August 19, 2018
info@rajakeeyaalu.com

చదివిన వారి సంఖ్య

 
Rajakeeyaalu

Rajakeeyaalu

పదవులన్నీ ఆ వర్గానికేనా..

పవన్ ముద్రేసుకుంటున్నారా..

                                                                                

ఊహించిందే జరుగుతుందా..ఆ వర్గం నుంచి పార్టీ వస్తే అది ఆ వర్గంకోసమే అన్నది నిజమవుతోందా..పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు అలా ఉంటున్నాయా..లేదా ఆయన్ని ప్రభావితం చేస్తోంది ఆ వర్గం. వాస్తవం ఏదైనా సరే..ఏ ముద్ర పడకూడదని పవన్ భావించారో ఆ ముద్ర దాదాపు పడిపోయింది ఇప్పుడు. జనసేన అంటే ప్రజారాజ్యం పార్టీ -2 అనేది నిజమేనని తెలుస్తోంది. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు ఇక్కడ కూడా చాలా కారణాలున్నాయి.

2012లో పార్టీని స్థాపించినా..అప్పట్లో బీజేపీ-చంద్రబాబుకు మద్దతిచ్చి తాము మాత్రం ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ విషయంలో జనసేనత చాలా పెద్ద రాజకీయతప్పిదం చేసిందన్న విమర్శలు వచ్చాయి. అప్పుడే పోటీ చేసి ఉంటే..సాధించుకున్న సీట్లతో ఈ ఎన్నికల నాటికి పార్టీని పటిష్టం చేసుకోడానికి అవకాశం ఉండేది. అయితే పోటీ చేయకపోవడం వల్ల..ఇటీవలే టీడీపీతో విబేధాల వల్ల ఈసారీ చావోరేవో తేల్చుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ పార్టీకు. అధికారం లక్ష్యం అయినా కాకపోయినా సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించడం ఆ పార్టీకు ముఖ్యం ఇప్పుడు. అయితే ఓ ఆరు నెలల నుంచే ఆయన పార్టీపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. పూర్తి జీరోగా ఉన్న పార్టీని నిర్మించడానికి...ఎన్నికలకు సిద్ధం చేయడానికి చాలా కష్టపడాల్సివస్తుంది. బహుశా అందుకేనేమో ఉత్తరాంధ్ర పర్యటన పూర్తి చేసుకుని..ఇప్పుడు పశ్చిమ పర్యటనను కొనసాగిస్తున్నారు. పార్టీపై కాపుల ముద్ర పడకుండా ఉండటానికి పవన్ మొదట్నించీ పూర్తి జాగ్రత్తలు తీసుకున్నా..ఇటీవలి కాలంలో విఫలమైపోయారు. ఏ ముద్ర పడకూడదని ఆయన భావించారో అది పడిపోయింది. పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఓ వైపు...ఆయన అభిమానుల వైఖరి మరో వైపు దీనికి కారణాలుగా తెలుస్తున్నాయి. పార్టీ నిర్ణయాలు పవన్ కు అంగీకారంతోన జరుగుతున్నాయనుకుంటే.. స్వయంగా తప్పిదం చేస్తున్నట్టే. లేదా ఆయనకు తెలియకుండా పార్టీలో తిష్టవేసిన కొన్ని వర్గాల ప్రభావంలో పడిపోయారనుకున్నా ఆయనకే నష్టం.

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ..

ఎన్నికలకు తక్కువ సమయముండటంతో పార్టీని ప్రజల్లో తీసుకెళ్లేందుకు పవన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ ప్రయత్నంలోనే తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని వికటిస్తున్నాయి. ఇటీవలే పార్టీ మ్యానిఫెస్టోని ప్రకటించి సంచలనం రేపారు. మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు ఇప్పుడాయన వైఖరినే ప్రశ్నిస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచీ కాపు పార్టీ ముద్రపడకుండా జాగ్రత్త పడ్డారు పవన్. అందుకే ముద్రగడ ఉద్యమం ఆ స్థాయిలో ఉన్నప్పుడు కూడా కాపు రిజర్వేషన్ల అంశంపై ఆచితూచి మాట్లాడారు కానీ..మద్దతు పలకలేదు. ముద్రగడ కుటుంబాన్ని అరెస్టు చేసినప్పుడు కూడా నోరెత్తలేదు. కానీ జగన్ కాపు రిజర్వేషన్లపై వ్యూహాత్మకంగా చేసిన వ్యాఖ్యల్లో మాత్రం పవన్ ఇరుక్కుపోయారు. ఆ వ్యాఖ్యల వల్ల జగన్ కు ఎంతమేరకు నష్టం వాటిల్లిందో తెలియదు కానీ..పవన్ మాత్రం స్పష్టత ఇవ్వకతప్పలేదు. మేధావులతో కమిటీ వేసి చర్చిస్తానని ప్రకటించారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ హఠాత్తుగా మేనిఫెస్టోలో కాపు రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ లో చేరుస్తానని పొందుపర్చడంతో మొత్తం బట్టబయలైపోయింది. కాపు రిజర్వేషన్లకే ఓటేసి..అన్ని వర్గాల పార్టీగా వేసుకున్న ముద్రను స్వయంగా ఆయనే తొలగించేసుకున్నట్టు అయింది. ఆ తరువాత రాజకీయ వ్యవహారాల కమిటీ నియామకం మరింతగా అనుమానాల్ని రేకెత్తించింది. ఈ కమిటీలో ఆ వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 85 శాతం మంది ఆ వర్గానికి చెందినవారే. దీనికితోడు పార్టీలో ముందు నుంచి ఉన్నవారి ప్రస్తావన లేదక్కడ. రాఘవయ్య లాంటి వ్యక్తి పేరు విన్పించడం లేదు ఈ మధ్యన. ఆ కమిటీలో చేరినవాళ్లంతా ఎవరికివారు సొంతవర్గాలు ఏర్పర్చుకుంటున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిపోయి...వర్గ బలోపేతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ పూర్తిస్థాయిలో నిర్మాణం జరగకుండానే వర్గవిబేధాలు ఎక్కువవుతున్నాయి. జనంలో ఉండేనేతలు ఎవరూ పెద్గగా పార్టీలో ఇప్పటికీ కన్పించకపోవడం ఆ పార్టీకు మరో మైనస్ గా చెప్పవచ్చు.

కొత్త సాంప్రదాయం..

పార్టీలో రాకుండానే కొంతమంది వ్యక్తులకు పదవులు ప్రకటిస్తుండటం బహుశా ఏ రాజకీయ పార్టీలోనూ ఇప్పటివరకూ చోటుచేసుకోలేదు. జనసేనలో ఆ కొత్త సాంప్రదాయం కన్పిస్తోంది. సాధారణంగా పార్టీలు మారినప్పుడు ...పార్టీ తీర్ధం పుచ్చుకున్న కొద్దిరోజులకు పదవులివ్వడం అన్నది ఆనవాయితీ ఏ పార్టీకైనా. ఇక్కడ మాత్రం పార్టీ తీర్ధం పుచ్చుకోడానికి ముందే పదవులు వరించేస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో రాజబాబు, ముత్తా గోపాలకృష్ణల విషయంలో ఇదే జరిగింది. ఇది సరైన పద్ధతి కాదన్నది విశ్లేషకుల మాట. ఇలా ఉంటే పార్టీలో చేరే ప్రతి ఒక్కరూ ముందే పదవుల కోసం బేరసారాలు సాగించే ప్రమాదముంది.

వర్గ విబేధాలు..

అప్పుడే జనసేనలో వర్గ విబేధాలు ఎక్కువయ్యాయి. పార్టీలో చేరిన నేతలంతా తమ తమ వర్గాల నిర్మాణంలో ఉన్నారు. పార్టీ నిర్మాణం కంటే వర్గ నిర్మాణమే ప్రాధాన్యతగా మారిందిప్పుడు వారికి. పవన్ కళ్యాణ్ పర్యటన సమాచారం ఆ పార్టీ కేడర్ కు గానీ..మీడియాకు గానీ.. కేవలం ఓ గంటో రెండు గంటల ముందో తెలుస్తోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన కూడా ఓ నిర్దేశం లేకుండా సాగుతోంది. గత నెలలోనే భీమవరం నుంచి పర్యటన ప్రారంభించినట్టు ప్రకటించినా...ఇంకా అదే ప్రాంతంలోనే ఉన్నారు. అలాగని చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరుగుతున్నారా అంటే అదీ లేదు. మధ్యలో రెండుమూడుసార్లు విజయవాడ, హైదరాబాబ్ లకు వెళ్లి వచ్చారు. ఇది కేడర్ లో అయోమయానికి దారితీస్తోంది. పశ్చిమ పర్యటన ఎక్కడెక్కడ సాగుతుంది.. ఎప్పటివరకు జరుగుతుందన్న సమాచారం పార్టీలోని ఏ నేత వద్దా లేదు.

