RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

అస‌మ‌ర్ధ‌తే అస‌లు రోగం…!

  • February 15, 2018 | UPDATED 16:20 IST Views: 710
  • Share

 

ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం… రియ‌ల్ టైం పాల‌న ఎక్క‌డ‌..? రాష్ట్రంలో ఏ మూల ఏం జ‌రిగినా క్ష‌ణాల్లో తెలుసుకుంటామ‌ని చెబుతున్న ప్ర‌భుత్వాధినేత‌ల‌కు స‌మాధానం చెప్పుకోలేని ప‌రిస్థితి. రాజ‌ధాని ప్రాంతంలో ఎంతో ఘ‌న చ‌రిత్ర ఉన్న ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో వ‌రుస ఘ‌ట‌న‌లు ఆరోగ్య శాఖ ను త‌ల దించుకొనేలా చేస్తున్నాయి. ఎలుకల దాడిలో శిశువు మ‌ర‌ణం..ఆస్ప‌త్రిలో పాములు..అనంత‌పురం ఆస్ప‌త్రిలో మ‌ర‌ణాలు..ఇప్పుడు.. గుంటూరు ప్ర‌భుత్వాసుప‌త్రిలో సెల్ ఫోన్ వెలుగుల్లో ఆప‌రేష‌న్లు..ఇలా  ఇన్ని వైఫ‌ల్యాలు కనిపిస్తున్నా..ప్ర‌భుత్వంలో చ‌ల‌నం లేదు. ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా నిలిచే ప‌త్రిక‌లే ఈ అంశాల‌ను ప్ర‌ధాన క‌ధ‌నాలు గా ప్ర‌చురిస్తున్నా ..ప్ర‌భుత్వంలో మాత్రం స్పంద‌న క‌నిపించ‌టం లేదు. TDP ప్ర‌భుత్వం ఏర్ప‌డిన నాటి నుండి APలో ఆరోగ్య శాఖ పూర్తిగా వైఫ‌ల్యం చెందింది. చెందుతూనే ఉంది..

 

APలో రియ‌ల్ టైం పాల‌న అంటూ ప్ర‌భుత్వాధినేత‌లు గొప్ప‌లు చెప్పుకుంటున్నారు. కానీ, ప్ర‌జ‌ల ప్రాణాలు మాత్రం రియ‌ల్ టైం పాల‌న‌లో గాలిలో దీపాల్లా ఉంటున్నాయి. ప్రాణాలు ర‌క్షించాల్సిన ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో నిర్ల‌క్ష్యం రాజ్య‌మేలుతోంది. వైద్య ఆరోగ్య శాఖ TDP ప్ర‌భుత్వంలో పూర్తిగా వైఫ‌ల్యం చెందింది. తొలి నుండి ఆస్ప‌త్రుల నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యం క‌నిపిస్తోంది. గుంటూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ఎలుక‌ల దాడిలో శిశువు ప్రాణాలు కోల్పోయాడు. ఇది ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠ‌కే మ‌చ్చ‌గా నిలిచింది. ఆ త‌రువాత ఇదే గుంటూరు ఆస్ప‌త్రి లో ఎలుక‌లను ప‌ట్టుకోవ‌టం కోసం ల‌క్ష‌లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసారు. ఇక‌, ఇదే ఆస్ప‌త్రిలో పాముల సంచారం క‌ల‌క‌లం సృష్టించింది. గుంటూరు ప్ర‌భుత్వాస్ప‌త్రికి ఎంతో ఘ‌న చ‌రిత్ర ఉండేది. ఇప్ప‌టికీ అనేక మంది ప్ర‌ముఖ వైద్యులు ఇక్క‌డ సేవ‌లు అందిస్తు న్నారు. అనేక మంది NRIలు ఆస్ప‌త్రి అభివృద్ది కోసం కోట్లాది రూపాయాల విరాళాలు ఇస్తున్నారు. కానీ ఆస్ప‌త్రిలో సేవ‌ల పై మాత్రం సాధార‌ణ ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం క‌ల్పించ‌లేక‌పోతున్నారు. మంత్రి కామినేని గుంటూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో మోకాలు శ‌స్త్ర చికిత్స చేయించుకున్నారు. అయితే, బ‌య‌ట నుండి వైద్యుల‌ను తీసుకొచ్చి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చికిత్స చేయించుకున్న‌ట్లుగా ప్ర‌చారం జరగటంతో మంత్రి మ‌రోసారి అభాసు పాల‌య్యారు. వైద్య ఆరోగ్య శాఖ‌లో వ‌స్తున్న ఫిర్యాదులు..వైఫ‌ల్యాలు పూర్తిగా ప్ర‌భుత్వ ఆసమ‌ర్ద‌త‌కు కార‌ణంగా నిలుస్తున్నాయి. తాజాగా గుంటూరు ఆస్ప‌త్రిలో వెలుగులోకి వ‌చ్చిన ఘ‌ట‌న సైతం ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది.

