August 19, 2018
info@rajakeeyaalu.com

చదివిన వారి సంఖ్య

 

Breaking News

|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
854

అచ్చన్నా..ఇదేందన్నో

Written by  May 29, 2017
  • 308 Views

అచ్చన్నా..ఇదేందన్నో.. ఆధిపత్యం కోసం అమాత్యుడి ఆరాటం..సిక్కోలు TDP లో అసమ్మతి జ్వాలలు   మంత్రి అచ్చన్నాయుడు ఒంటెద్దు పోకడలతో శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఒంటి చేత్తో పార్టీని శాసించడానికి అచ్చన్నాయుడు చేస్తున్న ప్రయత్నాలపై TDP జిల్లా నాయకులు మండి పడుతున్నారు. పార్టీని, పాలనను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి మంత్రి కుల రాజకీయాలను ప్రోత్సహించడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. జిల్లాలో తనకు తిరుగులేకుండా చేసుకునేందుకు ఇటీవలే చంద్రబాబు కేబినెట్ లో చేరిన మరో సీనియర్ నేత కళా వెంకట్రావుపై పార్టీ అధి నాయకులకు ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకాడని అచ్చన్నాయుడు రక్త సంబంధీకుడైన శ్రీకాకుళం MP రామ్మోహన్ నాయుడును కూడా రాజకీయంగా తెరమరుగు చేయడానికి చేస్తున్న కుటిల యత్నాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. శ్రీకాకుళం జిల్లాపై చెరగని ముద్ర వేసిన కింజారపు యర్రన్నాయుడికి స్వయానా సోదరుడై అచ్చన్నాయుడు ఆయన అడుగుజాడల్లో నడిచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు.   జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి యర్రన్నాయుడు శ్రీకాకుళం నుంచి లోక్ సభ కు ఎన్నికయ్యాక అచ్చన్నాయుడు అప్పట్లోని హరిశ్చంద్రపురం స్థానం నుంచి MLA గా పోటీ చేసి శాసనసభలో అడుగుపెట్టారు. నియోజకవర్గాల పునర్విభజనలో హరిశ్చంద్రపురం నియోజకవర్గం తెరమరుగు కావడంతో టెక్కలిలో 2014లో గెలుపొంది చంద్రబాబు మంత్రి మండలిలో స్థానం పొందారు. ఒక విధంగా చెప్పాలంటే యర్రన్నాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయాక ఆయన తరపున జిల్లా రాజకీయాల్లో ప్రవేశించిన అచ్చన్నాయుడు అన్న మాదిరి జిల్లా రాజకీయాలను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించడం పెను విమర్శలకు దారి తీస్తోంది. స్వప్రయోజనాల కోసం పార్టీ శ్రేయస్సునే తాకట్టు పెట్టిన చరిత్ర యర్రన్నాయుడిది. అధికారం కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం ప్రత్యర్థులతో చేతులు కలిపి శ్రీకాకుళం జిల్లాలో పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించారన్న అపవాదు యర్రన్నాయుడిపై ఉంది. ఈ కారణంగానే 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో TDP ఓటమి పాలైందన్న విషయాన్ని ఆ పార్టీ నాయకులే అంగీకరిస్తారు.   ఇప్పుడు అదే తరహాలో అచ్చన్నాయుడు పార్టీ ప్రయోజనాలను గాలికొదిలి స్వార్థపూరిత రాజకీయాలకు తెర లేపారని TDP నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఆయన తలదూరుస్తూ పార్టీ MLA లకు, నాయకులకు ప్రజల్లో విలువ లేకుండా చేస్తున్నారని వారు అంటున్నారు. బతికినంత కాలం జిల్లా పార్టీ, జిల్లా రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన యర్రన్నాయుడు కుల రాజకీయాలను అంతగా ప్రోత్సహించేవారు కాదు. అందుకు విరుద్ధంగా అచ్చన్నాయుడు తన కులానికి చెందిన వారిని అందలం ఎక్కిస్తున్నారని పార్టీ శ్రేణులు గుర్రుమంటున్నాయి. ముఖ్యంగా జిల్లా పాలనా యంత్రాంగం తన కనుసన్నల్లో నడిచేందుకు వీలుగా తన కులానికి చెందిన అధికారులను జిల్లాస్థాయిలో అన్ని ప్రధాన శాఖల్లో నియమించుకుంటున్నారన్నది పార్టీ శ్రేణుల ప్రధాన ఆరోపణ. పోలీస్ శాఖను అయితే మరీ దారుణంగా మంత్రి గారి కులస్థులతో నింపేశారని అంటున్నారు. అంతేకాకుండా అచ్చన్నాయుడు నియోజకవర్గ స్థాయిలో కూడా కీలక పోస్టుల్లో తన కులస్థులు