కాపు అభిమానం తనకు లేదంటూనే...అదే వర్గానికి ఎక్కువ పదవులు కట్టబెట్టారు పవన్. మరోవైపు బీసీలు గెలవగలిగితేనే సీట్లు ఇవ్వాలన్న ప్రకటన కూడా విమర్శలకే దారితీసింది. గెలవగలిగితేనే సీట్లు అన్నది బీసీలకే వర్తిస్తుందా..మిగిలిన సామాజికవర్గాలు వర్తించదా అని ప్రశ్నిస్తున్నారు. ఇటు ఆయన అభిమాన గణం కూడా సోషల్ మీడియాల్లో చేస్తున్న రాధ్దాంతం అంతా ఇంతా కాదు. ఆ వర్గం తప్ప..మిగిలినవారిని అసభ్య పదజాలంతో దూషించడం..రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం ఆ పార్టీకి మైలేజ్ కంటే...నష్టమే చేకూర్చుతోంది.

ఇవన్నీ పవన్ కు తెలిసే జరుగుతున్నాయనుకుంటే వెంటనే మార్చుకుంటే మంచిది. లేదా తనకు తెలియకుండా ఆ వర్గం ప్రభావంలో పడిపోవడం వల్ల జరిగిందనుకుంటే ఆ వర్గాన్ని దూరం పెట్టడం మంచిది. లేనిపక్షంలో జనసేన కూడా మరో ప్రజారాజ్యమే అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నది విశ్లేషకుల వాదన.

వైసీపీను వీడటానికి కారణమేమీలేదట..

దుర్గేష్ కు అక్కడ టికెట్ దక్కేనా..

                                                                                  

గోదావరి జిల్లాల్లో పాదయాత్ర పూర్తవుతూనే ఆ పార్టీకు కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొంతమంది నేతలు పార్టీని వీడుతున్నారు. నిన్నటి వరకూ పార్టీలో...ముఖ్యంగా పాదయాత్రలో తిరిగి ఒక్కసారిగా గుడ్ బై చెప్పడానికి ఒక్కొక్కరికీ ఒక్కో కారణముంటుంది. లోపల ఓ కారణముంటుంది..పైకి మరోకటి చెబుతుంటారు. అయితే తాజాగా పార్టీని వీడిన రాష్ట్ర్ర అధికార ప్రతినిధి కందుల దుర్గేష్ కు మాత్రం ఏ కారణమూ లేదట. పార్టీ అధ్యక్షుడితోనో...లేదా పార్టీలో సముచిత స్థానం లేక వదిలి వెళ్లేవారిని చూస్తుంటాం..ఇక్కడ మాత్రం ఆ రెండు కారణాలూ లేవని స్వయంగా ఆయనే చెప్పుకుంటున్నారు..

గ్రేటర్ రాజమహేంద్రవరం వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు..రాష్ట్ర్ర అధికార ప్రతినిధి కందుల దుర్గేష్ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల తన సన్నిహితులతో కార్యకర్తలతో సమావేశమైన ఆయన పార్టీని వీడే విషయమై చర్చించారు. అనంతరం మీడియా సమావేశం పెట్టి...పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే పార్టీని వీడటానికి ప్రత్యేకించిన కారణమేమీలేదని చెప్పడమే విశేషమిప్పుడు. పార్టీ అధినేత వైఎస్ జగన్ తో గానీ...పార్టీ నాయకత్వంతో గానీ తనకు విబేధాలు లేవని స్వయంగా దుర్గేష్ చెప్పారు. పార్టీలో తనకున్న స్థానాన్ని వినియోగించుకోలేకపోవడం..తన బాధ్యతలేంటో తెలియకపోవడం..తనను పార్టీ వినియోగించుకోలేకపోవడం మాత్రమే కారణాలుగా కందుల చెప్పడం ఆయన రాజకీయజ్ఞతను ప్రశ్నిస్తోంది. పార్టీ పదవిని కట్టబెట్టాక ఆ బాధ్యతలు తెలుసుకోవల్సింది... నాయకుడా లేక పార్టీనా అన్నది ఆయనకు తెలియదా అని రాజకీయ పండితులు విమర్శిస్తున్నారు. పార్టీలో చాలాకాలం నుంచి కార్యక్రమాలు చేస్తున్నా.. తన బాధ్యతలేంటో తెలియడం లేదని చెప్పడం విడ్డూరమేనంటున్నారు. మరి ఏం ఆశించి పార్టీని వీడారో...ఏం ఆశించి మరో పార్టీలో చేరుతున్నారో ఆయనకే తెలియాలి. ఇటు అధినేత జగన్ తో కూడా విబేధం లేదనడం కూడా దుర్గేష్ స్వయంగా చెప్పిన మాటే. విబేధాల్లేనప్పుడు పార్టీని ఎందుకు వీడుతున్నట్టో కనీసం ఆ స్పష్టతైనా ఉందా లేదా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

వాస్తవమేంటి..

వాస్తవానికి కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఆశిస్తున్నారు. వైఎఎస్సార్ కాంగ్రెస్ కు ముందు కాంగ్రెస్ లో ఆయన ఎమ్మెల్సీ పదవిను అనుభవించారు. ఇది కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వచ్చిన పదవి. పదవి అనంతరం...రాష్ట్ర్ర విభజన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా బాధ్యతలు చేపట్టారు. గత ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ కూడా చేశారు. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో రూరల్ నుంచి పాల్గొనాలన్నది ఆయన ఆలోచన. అయితే వైసీపీలో ఇప్పటికే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఆకుల వీర్రాజు అలాగే పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్నారు. ఆకుల వీర్రాజును తప్పించే ఆలోచన జగన్ లేదని ఇప్పటికే స్పష్టమైపోయింది. రూరల్ కు చెందిన మరో నేత గిరిజాల బాబు, దుర్గేష్ లతో ఇటీవలే జగన్ చర్చలు జరిపారు కూడా. ఆకుల వీర్రాజుకు మద్దతివ్వాల్సిందిగా దుర్గేష్ , బాబులను జగన్ కోరారు. పార్టీ అధికారంలోకి వచ్చాక..సరైన గుర్తింపు ఇస్తానని హామీ కూడా ఇచ్చినట్టు సమాచారం. దాంతో ఇక టికెట్ దక్కదనేది ఖరారైపోయింది దుర్గేష్ కు. అప్పట్నించి అన్యపదేశంగానే పార్టీలో ఉంటూ..ప్రత్యామ్నాయఏర్పాట్లు చూసుకున్నారు.

జనసేనలో..

ఇదే సమయంలో జనసేన పార్టీపై ఆయన ఆలోచన మళ్లింది. జనసేన పార్టీలో రాజమండ్రి రూరల్ స్థానం దుర్గేష్ కు కేటాయిస్తామని కొంతమంది మధ్యవర్తులు ద్వారా దుర్గేష్ కు ఆహ్వానం అందింది. జనసేన నుంచి స్పష్టమైన హామీ లేకపోయినా..మధ్యలో ఉన్న కొంతమంది నేతలను నమ్ముకుని దుర్గేష్ వైసీపీను వీడి..జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర పోరాటయాత్రలో పవన్ కళ్యాణ్ కు లభిస్తున్న ఆదరణ చూసి..ఆ పార్టీపై నమ్మకంతో జనసేనలో చేరుతున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు. దుర్గేష్ అనుచరులు మాత్రం కచ్చితంగా రూరల్ టికెట్ తమ నాయకుడికే లభిస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. ఆ హామీతోనే పార్టీలో చేరినట్టు కూడా చెబుతున్నారు. కానీ ఇదే జనసేనలో ఇప్పటికే అధికార ప్రతినిధిగా ఉన్న రాజమండ్రి ఇదే సామాజిక వర్గానికి చెందిన అద్దేపల్లి శ్రీధర్ రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా అద్దేపల్లికే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్టు సమాచారం. మరి ఏ మధ్య నేతల మాటల్ని ఆధారం చేసుకుని దుర్గేష్ వైసీపీని వీడారో అర్ధం కాని ప్రశ్న. వైసీపీని వదిలిందే రూరల్ టికెట్ దక్కడం లేదన్న ఆలోచనతో అన్నది అందరికీ తెలిసిన విషయం. మరి అటువంటప్పుడు జనసేనలో కూడా టికెట్ విషయమై ఇంకా గ్యారంటీ రాలేదని ఇప్పుడు అర్ధమవుతోంది ఆయనకు. ఒకవేల అద్దేపల్లికే జనసేన నాయకత్వం టికెట్ కేటాయిస్తే దుర్గేష్ పరిస్థితి ఏమిటి..ఇంకోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇటీవలే వీడిన కొంతమంది నేతలు జనసేన తీర్ధం పుచ్చుకోకుండానే ఆ పార్టీ పదవులు ప్రకటించేసింది. పదవుల ప్రకటన జరిగిన పది-పదిహేను రోజుల అనంతరం ఆ నేతలు పార్టీలో చేరారు. మరి దుర్గేష్ విషయంలో అలా ఎందుకు జరగలేదన్నది ఇప్పుడు అతని అనుచరుల్లో కలుగుతున్న అనుమానం. ఇటు టికెట్ విషయంపై స్పష్టత లేదు.. అటు ఏ పదవుల్ని ముందస్తుగా ప్రకటించలేదు. ఈ పరిస్థితుల్లో దుర్గేష్ రాజకీయ భవితవ్యం ఏంటి..నెగ్గుకువస్తారా...బోల్తా పడినట్టేనా..

రెడ్ల అడ్డా పై పట్టెవరిది..

రెడ్డి వర్సెస్ రెడ్డిలో విజయం ఎవరిదో..

