిల్లాకోర్టుకు అప్పీల్ కు వెళ్లగా 2011 వరకూ జరిగిన వాయిదాల నేపధ్యంలో పిటీషనర్లు సదరు స్థలం తమదేనని నిరూపించుకోవడంలో విఫలమయ్యారు.  దాంతో అప్పీల్ కోర్టుకూడా ఇందిరాగాంధీ లేబరు వెల్ఫేరు సొసైటి వారి పిటీషన్ ను డిస్మిస్ చేస్తూ అదేశాలిచ్చారు.

పక్కాగృహాలకు అనుమతులెలా వచ్చాయి…

    నిజంగా ఇక్కడ కనబడే దృశ్యాన్ని ఎవరైనా పరికించి చూస్తే ఇంత దారుణంగా ప్రజలను మోసం చేయొచ్చా అనే అనిపిస్తోంది. ఈ స్థలంలో పక్కా ఇళ్ల నిర్మాణం  చేసుకున్న ఏ ఒక్కరికీ కనీసం బీఫారం కూడా లేకపోవడం విచిత్రమే కదా.. రాజకీయ నేతలు ఎలాంటి ప్రలోభాలు పెట్టి వారికి ఎలాంటి భరోసా ఇస్తే ఇలా ఉంటారనేదానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పక్కా ఇంటి డాక్యుమెంట్స్‌ ఉంటేనే పక్కాగృహ నిర్మాణం చేసుకుంటుంటే నీకు ఇలాంటి అనుమతులెవరచ్చారని వేధింపులకు గురిచేసే టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఈ గృహాలకు కనీసం పన్నులేకుండా పక్కా ఇళ్ల నిర్మాణానికి అనుమతులెలా ఇచ్చారనేది అంతులేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. అందులోనూ కోర్టు పరిధిలో ఉన్న స్థలానికి ఇలా అన్ని వసతులు కల్పిస్తూ అనుమతులెలా వచ్చాయో కూడా ఓ పజిల్ గానే తయారయ్యింది.

మధురానగర్ లోని ఇందిరానగర్ గా పిలువబడుతున్న ఈ కాలనీకి అన్నాజీరావు వీధి,తోట కేదరేశ్వరరావు వీధి,రామాలయం వీధి,కుందుర్తి ఆనందరావు వీధులుగా నామకరణం చేసి హాయిగా కాపురముంటున్న వీరికి పక్కగా పట్టాలిప్పిస్తానని చెప్పి వీరి నుండి కోటి రూపాయలు వసూలు చేయడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. మీకు పట్టాలు కావాలంటే డబ్బులివ్వక తప్పదని మభ్యపెట్టడంతో వారందరూ తలో కొంచెం వేసుకుని పట్టాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటెరీ కి వీరు పెట్టుకున్న అభ్యర్థన నేపధ్యంలో  ఆయన గత నెల 9వతేదీన  వెలగపూడిలోని 4వ బ్లాక్ లో ఈ విషయమై చర్చించాలని జిల్లా కలెక్టరుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థలయజమానులు వారి లాయర్ ద్వారా ఇది పూర్తిగా ప్రైవేటు స్థలం ప్రభుత్వానికి దీనిపై ఎలాంటి హక్కూ లేదు. అలాంటి స్థలానికి  పట్టాలు పంపిణీ చేయడం  చట్టరీత్యా నేరమని ప్రభుత్వ చీఫ్ సెక్రటెరీకి, జిల్లా కలెక్టర్లకు లీగల్ నోటీసులు జారీ చేయడంతో కథ మళ్ళీ మొదటి కొచ్చినట్టయ్యింది.  హైకోర్టులో కూడా దావా వేసేందుకు వారు ఉద్యుక్తులవుతున్నారు. ఏదేమైనా ముందూ వెనుకా చూసుకోకుండా ఇలాంటి వివాద స్థలాల్లో నేతలు తలదూరిస్తే ప్రజలే నష్టపోతారనేది స్పష్టంగా తెలుస్తున్న నగ్నసత్యమిది.