ఉండేలా చూసుకుంటూ పరిపాలనను శాసిస్తున్నారని అంటున్నారు. పార్టీ విప్ గా ఉన్న అముదాలవలస MLA రవికుమార్ కు తెలియకుండా అముదాలవలస CIగా తన సామాజిక వర్గానికి చెందిన అధికారిని నియమించడం ఆ మధ్య జిల్లాలో సంచలనం సృష్టించింది. దీనిపై ఆగ్రహోదగ్రుడైన రవికుమార్ CM కు ఫిర్యాదు చేయడంతో పాటు ఆ అధికారిని పట్టు పట్టి మరీ బదిలీ చేయించుకున్నారు. అయినా కూడా అచ్చన్నాయుడి వైఖరిలో ఎటువంటి మార్పూ లేదు. అయితే TDP అధినాయకుల దగ్గర అచ్చన్నాయుడి పలుకుబడి చూసి మిగిలిన శాసనసభ్యులు ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతున్నారని అంటున్నారు. ఇలా ఎదురులేకుండా సాగిపోతున్న అచ్చన్నాయుడి హవాకు చంద్రబాబు కేబినెట్ లో  కళా వెంకట్రావు ప్రవేశంతో బ్రేక్ పడుతుందని ఆశించిన పార్టీ శ్రేణులకు తీవ్ర నిరాశే ఎదురైంది. కళా వెంకట్రావుపై లేనిపోని ఆరోపణలతో పార్టీ అధి నాయకులకు ఫిర్యాదు చేసి అచ్చన్నాయుడు జిల్లాలో తనకు తిరగులేదని నిరూపించుకోవడం పార్టీ నాయకులు, కార్యకర్తలను కలవరపాటుకు గురిచేసింది. ఇదిలా ఉండగా తన రాజకీయ ప్రాబల్యం కోసం అచ్చన్నాయుడు తనకు రాజకీయ భిక్ష ప్రసాదించిన తన అన్న యర్రన్నాయుడు కుమారుడు, శ్రీకాకుళం MP రామ్మోహన్ నాయుడిని తెరమరుగు చేయడానికి యత్నించడం పార్టీలో తీవ్ర అలజడులు రేపుతోంది. యర్రన్నాయుడి మరణంతో ఆయన వారసుడిగా జిల్లా రాజకీయాల్లో ప్రవేశించిన రామ్మోహన్ నాయుడు ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. 2011లో యర్రన్నాయుడు రోడ్డు ప్రమాందలో మరణించగా అప్పటి నుంచి ప్రజలతో మమేకం అవుతూ వారికి చేరువై 2014లో జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి ఘన విజయం సాధించారు. MP గా గెలిచాక ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నాలను అచ్చన్నాయుడు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. రామ్మోహన్ నాయుడు రాజకీయంగా ఎదిగితే అది జిల్లాలో తన అధిపత్యాన్ని దెబ్బ తీస్తుందేమోనన్న భయంతో  అచ్చన్నాయుడు అధికార కార్యకలాపాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో ఆయనకు పెద్దగా ప్రాధాన్యత లభించకుండా జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. అచ్చన్నాయుడి ధోరణి నచ్చని యర్రన్నాయుడు సతీమణి ఆ మధ్య CM చంద్రబాబు నాయుడిని స్వయంగా కలిసి ఆయనపై ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. మొత్తమ్మీద అచ్చన్నాయుడి వ్యవహార శైలి జిల్లాలో పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉందని పార్టీ నాయకులు అంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. గత ఎన్నికల్లో జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో TDP ఏడు చోట్ల గెలుపొందింది. YCP నుంచి గెలిచిన పాతపట్నం MLA కలమట వెంకటరమణ ఆపై టీడీపీలో చేరిపోయారు. వీరిలో ఒకరిద్దరు మినహా మిగిలిన శాసనసభ్యుల పనితీరు పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. శాసనసభ ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి ఉన్నా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సీఎం చంద్రబాబే ఇటీవల సూచనప్రాయంగా తెలిపారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో అస్తవ్యస్థంగా ఉన్న పార్టీని పటిష్ట పరచాల్సిందిపోయి అచ్చన్నాయుడు స్వార్థపూరిత రాజకీయాలను ప్రోత్సహించడం పట్ల పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. పార్టీ అధినాయకత్వం ఇప్పటికైనా మేలుకొని పరిస్థితులు చక్కదిద్దకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజల తిరస్కారానికి గురికాక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.  

Last modified on Tuesday, 05 June 2018 15:34

Google Ad

Subscribe