                                                                       

  తూర్పు గోదావరి జిల్లాలో రెడ్ల నియోజకవర్గంగా పేరున్నది అనపర్తి. రాజకీయంగా చాలా చైతన్యవంతమైన నియోజకవర్గం. ముందు నుంచీ సామాజికవర్గ పరంగా బలమైన ముద్ర వేసుకోవాలన్న ఆకాంక్ష ఇక్కడ ఉండటం విశేషం. సంఖ్యా పరంగా అధిక సంఖ్యలో ఉండటం ఒకటైతే..ఆర్ధిక వనరులన్నీ తమ చుట్టూనే తిరగడం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. 1989లో గొలుగూరి బాపిరాజు... మండపేట ఓటింగ్ నుంచి బయటపడటానికి చేసిన ఆమరణదీక్ష ఓ బలమైన ఉదాహరణ.

ప్రత్యేకత..

అనపర్తి నియోజకవర్గం పరిధిలో వచ్చే రంగంపేట, అనపర్తి, బిక్కోవోలు. పెదపూడి మండలాల్లో వ్యవసాయం, పౌల్ట్ర్రీ పరిశ్రమ ఎక్కువ. ఆర్ధికంగా పరిపుష్టి కలిగిన నియోజకవర్గమనే చెప్పాలి. బలమైన సామాజికవర్గమైన రెడ్లు ఎక్కువగా ఫైనాన్స్ వాపార లావాదేవీల్లో...పౌల్ట్ర్రీ రంగంలో ఉన్నారు. రాజకీయంగా తేతలి, నల్లమిల్లి ఇంటిపేర్ల మధ్యనే పెత్తనం సాగిందని చెప్పవచ్చు. పార్టీ ఏదైనా గెలిచేది..ఓడేది ఇద్దరూ రెడ్లే ఇక్కడ. రెడ్డి సామాజికవర్గంతో పాటు బీసీ, ఎస్సీ వర్గ ప్రాబల్యం కూడా ఎక్కువ.

1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో తొలి ఎమ్మెల్యేగా ప్రజా పార్టీ నుంచి లక్ష్మీ నారాయణరెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటి వరకూ 12 సార్లు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ 5 సార్లు...తెలుగుదేశం పార్టీ 4 సార్లు విజయం సాధించాయి. రాజకీయంగా పట్టు సాధించిన నల్లమిల్లి కుటుంబం నాలుగుసార్లు ప్రాతనిద్యం వహించింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కూడా....అంటే 1983 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నల్లమిల్లి మూలారెడ్డి విజయం సాధించడం గమనించాల్సిన విషయం. ఆ తరువాత టీడీపీ తీర్ధం పుచ్చుకున్న ఆయన 1985లో..తిరిగి 94,99లలో వరుసగా ఎమ్మెల్యేగా నెగ్గారు. నియోజకవర్గ చరిత్రలో 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏకైక వ్యక్తి కూడా ఇతనే. ఆ తరువాత తేతలి రామారెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన పరిస్థితి.

తెలుగుదేశం పార్టీ..

తండ్రికి తగ్గ తనయుడు కాదు..

                                                                         

2 లక్షల 4 వేల ఓటింగ్ కలిగిన ఈ నియోజకవర్గంలో రెడ్ల ప్రాబల్యం ఎక్కువ. టీడీపీ సీనియర్ నేత నల్లమిల్లి మూలారెడ్డి వారసుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 2014 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో మాత్రమే విజయం సాధించగలిగారు. కేవలం 1373 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన రామకృష్ణారెడ్డి మాత్రం తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోలేకపోయారు. వారసత్వాన్ని పొందినా...ఆ లక్షణాల్ని అవలంభించుకోలేకపోతున్నారు. గత నాలుగేళ్ళుగా నియోజకవర్గ అభివృద్ధి కంటే...రాజకీయాలకు..వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శ ఉంది. తండ్రి మూలారెడ్డికి పూర్తి విభిన్నమైన వ్యక్తి కావడంతో నాలుగేళ్లలోనే వ్యతిరేకత కూడగట్టుకున్నారు. నాలుగేళ్లలో సాధించిన అభివృద్ధి పని ఒక్కటి కూడా లేదంటే ఆశ్చర్యం లేదనే చెప్పాలి. సమస్యల్ని చెప్పుకోడానికి వచ్చే ప్రజల్ని ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మూలారెడ్డి 35 ఏళ్లుగా సంపాదించుకున్న పేరును...తనయుడు 4 ఏళ్లలో పోగొట్టాడనే విమర్శ అధికంగానే ఉంది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతరేకత. పౌల్ట్ర్రీ పరిశ్రమ, రైతులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం కావడంతో..రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణాల హామీలపై ప్రభుత్వ వైఫల్యం ప్రభావం చూపిస్తున్నాయి. ఎన్నికల హామీలు నెరవేర్చుకపోవడం, జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్ల పెత్తనం సామాన్యుల్లో వ్యతిరేకతను పెంచాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ..

                                                                            

స్వతహాగా రెడ్డి ప్రాబల్యం కలిగిన నియోజకవర్గం కావడంతో వైసీపీకు ఇక్కడ మంచి ఆదరణే ఉంది. గత ఎన్నికల్లోనే విజయం సాధించాల్సి ఉన్నా...స్వల్ప తేడాతో విజయానికి దూరమైంది పార్టీ. ఆ పార్టీ అభ్యర్ధిగా మరోసారి రంగంలో దిగనున్నడాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి మంచి పేరు కూడా ఉంది. డాక్టర్ గా కేవలం పది రూపాయలకే వైద్యం చేస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల్లో పాపులర్ అయ్యారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాలో ఓడిన సానుభూతి కూడా అతనికి ఈసారి కలిసొచ్చే అంశంగా ఉంది. 2014 ఎన్నికల్లో కేవలం 13 వందల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు వైసీపీ అభ్యర్ధి. అప్పట్నించి పార్టీకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు మరింతగా చేరువయ్యారు. ఇటీవల వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు అనపర్తిలో లభించిన ఆదరణ పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేడర్ పరంగా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు మంచి పట్టున్న నియోజకవర్గం కూడా ఇదేనని చెప్పాలి. అందుకే ఈసారి వైసీపీ అభ్యర్ధి గెలుపు నల్లేరుపై నడకే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఆర్ధికంగా స్థితిమంతుడైనా సరే...కొన్ని విషయాల్లో డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి వెనుకంజ వేస్తున్నారన్న విమర్శ కూడా ప్రజల్లో ఉంది. పార్టీ పరంగా నియోజకవర్గంలో ఉన్న చిన్న చిన్న సమస్యల్ని అధిగమించాల్సిన అవసరం ఉంది ఇతనిపై.

జనసేన ప్రభావం..

జనసేన పార్టీ ప్రబావం కూడా నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే 2009లో పీఆర్పీ అభ్యర్ధికి పెద్దసంఖ్యలోనే ఓట్లు పడ్డాయి. ఆ ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసిన డీఆర్కే రెడ్డి రెండోస్థానంలో నిలబడ్డారంటే ప్రభావం ఎంతవరకుందో అర్దం చేసుకోవచ్చు. కాంగ్రెస్ అభ్యర్దిగా విజయం సాధించిన నల్లమిల్లి శేషారెడ్డి 34 వేల మెజార్టీతో నెగ్గడం.. పీఆర్పీ, టీడీపీ అభ్యర్ధులకు చెరో 34 వేల ఓట్లు రావడం గమనించాల్సిన అంశం. ప్రస్తుతానికి డీఆర్కే రెడ్డి న్యూట్రల్ గా ఉన్నారు. ఈసారి జనసేన ప్రభావం కచ్చితంగా ఉండే అవకాశాలున్నా...ఇప్పటివరకూ ఆ పార్టీకి నాయకుడెవరన్నది తెలియని పరిస్థితి.

ఆ మూడు స్థానాల్లో ఎవరు బలం..

ఆ పార్టీ ప్రభావం లేదా..

                                                                                 

రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో.. పశ్చిమ గోదావరి జిల్లాలో 3 నియోజకవర్గాలున్నాయి. వీటిలో కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్ డ్ కాగా.. నిడదవోలు మాత్రం జనరల్ స్థానం. జిల్లాలో జనసేన ప్రభావం తక్కువగా ఉండే నియోజకవర్గాలు కూడా బహుశా ఇవే. ఈ మాడు స్థానాల్లో ప్రధాన పార్టీలు  తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల బలాబలాలేంటి..సిట్టింగ్ ల పరిస్థితి ఎలా ఉంది..టీడీపీకు పట్టుండే ఈ ప్రాంతంలో ఈసారి ఎలా ఉండబోతోంది..ఈ మూడింట ఎవరు...

 

కొవ్వూరు..