మంచి పేరు ప్ర‌ఖ్యాతులున్న గుంటూరు ప్ర‌భుత్వాసుప‌త్రిలో ఆప‌రేష‌న్ ధియేట‌ర్ల‌లో సైతం సౌక‌ర్యాలు స‌రిగ్గాలేని విష‌యం బ‌య‌టకు వ‌చ్చింది. సెల్ ఫోన్ టార్చ్ వెలుగులో స‌ర్జ‌రీలు చేస్తున్న వార్త‌లు ప్ర‌భుత్వ మ‌ద్దుతు పత్రిక‌ల్లోనే మొద‌టి పేజీలో రావ‌టంతో ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో టెన్ష‌న్ మొద‌లైంది. కేవ‌లం గుంటూరు ఆస్ప‌త్రిలోనే కాదు..కాకినాడ‌-అనంత‌పురం వంటి జిల్లాల్లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో సైతం అనేక స‌మ‌స్య‌లు వెలుగు లోకి వ‌స్తున్నాయి. ముఖ్య‌మంత్రి చేసిన అనేక స‌మీక్ష‌ల్లో సైతం ఆరోగ్య శాఖ ప‌ని తీరు పై అనేక మార్లు అసంతృప్తి వ్య‌క్తం చేసారు. అనేక హెచ్చ‌రిక‌లు చేసారు. కానీ, ఎటువంటి చ‌ర్య‌లు లేక‌పోవ‌టంతో AP ఆరోగ్య శాఖ తీరు మ‌చ్చ‌గా మారుతోంది. పేద‌లు వ‌చ్చే ఆస్ప‌త్రుల్లోనే ఇటువంటి ప‌రిస్థితులు ఉండ‌టంతో సామాన్యులు సైతం బెంబేలెత్తుతున్నారు. ఒక‌వైపు ఆరోగ్య శ్రీ నిబంధ‌న‌ల్లో అడ్డ‌గోలు నిర్ణ‌యాల‌తో సేవ‌ల‌ను దూరం చేస్తోంది ప్ర‌భుత్వం. మ‌రో వైపు 108 సేవల‌ను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ప్ర‌యివేటు కంపెనీల‌కు దోచి పెట్టేందుకు PHCల్లో  ర‌క‌ర‌కాల పేరుతో వైద్య సేవలు అందిస్తున్నామంటూ ఆరోగ్య శాఖ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతోంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇక‌, ఆరోగ్యాంధ్రప్ర‌దేశ్ గా AP ని మారుస్తామ‌ని ప‌దే ప‌దే చెప్పే ప్ర‌భుత్వ పెద్ద‌లు..ఇటువంటి విష‌యాల పై సీరియ‌స్ గా స్పందించిన‌ట్లు లీక్‌లు ఇవ్వ‌టం మిన‌హా చ‌ర్య‌లు మాత్రం ఏమీ ఉండ‌టం లేదు. ఇదంతా అస‌మ‌ర్ధ‌త‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.