 

రాజమండ్రి సిటీకు అవతలి తీరాన ఉన్ననియోజకవర్గమిది. 1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో 2 లక్షల 40 వేల ఓటింగ్ ఉంది. 2009లో ఎస్సీ రిజర్వ్ గా మారింది. ఎస్సీ ఓటింగ్ అత్యధికమైనా...ఎప్పుడూ కమ్మ సామాజికవర్గ ప్రాబల్యమే ఎక్కువ. 1978 లో ఓసారి కాంగ్రెస్ అభ్యర్ది మున్షీ అబ్దుల్ అజీజ్ గెలుపొందారు. ఆ తరువాత అంటే...టీడీపీ ఆవిర్భావం నుంచి వరుసగా...1983, 84, 89, 94లలో వరుసగా కృష్ణబాబు విజయం సాధించారు. 1989లో మాత్రం తిరిగి కాంగ్రెస్ అభ్యర్ధి జీఎస్ రావు గెలుపొందారు. మళ్లీ 2004లో కృష్ణబాబు విజయం సాధించారు. 2009లో ఎస్సీ రిజర్వ్ డ్ అవడంతో...కమ్మ సామాజికవర్గం ప్రాబల్యంలో వరుసగా రెండుసార్లు కూడా టీడీపీ అభ్యర్ధి గెలిచిన పరిస్థితి. 2009లో టీవీ రామారావు, 2014లో మంత్రి కేఎస్ జవహర్ విజయం సాధించారు. కమ్మ వర్గం ప్రభావంతో మొదటినుంచి తెలుగుదేశం పార్టీ కంచుకోటలాగా మారిందని చెప్పవచ్చు. ఆశ్చర్యమేమంటే..2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన మోషేన్ రాజు గానీ...ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన కృష్ణబాబు గానీ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కృష్ణబాబు మద్దతుతో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలైన తానేటి వనిత..2009 ఎన్నికల్లో గోపాలపురం నుంచి టీడీపీ అభ్యర్ధిగా గెలవడం గమనించాల్సిన అంశం. అదే గోపాలపురం నుంచి 2004లో కాంగ్రెస్ అభ్యర్దిగా నెగ్గిన మద్దాల సునీత ఇప్పుడు కొవ్వూరు వైసీపీ టికెట్ ఆశిస్తున్నవారు కావడం మరో విశేషం. టీడీపీ కంచుకోటగా ఉన్న కొవ్వూరులో ఈసారి పరిస్థితి రివర్స్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. మంత్రి కేఎస్ జవహర్ పై పూర్తి వ్యతిరేకత, ప్రభుత్వంపై వ్యతిరేకత దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. పుష్కర పనుల్లో అవినీతి, ఇసుక, మట్టి దోపిడీల్లో మంత్రి జవహర్ తో సహా...కమ్మ సామాజికవర్గ పెద్దలు కోట్లు ఆర్జించారని భారీగా విమర్శలున్నాయి. ఆ సామాజికవర్గానికి తప్ప..మరెవ్వరికీ ఏ పనీ చేసి పెట్టలేదన్న ఆరోపణ కూడా మంత్రిపై ఉంది. ఈసారి టీడీపీకు జవహర్ తప్ప మరో ప్రత్యామ్నాయ అభ్యర్ధి కన్పించని నేపధ్యం ఓ వైపు.. వ్యతిరేకత మరోవైపు ఆ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టేలా ఉన్నాయి. ఫలితంగా వైసీపీకు విజయావకాశాలు కన్పిస్తున్నాయి. అయితే కృష్ణబాబు ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండటమే కాకుండా..వైసీపీలో రెండు వర్గాలుగా చీలిపోయి ఉండటం ఆ పార్టీకి మైనస్ గా చెప్పవచ్చు. ఈ రెండు వర్గాలు కలిసి పనిచేస్తే...నూటికి నూరుశాతం వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని విశ్లేషకుల అంచనా..ఇక దాదాపు 40 వేల వరకూ ఉన్న కాపు ఓటింగ్ కారణంగా జనసేన కూడా ప్రభావం చూపించవచ్చుగానీ..ఏ ఒక్క నాయకుడు కూడా ఆ పార్టీకి ఇప్పటివరకూ లేకపోవడం దురదృష్టకరం.

గోపాలపురం..

 

మరో ఎస్సీ రిజర్వ్ డ్ స్థానం గోపాలపురం. 2 లక్షల 14 వేల ఓటింగ్ ఉన్న ఈ నియోజకవర్గంలో పూర్తిగా కమ్మ ప్రాబల్యమే ఎక్కువ. 1962లో నియోజకవర్గం ఆవిర్భావం నుంచి..టీడీపీ ఆవిర్భావం వరకూ కాంగ్రెస్ దే హవా. 1983లో టీడీపీ పుట్టినప్పటి నుంచీ..కమ్మ సామాజికవర్గ ప్రాబల్యంతో ఆ పార్టీకు కంచుకోటగా మారింది. 1983 నుంచి వరుసగా టీడీపీనే విజయం సాధిస్తూ వచ్చింది. 2004లో మాత్రం వైఎస్ హవాతో కాంగ్రెస్ అభ్యర్ధి మద్దాల సునీత 7 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కానీ తిరిగి 2009లో టీడీపీ అభ్యర్ది తానేటి వనితనే విజయం సాధించారు. గత ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్ధి ముప్పిడి వెంకటేశ్వరరావు వైసీపీ అభ్యర్ది తలారి వెంకట్రావుపై విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓటింగ్ ఎస్సీలు కాగా..రెండో స్థానంలో కమ్మ సామాజికవర్గముంది. ఎస్సీ ఓటింగ్ ఏకంగా 90 వేల వరకూ ఉండగా..కమ్మ సామాజికవర్గ ఓట్లు అత్యధికంగా 70 వేల వరకూ ఉన్నాయి. బహుశా కమ్మ సామాజికవర్గ ఓట్లు ఈ స్థాయిలో ఉన్న నియోజకవర్గం కూడా ఇదేనేమో..ఈసారి మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొందిక్కడ. దీనికి చాలా కారణాలున్నాయి. రైతుల రుణమాఫీ అంశం, డ్వాక్రా రుణాలు ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. రైతులు ఎక్కువగా ఉన్న ప్రాంతమిది. మరోవైపు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుపై భారీస్థాయిలో ఉన్న వ్యతిరేకత. ప్రత్యేకించి ఎస్సీ సామాజికవర్గంలో పూర్తి వ్యతిరేకత నెలకొంది. కమ్మ సామాజికవర్గానికి తప్ప..మరెవరి పనీ చేయరన్న విమర్శ ఎమ్మెల్యైపై తీవ్రంగానే ఉంది. ఇక నియోజకవర్గానికి చెందిన ప్రతి పనిలో అవినీతికి పాల్పడటంతో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిన తలారి వెంకట్రావుపై నియోజకవర్గంలో సదభిప్రాయం ఉంది. మరోవైపు సానుభూతి అంశం తోడవుతోంది. టీడీపీ పై ఉన్న వ్యతిరేకత వైసీపీకు పూర్తిగా లాభించే అంశంగా మారింది. అయితే ఆర్ధికంగా అంత స్థితిమంతుడు కాకపోవడంతో తలారి వెంకట్రావు..ఈసారి ఎన్నికల్ని తట్టుకోగలరా అనే అనుమానాలున్నాయి. నియోజకవర్గంలో పట్టున్నా...ఆర్ధిక వనరులు ఇతనికి సహకరించడం లేదు. కాపు ఓటింగ్ కూడా దాదాపు 45 వేల వరకున్నా సరే..జనసేన ప్రభావం ఏ మాత్రం లేదిక్కడ. ఇది కూడా వైసీపీకు లాభించే పరిణామమే. తలారి వెంకట్రావుకు ఆర్ధిక వనరులు సమకూరినా..లేదా ఆర్ధికంగా పటిష్టమున్న వ్యక్తిని రంగంలో దింపినా...వైసీపీ విజయం తధ్యమనేది అత్యధికుల విశ్లేషణ.

నిడదవోలు..

 

2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడిన ప్రాంతమిది. కమ్మ సామాజికవర్గ ప్రాబల్యం అధికం కావడంతో అదే వర్గానికి చెందిన బూరుగుపల్లి శేషారావు వరుసగా రెండుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2 లక్షల 60 వేల ఓటింగ్ ఉన్న ఈ నియోజకవర్గంలో 60 వేలమంది వరకూ ఎస్సీలున్నారు. తరువాతి స్థానంలో కాపులు, కమ్మ, క్షత్రియులు ఇంచుమించుగా ఉన్నారు. కాపు ఓటింగ్ 35 వరకూ ఉండగా..కమ్మ సామాజికవర్గ ఓట్లు 30 వేల వరకూ ఉన్నాయి. క్షత్రియ సామాజికవర్గం ఓట్లు కూడా 26 వేల వరకూ ఉండటం గమనార్హం. ఇక ముస్లిం ఓట్లు కూడా ఆశించిన సంఖ్యలోనే 15 వేల వరకూ ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే శేషారావుపై నియోజకవర్గంలో భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలున్నాయి. జిల్లా మొత్తం మీద ఇసుక ద్వారా కోట్లు ఆర్జించిన ప్రజా ప్రతినిధుల్లో ఇతని పేరే ప్రముఖంగా విన్పిస్తుంది. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు అల్లుడు...గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన రాజీవ్ కృష్ణ ఈసారి బరి నుంచి తప్పుకున్నారు. గత ఎన్నికల్లో కేవలం 6 వేల ఓట్ల తేడాతో ఓడిన రాజీవ్ కృష్ణ ఎందుకో పోటీ నుంచి తప్పుకున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలైన...కొవ్వూరుకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు తనయుడు జీ శ్రీనివాస్ నాయుడు ఈసారి వైసీపీ తరపున బరిలో నిలవనున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన శ్రీనివాస్ నాయుడు జీఎస్ రావు తనయుడిగా నియోజకవర్గంల మంచి పేరు తెచ్చుకున్నారు. జనసేన ప్రబావం లేకపోవడంతో కాపు ఓటింగ్ వైసీపీకే లాభించనుంది. మరోవైపు కమ్మ సామాజికవర్గ ప్రాబల్యాన్ని తగ్గించాలన్న పట్టుదల బీసీ, కాపు, క్షత్రియ, మైనార్టీ, ఎస్సీ వర్గాల్లో ఉండటం వైసీపీకు పూర్తిస్థాయిలో లాభించే అంశం. టీడీపీ కచ్చితంగా శేషారావు కుటుంబానికే టికెట్ ఇచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఒకవేళ టీడీపీ కూడా కాపు వర్గానికి టికెట్ కేటాయించిన నేపధ్యంలో పోటీ టఫ్ గా మారనుంది. ప్రస్తుత ఎమ్మెల్యే శేషారావు స్వతహాగా కూడగట్టుకున్న వ్యతిరేకతకు ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడవుతోంది. నియోజకవర్గంలో సాధించిన ప్రగతి జీరో అని చెప్పవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

 సో మొత్తానికి రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో తూర్పులో జనసేన ప్రభావం సైతం ఉండి..త్రిముఖపోటీ నెలకొననుండగా... పశ్చిమలోని మూడు స్థానాల్లో మాత్రం జనసేన ప్రభావం ఏ మాత్రం ఉండదనే చెప్పాలి. అందుకే ఈ మూడింట పోటీ టీడీపీ-వైసీపీల మధ్యే ఉండనుంది.

రాజమండ్రి లోక్ సభ ఎవరికో తెలుసా..

పోటీ మాత్రం త్రికోణమే..

                                                                                                             

ఉభయగోదావరి జిల్లాల్లో కీలకమైనది రాజమండ్రి లోక్ సభ స్థానం. రెండు జిల్లాల్లోనూ విస్తరించిన సెగ్మెంట్ కావడంతో అందరికీ ఆసక్తి ఎక్కువ. నియోజకవర్గం ఆవిర్భావం నుంచీ కాంగ్రెస్ కు పట్టుగొమ్మగా చెప్పవచ్చు. మొత్తం 14 లక్షల 21 వేల ఓటింగ్ కలిగిన ఈ నియోజకవర్గంలో బీసీ ఓటింగ్ ఎక్కువ. తరువాతి స్థానంలో కాపు ఓటింగ్ ఉంది. అయినా బీసీలు తప్ప మిగిలిన ప్రధాన సామాజికవర్గాల అభ్యర్ధులు ఇక్కడి నుంచి ఎంపీగా గెలవడం విశేషం.

నియోజకవర్గ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లో గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందితే...రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం, అనపర్తి స్థానాలు తూర్పు గోదావరి జిల్లా పరిధిలోవి. భౌగోళికంగా పెద్ద నియోజకవర్గం కావడంతో పోటీ చేసే అభ్యర్ధులకు గానీ..నెగ్గిన అభ్యర్దులకు గానీ పని ఒత్తిడి ఎక్కువే ఉంటుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని గోపాలపురం అసెంబ్లీ పరిధిలో వచ్చే ద్వారకా తిరుమల...రాజమండ్రి సిటీ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో అంటే దాదాపు ఏలూరు పార్లమెంట్ కు ఆనుకుని ఉందంటే..పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వీటిలో కొవ్వూరు, గోపాలపురం ఎస్సీ రిజర్వ్డ్ డ్ కాగా...మిగిలినవని జనరల్ స్థానాలు.

                                                                       

ఎన్నికల చరిత్ర..

1952లో నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ 16 సార్లు ఎన్నికలు జరిగితే..అత్యధికంగా 10 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక టీడీపీ మూడుసార్లు..బీజేపీ రెండుసార్లు.. గెలిచాయి. తొలిసారి జరిగిన ఎన్నికలో మాత్రం ప్రజా సోషలిస్ట్ పార్టీకు చెందిన రెడ్డి నాయుడు ఒకేఒకసారి గెలిచారు. కాంగ్రెస్ నుంచి డీఎస్ రాజు, పట్టాభి రామారావులు ఏకంగా హ్యాట్రిక్ విజయాల్ని కైవసం చేసుకోవడం విశేషం. ఎక్కువగా స్థానికేతరులకే పట్టం కట్టిన నియోజకవర్గమిది. టీడీపీ ఆవిర్భావం తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ నాలుగు సార్లు విజయం సాధించడం గమనించాల్సిన విషయం. హ్యాట్రిక్ సాధించిన అభ్యర్ధుల తరువాత కేవలం ఉండవల్లి అరుణ్ కుమార్ తప్ప మరెవరూ రెండోసారి గెలవకపోవడం గమనార్హం. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించిన ఉండవల్లి అరుణ్ కుమార్...2014 ఎన్నికల్లో విభజన నేపధ్యంలో పోటీకు దూరంగా ఉన్నారు.

ఆ వర్గానికే టీడీపీ టికెట్..

గత ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా టీడీపీ కు చెందిన స్థానికేతరుడు మాగంటి మురళీమోహన్ గెలుపొందారు. 2009లో పోటీ చేసి అరుణ్ కుమార్ పై ఓడిన మురళీమోహన్...2014లో బీజేపీ, పవన్ కళ్యాణ్ ల మద్దతుతో రంగంలో దిగి విజయం సాధించారు. 1998, 99లలో వరుసగా రెండుసార్లు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో మిత్రపక్షం బీజేపీ గెలిచింది. ఈసారి బీజేపీతో టీడీపీ తెగతెంపుల నేపధ్యంలో కాంగ్రెస్ తో కలిసి టీడీపీ పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. అయితే సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్ పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది నియోజకవర్గంలో. స్థానికేతరుడన్న అంశాన్ని పక్కనపెట్టి మరీ గెలిపించినా...ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరన్న విమర్శ ఓవైపు...ఒక్క అభివృద్ధి పని చేయకపోవడం మరోవైపు ప్రజల్లో ఇతనిపై ఆగ్రహానికి కారణమవుతున్నాయి. టీడీపీ ఈసారి టికెట్ మురళీమోహన్ కు ఇస్తుందా లేదా అన్నది పక్కనబెడితే..ఇచ్చినా గెలుపు కష్టమనే తెలుస్తోంది. అందుబాటులో లేకపోవడమే కాకుండా..స్థానిక సమస్యల్ని ఎన్నడూ పట్టించుకోలేదన్న ఆరోపణలు ఎక్కువగానే ఉన్నాయి. ఇటు సొంత పార్టీ కేడర్ ను కూడా ఎప్పుడూ పట్టించుకోలేకపోవడం మరో మైనస్ గా చెప్పవచ్చు. అటు లోక్ సభ పరిధిలోని అనపర్తి, రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యేలతో మురళీమోహన్ కు సఖ్యత కూడా లేకపోవడంతో..ఈ ప్రాంతాల్లో కేడర్ ఎంతవరకూ సహకరిస్తారన్నది అనుమానమే. బహుశా అందుకే తెలుగుదేశంపార్టీ మరో దీటైన అభ్యర్ధి కోసం పరిశీలిస్తోంది. బెంగుళూరులో స్థిరపడిన ప్రముఖ బిల్డర్ బి శ్రీనివాసరావు పేరు ఆ పార్టీ పరిశీలనలో ఉంది. బీఎస్ ఆర్ గా పరిచితులైన ఆయన తూర్పు గోదావరి జిల్లాకు చెందినవ్యక్తి అయినపప్పటికీ..ఏళ్ల క్రితమే బెంగుళూరులో స్థిరపడిపోయారు. అభ్యర్ధి ఎవరైనప్పటికీ...తెలుగుదేశం పార్టీ ప్రతిసారీ కమ్మ సామాజికవర్గానికి చెందినవ్యక్తినే బరిలో దింపుతోంది.

                                                                       

తొలిసారి ఆ వర్గానికి టికెట్

వైఎస్సార్ సీపీ నిర్ణయం

ఈ సెగ్మెంట్ లో బీసీ ఓటర్లు అధికమైనా సరే...ఇప్పటివరకూ ఏ పార్టీ ఈ వర్గానికి ఎంపీ టికెట్ ఇవ్వలేదు. గత ఎన్నికల్లో వైసీపీ కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన టీడీపీ నుంచి పార్టీలో చేరిన బొడ్డు అనంత వెంకట రమణ చౌదరికి టికెట్ కేటాయించింది. అయితే ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగేస్తున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి రాజమండ్రి లోక్ సభ కేటాయిస్తామని ఇప్పటికే ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో ఆయన చేసిన ఈ ప్రకటన రాజకీయపార్టీల్లో సంచలనం కల్గించింది. అభ్యర్ధి ఎవరన్నదీ ఇంకా తెలియకపోయినా... కచ్చితంగా బీసీకే కేటాయించనుంది పార్టీ. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం కచ్చితంగా కలిసొస్తుందని...బీసీ ఓట్లతో భారీగా చీలిక వస్తుందన్నది ఆ పార్టీ అంచనా. టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న ఆ వర్గాన్ని చీల్చి..తనవైపు లాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

జనసేన బీజేపీల ప్రభావం..

ఈ రెండు పార్టీల ప్రభావం కంటే..జనసేన ప్రభావం నియోజకవర్గంపై ఎక్కువే ఉంటుంది. గతంలో ఇక్కడి నుంచి రెండుసార్లు బీజేపీ విజయం సాధించినా .. అప్పట్లో టీడీపీ పొత్తు ఉంది. గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్దిగా విజయం సాధించిన డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఉన్నా..ఆ పార్టీకి ఒంటరిగా పోటిచేసి నెగ్గేంత సత్తా లేదనే చెప్పాలి. అందుకే ఈసారి బీజేపీ తరపున అభ్యర్ధిగా ఎవరన్నదీ ఇంకా స్పష్టత రాలేదు. ఆ స్థాయి అభ్యర్ది కూడా కన్పించడం లేదు. జనసేన పార్టీ ప్రభావంను తక్కువ చేయాడానికి లేదు. కాపు సామాజివర్గం ఓట్లు గణనీయంగానే ఉండటంతో...ఓట్లను భారీగానే చీల్చుతుంది. ఈ పార్టీ నుంచి కూడా అభ్యర్ది ఎవరన్నదీ తెలియకపోయినా...బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పేరు మాత్రం విన్పిస్తోంది. ఆర్ధికంగా స్థితిమంతుడు కావడం...సామాజికవర్గ అండ..ఎమ్మెల్యేగా ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన అభ్యర్ధిగా ఆకుల సత్యనారాయణ రాజమండ్రి లోక్ సభ అభ్యర్ధిగా రంగంలో దిగడం దాదాపు ఖాయమని తెలుస్తోంది.

మొత్తానికి రాజమండ్రి లోక్ సభ సెగ్మెంట్ లో కచ్చితంగా త్రికోణ పోటీ నెలకొంటుంది. ఎవరి ఓట్లు ఎవరు చీల్చుతారనే దానిపైనే విజయం ఎవరిదన్నది ఆధారపడి ఉంది. గత ఎన్నికల్లో జనసేన మద్దతు టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్ధికి ఉండటం వల్ల...ఈసారి అధికార పార్టీ ఓట్లే చీలుతాయన్నది కొందరి విశ్లేషణ. జనసేన సొంతంగా బరిలో ఉండటం వల్ల కాపు ఓట్లే చీలుతాయనేది టీడీపీ వర్గాల అంచనా. ఇక బీసీ ఓట్లపై గాలం వేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎంతవరకూ పనిచేస్తుందో మరి చూడాల్సిన అంశం ఇప్పుడు. ఏదేమైనా సరే...పోటీ మాత్రం టఫ్ గానే ఉంటుందనేది నిర్వివాదాంశం..

భారీగా ఓట్ల గల్లంతు..

టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికార్లు..

                                                                         

ఎన్నో ఎన్నికల్లో ఓట్లేశారు వాళ్లు. ఈసారి మాత్రం వారి ఓటు గల్లంతయి పోయింది. ఆ కుటుంబంలో తల్లికి ఓటుంటే...తనయుడికి లేదు. మరో కుటుంబంలో భార్యకు ఓటుంటే..భర్తకు లేదు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికారపార్టీ రెచ్చిపోయింది. అధికార్లపై ఒత్తిడి తీసుకొచ్చి..రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును తొలగించేశారు. కొత్త ఓటర్ల నమోదు నామమాత్రంగా ఉండగా...పాత ఓట్లు మాత్రం పెద్ద సంఖ్యలో పోతున్నాయి.ఇది తూర్పు గోదావరి జిల్లాలో సాగుతున్న ఓట్ల గల్లంతు వ్యవహారం..ఆశ్చర్యమేమంటే నమోదు కంటే తొలగింపు అధికంగా ఉండటం.

నమోదు తక్కువ..

తొలగింపు ఎక్కువ..

ఎన్నికల కమీషన్ గత ఏడాది నవంబర్ లో ప్రత్యేక డ్ర్రైవ్ చేపట్టింది. అప్పటికి జిల్లాలో మొత్తం 37 లక్షల 30 వేల ఓటర్లున్నారు. వీరిలో పురుషుల కంటే.. మహిళా ఓటర్లే కొద్దిగా అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ ఏడాది అంటే 2018 జనవరి నాటికి ఓటుహక్కుకు చేరుకునే వారి సంఖ్య జిల్లాలో 2న్నర లక్షల మంది ఉండగా.. కొత్త ఓటర్లు మాత్రం కేవలం 81 న్నర వేలు మాత్రమే నమోదయ్యారు. ఎన్నికల కమీషన్ చేపట్టిన అవగాహనా కార్యక్రమాలు గానీ..ప్రత్యేక డ్ర్రైవ్ గానీ ఆశించిన ఫలితాన్నివ్వలేదనే చెప్పాలి. కమీషన్ ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. నమోదు కార్యక్రమం నామమాత్రంగా సాగినా...తొలగింపు మాత్రం భారీగా సాగింది. మృతులు..డబుల్ ఎంట్రీలు..వలస వెళ్లడం వంటి కారణాలతో నవంబర్ లో చేపట్టిన డ్ర్రైవ్ లో 26 వేల ఓట్లను తొలగిస్తే...అంతకుముందు జూలైలో 45 వేల 840 ఓట్లను తొలగించారు. ఇప్పుడు తాజా వివరాల ప్రకారం మొత్తం ఓటర్లు..37 లక్షల 86 వేల మంది ఉన్నారు.

                                                                              

జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలుండగా...వీటిలో కాకినాడ సిటీ, రాజోలు, కొత్తపేట, మండపేట,రంపచోడవరం ప్రాంతాల్లో జూలై, నవంబర్ నెలల్లో కలిపి ఒక్కో నియోజకవర్గంలో..3 వేలకు పైగా ఓట్లు తొలగించారు. తుని, పెద్దాపురం, అనపర్తి, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజమహేంద్రవరం రూరల్, జగ్గంపేటల్లోని ఒక్కో స్థానంలో 2 వేల వరకూ ఓట్లు తొలగించేశారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఓట్లను మాయం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే..ప్రజా ప్రతినిధులు, నాయకలు ఓట్లు కూడా గల్లంతయ్యాయి. జిల్లాలోని అన్ని నియోజవర్గాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులే లక్ష్యంగా తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. డబుల్ ఎంట్రీలు..బోగస్ ఓట్లు..స్థానికంగా లేకపోవడం వంటి కారణాల్ని పైకి చెబుతున్నప్పటికీ.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే వైసీపీ మద్దతుదారులున్న ప్రాంతాల్లో భారీగా ఓట్లు తొలగించారని స్పష్టమవుతోంది. ఎందుకంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులు...గ్రామ స్థాయి నాయకుల ఓట్లు లేకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

కాకినాడ కార్పొరేషన్ లో ఇదే జరిగింది..

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో జరిగినట్టే...ఈసారి కూడా చేయడానికి వ్యూహం అమలవుతోందనే విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఆ ఎన్నికల్లో ఏకంగా...20 వేల పైబడి ఓట్లు గల్లంతయ్యాయి. ఓ ఇంటిలో నలుగురుంటే...ఇద్దరి ఓట్లు గల్లంతైన పరిస్థితి. జాబితాలో పేరుండి...ఇంటి నెంబర్ మారిపోవడం వంటి కారణాలతో చాలామంది ఓటుహక్కును కోల్పోయారు. ఇప్పుడు కూడా ఇదే వ్యూహాన్ని అవలంభించడం ద్వారా..సాధ్యమైనన్ని ఎక్కువ ఓట్లను ప్రతిపక్ష పార్టీకు దక్కకుండా చేయాలన్నదే టీడీపీ నేతల ఆలోచన. ఈ నేతల ఆలోచనను అమల్లో పెడుతున్నారు స్థానిక అధికార్లు..లేకపోతే 2న్నర లక్షల కొత్త ఓటర్లు నమోదవ్వాల్సిన పరిస్థితుల్లో 81 వేలే నమోదవడం...మరోవైపు 71 వేల ఓట్లను తొలగించేయడం దేనికి సంకేతమంటున్నారు ప్రతిపక్షనేతలు..

పగబట్టిన రాజకీయాలు..

మహిళను రోడ్డుకీడ్చే దిగజారుడు తనం..

                                                                                                           

" సమాజంలో ఉన్న ద్రోహులు, వెన్నుపోటుదారులు, వ్యభిచారులు, సంఘవిద్రోహ శక్తులు కలిసి ఒకే ఒక్క మనిషిపై దాడిచేస్తుంటే...ప్రజలందరూ ఆ మనిషిని అనుసరించండి " ఇది చాణుక్యుడు చెప్పిన సూక్తి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడిదే జరుగుతోంది. అందరూ కలిసి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పై..అతని కుటుంబంపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్దులు..ఎల్లో మీడియా కలిసి మరీ దాడి చేస్తున్నాయి. బహుశా అందుకేనేమో చాణుక్యుడు చెప్పినట్టు ప్రజలతన్ని అనుసరిస్తున్నారు..ప్రజా సంకల్పయాత్రలో ఉన్న జగన్ కు ప్రజలు అందుకే నీరాజనాలు పలుకుతున్నారు.

చట్టం ఎవరికీ చుట్టం కాదని చెబుతూనే..చుట్టపు పనులకు పాల్పడుతున్నారు. అందరూ సమానమంటూనే వివక్ష చూపిస్తున్నారు. ఓ మనిషిని ఎంతగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. నిజంగానే చట్టం ఎవరికీ చుట్టం కాకుండా పనిచేస్తుందా..అందరినీ సమానంగా వ్యవహరిస్తుందా.. ఆచరణలో ఇది ఎంతవరకూ వాస్తవం? అధికారులు తు.చ. తప్పకుండా నిబంధనలను పాటిస్తున్నారా? నిష్షక్షపాతంగా వ్యవహరిస్తున్నారా? అన్న ప్రశ్నలకు సరైన సమాధానం లభించదు. సగటు పౌరుడు ఎవరిని అడిగినా ఈ విషయాన్ని ఎలాంటి అనుమానాలు లేకుండా చెబుతాడు. ఆచరణలో చట్టం ముందు అందరూ సమానులే కాదని..కొందరు అత్యధిక సమానులని చెబుతారు. వారిని చట్టాలు ఏమీ చేయవు. చట్టం నుంచి తప్పించుకునేందుకు చాలా వెసులుబాట్లు కల్పిస్తారు. ఉపశమనాలు ఉంటాయి. చట్టపరమైన ప్రక్రియ సుదీర్ఘంగా, నిమ్మకు నీరెత్తినట్లు సాగుతుంటుంది. రోజులు గడిచే కొద్దీ విషయం జనం మర్చి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. మరికొందరి విషయంలో చట్టం చాలా వేగంగా స్పందిస్తుంది. చకచకా పావులు కదుపుతుంది. ఆఘమేఘాలపై హడావిడి చేస్తుంది. సరైన దర్యాప్తు ప్రక్రియ చేపట్టకుండానే, నిబంధనల్ని గాలికొదిలేసి.. ముందే దోషులుగా నిర్ధారించేస్తారు. జనం దృష్టిలో అపరాధులన్న భావన కల్గిస్తారు.

రాష్ట్ర్రంలో జగన్ విషయంలో ఇదే జరిగింది. జరుగుతోంది కూడా. ఎవరో ఓ రాజకీయ నేత రాసిన లేఖను కోర్టు సుమోటాగా స్వీకరించినప్పటి నుంచీ ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలు చూస్తే ఇది నిజం అన్నిస్తుంది. హుటాహుటిన కేసును సీబీఐకు అప్పజెప్పడం..పక్షపాతవైఖరిని నిలువెల్లా జీర్ణించుకున్న ఓ పసుపు అధికారి రంగంలో దిగడం అన్నీ ప్రజలకు తెలిసిన విషయాలే. కొందరి విషయంలోనే చట్టం వేగంగా స్పందిస్తుందనేదాన్ని నిజం చేస్తూ..ఆధారాల్లేని కేసులు పెట్టి.. జైల్లో పెట్టడం. ఇక అక్కడ్నించి కుల, ధన, అధికార ప్రాతిపదికన బెయిల్ రాకుండా లాబీయింగ్ లు చేయడం మన వ్యవస్థకే చెల్లింది. బెయిల్ పొందడం ఓ వ్యక్తికున్న ప్రాధమిక హక్కు అనే విషయాన్ని కూడా కోర్టులు పక్కన పెట్టేశాయంటే రాజకీయాలు ఎంతగా దిగజారాయో అర్ధం చేసుకోవచ్చు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై సాక్ష్యాలతో సహా పిటీషన్ దాఖలు చేస్తే...రాజకీయ కక్ష్య సాధింపని దాటేయడానికి అదే కోర్టు ప్రయత్నించడం కూడా మర్చిపోకూడదు మరి. హడావిడి చేసిన ఆ పసుపు అధికారి..సిబ్బంది సరిపోరని చెప్పడం మరీ విడ్డూరం. జగన్ కేసులకు సరిపోయే సిబ్బంది...చంద్రబాబుపై కేసులకు సరిపోరా అన్నది కోర్టు విజ్ఞతకు ఎందుకు రాలేదో ...ఆ న్యాయాధీశులకే తెలియాలి.

పగబట్టిన రాజకీయాలు..

జగన్ పై వేసిన కేసులన్నీ ఒక్కొక్కటిగా వీగిపోతున్నాయి. పెట్టిన 11 కేసుల్లో దాదాపు 9 కేసుల్ని ఆధారాల్లేవన్న కారణంతో కోర్టు కొట్టేసింది. అందుకే ఇప్పుడు జగన్ సతీమణి భారతిపై పడ్డారు అంతా కలిసి. తన పని తాను పని చేసుకుంటూ, వ్యాపార సంస్థలను విజయవంతంగా నిర్వహించుకుంటున్న ఓ మహిళను రోడ్డుకీడ్చే ప్రయత్నానికి నాంది పలికారు ఇప్పుడు. ఆమె ప్రమేయం లేని వ్యవహారాల్లోకి లాగుతూ..బురద జల్లేందుకు కొందరు అధికారులు చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఆడుతున్న నాటకాన్నిచూస్తే అసహ్యం వేయకమానదు. విలువలు మరీ ఇంతగా దిగజారిపోయాయా..ఇంతలా పగబట్టాలా..

నాడు కాంగ్రెస్-టీడీపీ...నేడు బీజేపీ-టీడీపీ

                                                                             

నాడు టీడీపీ కాంగ్రెస్ తో కలిసి జగన్ పై దాడి చేస్తే...నేడు బీజేపీతో కలిసి ముప్పేట దాడికి దిగుతోంది. ఈ మూడు పార్టీల వ్యవహారాలకు తందాన తాన అంటూ ఎల్లో మీడియా ఉండనే ఉంది. నేరం నిరూపణ అయ్యేవరకూ ముద్దాయి కాజాలరన్న కనీస జ్ఞానం లేని ఈ మీడియా ఎల్లో జర్నలిజానికి సిగ్గుపడాల్సి వస్తోంది. తలుచుకుంటేనే అసహ్యమేస్తోంది. ఛార్జిషీటును కోర్టు పరిగణలో తీసుకోకుండానే ..ముద్దాయిగా ఆ మీడియా నిర్ణయించేస్తుంటే కోర్టులు ఏం చేస్తున్నట్టు.. తామో కేసును విచారించేసి..శోధించేసి..తీర్పులు చెప్పేస్తుంటే...సుమోటోగా కేసులు తీసుకోవడం చేతనయ్యే కోర్టులు ఏం చేస్తున్నట్టు. వాదించాలంటే చాలా ఉంటాయి. సమాధానం లభించదనుకున్నప్పుడు...న్యాయం జరగదని తెలిసినప్పుడు మౌనంగా ఉండటమే మేలేమో...లేదంటే తీవ్రవాదిగా కూడా ముద్రేస్తారు.

వై.ఎస్. జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి అత్యంత రహస్యంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారతిని నిందితురాలిగా చేర్చడం ఇందుకు నిదర్శనం. ఇప్పటిదాకా సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రాల్లో కానీ, ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదుల్లో కానీ ఎక్కడా భారతి ప్రస్తావన లేనేలేదు. కానీ భారతి (రఘురామ్ సిమెంట్స్) వ్యవహారంలో ఈడీ ఆమెను ఏకంగా నిందితురాలిగా పేర్కొనడం వెనుక చాలా అనుమానాలు వస్తున్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం లోని మూడో సెక్షన్ ప్రకారం ఆమె నేరానికి పాల్పడ్డారని, ఈ మేరకు సమన్లు జారీ చేయాలని ఈడీ కోర్టుకు విన్నవించుకుంది. ఈ మేరకు ఛార్జిషీటును దాఖలు చేసింది కూడా. అయితే ఈ ఛార్జిషీటును ఇంకా కోర్టు పరిగణలో తీసుకోలేదు. కోర్టు దీన్ని పరిశీలించకుండానే...భారతిని ముద్దాయి చేసేసింది మీడియా. దీన్ని ఆధారం చేసుకుని దాడికి దిగిపోయారు పచ్చనేతలు.

ఆ ఇద్దరు అధికార్లపై చర్యలు ఎందుకు తీసుకోలేదు..

ఈ మొత్తం వ్యవహారంలో...ఈడీలో పనిచేస్తున్న ఇద్దరు ఉన్నతాధికారుల పాత్రపై బలమైన ఆరోపణలు విన్పిస్తున్నాయి. టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ కు సమీప బంధువైన ఉమాశంకర్ గౌడ్ మరియు గాంధీ అనే ఇద్దరు ఉన్నతాధికారుల సహాయంతో.. ఉద్దేశ్యపూర్వకంగా, వేధింపులకు పాల్పడుదోంది ప్రభుత్వం. ఈ అధికారుల పాత్ర...వేధింపులపై 2017 ఫిబ్రవరిలో అంటే దాదాపు 17 నెలల క్రితమే వైసీపీ అధినేత జగన్ ప్రధానికి లేఖరాసినా..పట్టించుకోలేదు. ఈ అధికారులకు చంద్రబాబునాయుడితో సన్నిహిత సంబంధాలున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. గాంధీ అనే అధికారి బదిలీ అయినా రిలీవ్ కాలేదు. సరికదా...తనకున్న పలుకుబడితో మూడుసార్లు ఎక్స్ టెన్షన్ తెచ్చుకున్నారు. ఈడీ కేసుల విషయంలో వైసీపీకి ఇరకాటంలో పెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నారనే వాదనను కొట్టేయడం కష్టమే. ప్రధానికి ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదు..టీడీపీ ఆరోపిస్తున్నట్టు బీజేపీతో వైసీపీకు బంధముంటే...ఈడీ కేసు కొత్తగా ఎందుకు తెరపైకి వస్తుంది...జగన్ చేసిన ఫిర్యాదును కూడా పట్టించుకోకుండా ఆ అధికార్లను ఎందుకు కొనసాగిస్తున్నారు... ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం లభించదు.

కేసులు నిలబడతాయా..

                                                                               

వైఎస్ జగన్ పై నమోదయిన కేసుల్లోనే పసలేదని...ఆధారాల్లేవని చాలామంది న్యాయనిపుణులు..మేధావులు అనేక సందర్భాల్లో చెప్పి ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఆ కేసులన్నీ ఒక్కొక్కటిగా కోర్టుల్లో కొట్టేయబడుతున్నాయి. ప్రస్తుతం భారతిపై ఈడీ పెట్టిన కేసు కూడా ఇలాంటిదే. తన వ్యాపారసంస్థల్లో డైరెక్టర్ పదవి నుంచి జగన్ తప్పుకున్న తర్వాత భారతి ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారని, అందువల్ల ఆమె ప్రమేయం ఉందన్న ఈడీ వాదన కోర్టులో నిలబడటం కష్టమే. ఓ డైరెక్టర్ గా కంపెనీల కార్యకలాపాల్లో క్రియాశీలక పాత్ర పోషించడాన్ని ఏ చట్టమూ తప్పుపట్టదు. బాధ్యతల్లో భాగంగా నిధుల బదిలీ, ఆస్తి అప్పుల పట్టిక, చెక్ లపై సంతకాలు చేయడం నేరం ఎలా అవుతుందో ఈడీకే తెలియాలి. కంపెనీ డైరెక్టర్, ప్రధాన వాటాదారుగా అత్యధిక వేతనం పొందడం కూడా నేరమేమీ కాదే. ఈ కనీస ప్రాధమిక విషయాలు సామాన్య వర్తకుడికే తెలుస్తాయి కదా..మరి ఈడీకి ఎందుకు తెలియడం లేదు. ఈడీకు అన్నీ తెలుసు... రాజకీయకోణం ఉంది కాబట్టే తెలియనట్టు నటిస్తోంది ఈడీ.

రాజమండ్రి రూరల్ లో మారుతున్న పరిణామాలు..

కాపుల మధ్యే పోటీనా..

                                                                            

తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రాజమండ్రి రూరల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. త్రికోణ పోటీ తప్పని నేపధ్యం ఓ వైపు..ఒకే సామాజికవర్గం తలపడే అవకాశాలు మరోవైపు. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొందిప్పుడు. పెద్దాపురంలో ఉన్న ఇబ్బందులు రాజప్పను రూరల్ వైపు చూసేలా చేయడమే దీనికి ప్రధాన కారణం..

రాజమండ్రి రూరల్ లో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. ఆ తరువాత బీసీల ఓట్లున్నాయి. గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ స్థానం మిత్రపక్షం బీజేపీకు కేటాయించబడటంతో తొలిసారిగా ఇక్కడి నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అయితే ఈసారైనా కచ్చితంగా సిటీ నుంచే పోటీ చేయాలని యోచిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే రాజమండ్రి రూరల్ లో పరిణామాలు కూడా ఉన్నాయి. పెద్దాపురం నుంచి తొలిసారి పోటీ చేసి గెలిచిన రాష్ట్ర్ర హోంమంత్రి చినరాజప్ప ఈసారి రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పెద్దాపురం నుంచి గతంలో పోటీ చేసినప్పుడు మరో టీడీపీ సీనియర్ నేత బొడ్డు భాస్కరరామారావు వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు తిరిగి సొంతగూటికి చేరుకోవడమే కాకుండా..పెద్దాపురంపై దృష్టి సారించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దాపురం నుంచి పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటు రాజప్పతో ఉన్న విబేధాలు కూడా అతన్ని పట్టు వీడకుండా చేస్తున్నాయని చెప్పవచ్చు. కాపు ఉద్యమం సమయంలో ముద్రగడను అణచివేశారనే భావన రాజప్పపై ఎక్కువగానే ఉంది. దాంతో పెద్దాపురం ఈసారి సేఫ్ కాదేమోనన్న అభిప్రాయంతో రాజప్ప ఉన్నట్టు సమాచారం. ఇటు జనసేన ప్రభావం కూడా పెద్దాపురం నియోజకవర్గంలో ఎక్కువే ఉంటుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర నేపధ్యం కూడా రాజప్పను ఆలోచింపజేస్తోంది. ఇవన్నీ ఓ వైపు అయితే...మరోవైపు బొడ్డు వర్గీయులు ఏ మాత్రం సహకరించకపోగా..అడ్డు తగులే అవకాశాలున్నాయి. కారణం బొడ్డు ఈసారి పెద్దాపురం నుంచి పోటీ చేయాలని ఆలోచించడమే. కేడర్ ను తనవైపు తిప్పుకోవడంతో ఇప్పటికే బొడ్డు వర్గం పైచేయి సాధించింది. ఇన్ని వ్యతిరేకతల నేపధ్యంలో పెద్దాపురం సేఫ్ కాదన్న అభిప్రాయానికి వచ్చిన రాజప్ప రాజమండ్రి రూరల్ స్థానంపై కన్నేసినట్టు...ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాట్టు సమాచారం. చంద్రబాబుకు నమ్మినబంటు కావడంతో..ఆయనకీ స్థానం దక్కుతుందనే తెలుస్తోంది.

వైసీపీ నేత కందుల దుర్గేష్ జనసేన నుంచి..

                                                                                              

మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కందుల దుర్గేష్ జనసేన తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. వైసీపీలో రూరల్ స్థానం ఆశించినప్పటికీ అది దక్కే పరిస్థితి లేకపోవడంతో జనసేనకు వెళ్లడానికి దాదాపు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆత్మీయులతో..కార్యకర్తలతో సమావేశమయ్యారు. తన భవిష్యత్ నిర్ణయాన్ని మరో రెండ్రోజుల్లో ప్రకటిస్తానని చెప్పినప్పటికీ జనసేన చేరిక ఖాయమైందని సమాచారం. ఆ పార్టీలో దుర్గేష్ కు రూరల్ టికెట్ ఇస్తామన్న హామీ స్పష్టంగా ఉందంటున్నారు దుర్గేష్ వర్గీయులు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కేవలం టికెట్ విషయంలో తప్ప మరేవిధమైన అసంతృప్తి లేదన్నది కూడా అతని వర్గీయులే చెబుతున్నారు. రూరల్ స్థానంలో ఇప్పటికే పట్టుండటం..కాపు సామాజికవర్గం కావడంతో గెలుపు సునాయసమని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక వైసీపీ..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఆకుల వీర్రాజు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత ఎన్నికల్లో విజయం తధ్యమని అనుకున్నా...అనూహ్య పరిణామాల మధ్య..పవన్ చివరి నిమిషంలో టీడీపీకు మద్దతివ్వడం...మోడీ గాలి వంటి కారణాలతో ఓటమి పాలయ్యారు. అయినా అప్పట్నించీ నియోజకవర్గాన్ని వీడకుండా..పార్టీ కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటున్నారు. ఇటు అధినేత జగన్ కూడా వీర్రాజుపై సానుకూల అభిప్రాయంలోనే ఉన్నారు. జగన్ కు వీర్రాజుపై ఉన్న మంచి అభిప్రాయమే...దుర్గేష్ కు సీటు నిరాకరించేలా చేసిందన్నది నిర్వివాదాంశం. గత ఎన్నికల్లో ఓటమి నేపధ్యంలో ఏర్పడిన సానుభూతి ఓ వైపు...సామాజికవర్గం అండ...ప్రభుత్వ వ్యతిరేకత కచ్చితంగా వీర్రాజుకు కలిసొచ్చే అంశాలుగా వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముందు నుంచీ.. పార్టీని నమ్ముకుని ఉండటం...కొంతకాలం ఇతనికి పోటీగా మరో కో ఆర్డినేటర్ ను నియమించినా...అసంతృప్తికి లోనవకుండా సహనంతో ఉండటంతో.. ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోగలిగారు. అయితే ఆర్దికంగా కాస్త ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పటికీ...జగన్ కి మాత్రం వీర్రాజు గెలుపుపై పూర్తి నమ్మకమున్నట్టు తెలుస్తోంది.

మొత్తానికి...కారణాలేమైనప్పటికీ...రాజమండ్రి రూరల్ లో పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఒకవేళ రాజప్ప ఇదే స్థానం నుంచి పోటీ చేస్తే మాత్రం ఒకే సామాజికవర్గంలో త్రికోణ పోటీ ఏర్పడి ఉత్కంఠత నెలకొంటుంది. లేనిపక్షంలో 2009 ఎన్నికల్లో అవలంభించిన వ్యూహమే తిరిగి టీడీపీ అమలు చేస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. ఆ ఎన్నికలో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలు కాపు సామాజివర్గానికి టికెట్ ఇవ్వడంతో చివరి నిమిషంలో టీడీపీ బీసీ వ్యక్తిని బరిలో దింపి.. విజయం సాధించింది. ఇప్పుడూ అదే జరిగితే టీడీపీ విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అలా కాకుండా.. రాజప్ప పోటీలో ఉంటే మాత్రం పోటీ అనుమానాస్పదమే...ఉత్కంఠ భరితమే...

Google Ad

Subscribe