RajakeeyaaluRajakeeyaalu

Friday, February 23, 2018

పవన్ మెడలో ఎర్ర జెండా…!

  • October 12, 2017 | UPDATED 15:41 IST Views: 1431
  • Share

 

పవన్ కల్యాణ్…. తెలుగు రాజకీయాల్లో ప్రతి నోటా నలుగుతున్న మాట. గత ఎన్నికల్లో BJP, తెలుగుదేశం కూటమితో జత కట్టి వారికి అధికారం కట్టపెట్టేందుకు కృషి చేసిన పవన్ కల్యాణ్ ఈ సారి ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాలనుకుంటున్నారు. అందుకోసం జనసేనను సన్నద్దం చేస్తున్న పవన్ కల్యాణ్ రెండు రాష్ట్రాల్లోనూ ఎంపిక చేసిన, బలం ఉన్న నియోజగవర్గాల్లోనే పోటీ చేయాలనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో తెలుగుదేశం, BJP కూటమితో ఆయన జత కట్టడం లేదని తేలిపోయింది. అయితే, తాజాగా మాత్రం వామపక్ష పార్టీలైన CPM, CPIలు పవన్ తో జత కట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆ రెండు పార్టీలకు కూడా రెండు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్లే బలం ఉంది. ఆ స్ధానాల్లోనూ.. పవన్ బలం ఉన్న స్ధానాల్లోనూ కలిసి పోటీ చేస్తే ఇరువురికి మేలు కలుగుతుందనేది వామపక్ష పార్టీల నాయకుల ఆలోచనగా ఉంది. ఈ విషయమై గతంలో CPI నాయకుడు నారాయణ కూడా పవన్ కల్యాణ‌్ తో కలిసి పని చేసే ఆలోచన తమకు ఉందని విలేకరులతో మాటల సందర్భంలో అన్నారు. అలాటే CPMలో కూడా తమ్మినేని వీభద్రం వంటి నాయకులకు పవన్ కల్యాణ్ తో మంచి సంబంధాలున్నాయి.
 
ఇద్దరి ఉమ్మడి శత్రవు బాబే
గత ఎన్నికల సమయంలో చంద్రబాబుతో కలిసిన పవన్ కల్యాణ్ కు ఆ తర్వాత ఆయనతో చెడింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా సాధించడంతో పాటు అనేక అంశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన నేత పవన్ కల్యాణ్ మధ్య దూరం చాలా పెరిగింది. మరోవైపు BJP వైఖరి పట్ల కూడా పవన్ కల్యాణ్ కినుక వహించాడు. ఎన్నికల ముందు ఒకమాట గెలిచిన తర్వాత ఒక మాట చెప్పడంతో పవన్ కల్యాణ్ ఆగ్రహంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలతో తాను తెలుగుదేశంతో కలిసే అవకాశం లేదని పవన్ చెప్పకనే చెప్పేశారు. తాను బలంగా ఉన్న నియోగకవర్గాల్లోనే పోటీ చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఇదే అదనుగా వామపక్షాలు కూడా జనసేనకు దగ్గరవ్వాలని భావిస్తున్నాయి. పవన్ కల్యాణ్ లోనూ విప్లవ భావాలున్నాయని, వామపక్షాలు ఆరాధించే చేగువేరాను ఆయన కూడా ఆరాధిస్తాడని ఆ పార్టీల నాయకులు చెబుతున్నారు. ^ నిరంతరం ప్రజల కోసం పోరాటం చేస్తున్న వామపక్ష పార్టీలంటే తనకు గౌరవమని, వారి పోరాటల నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందాను  అని పవన్ కల్యాణ్ కూడా ఇంతకు ముందు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో అటు వామపక్షాలకు, ఇటు పవన్ కల్యాణ్ కు కూడా తాజా శత్రువు చంద్రబాబు నాయుడేనని ఆ ఇరువురు భావిస్తున్నారు.

పవన్ కల్యాణ్ ఓకె
వామపక్షాలు తమతో కలుస్తాయంటే పవన్ కల్యాణ్ సరే అంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అటు వామపక్షాలు, ఇటు పవన్ కల్యాణ్ లది ఒకటే లక్ష్యమని, అందువల్ల వారిద్దరు కలిస్తే మంచిదేనని విశ్లేషకులు అంటున్నారు. వారిద్దరు అధికారంలోకి రావడం సాధ్యం కాదు కాని రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న చంద్రులకు ఇబ్బందేనని వారు బేరీజు వేస్తున్నారు. అంతే కాదు.. ఇద్దరి లక్ష్యం కూడా అధికారం కాదు కాబట్టి ఈ కూటమి పట్ల ప్రజల్లో సానుకూలత వస్తుందన్నది వారి అభిప్రాయం. పవన్ కల్యాణ్, వామపక్షాలు కూడా కాంగ్రెస్ ను వ్యతిరేకించే పార్టీలేనని, ఇక BJP అధికారంలో రాక ముందు పవన్ కల్యాణ్ ఆ పార్టీని అభిమానించి చేరువైనా.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాయకుల పద్దతి చూసి వారికి దూరమయ్యారని విశ్లేషకుల అభిప్రాయం. గత ఎన్నికల్లోనే పవన్ కల్యాణ్ BJPకి మద్దతు పలకకుండా ఉండాల్సిందని, అయితే కొన్ని శక్తుల కారణంగా ఆయన అటువైపు వెళ్లారని, ఇది ఎంత తప్పో పవన్ కు ఆ తర్వాత తెలిసిందనేది వారి వాదన.
 
అభిమానులూ వామపక్షమే
అధికారం మనకు ముఖ్యం కాదు… ప్రజలే ముఖ్యమంటున్న తమకు వామపక్షాలే సరైన మిత్రులనేది జనసైనికుల మాటగా తెలుస్తోంది.  ఇంతకు ముందు తెలుగుదేశం, BJPలతో కలిసి పని చేసి తప్పు చేసామని, ఎన్నికల ముందు ఒక విధంగానూ… అధికారంలోకి వచ్చిన తర్వాత మరో విధంగానూ ప్రవర్తించారని జనసేన కార్యకర్తలు అంటున్నారు. అధికారం కోసం కాకుండా విలువల కోసం పని చేస్తున్న వామపక్షాలకు ప్రజల్లో గౌరవం ఉందని, తమ నాయకుడ్ని కూడా ప్రజల పట్ల అదే గౌరవం ఉందని వారంటున్నారు. వామపక్షాలకు చెందిన కార్యకర్తలు కూడా క్రమశిక్షణ కలిగిన వారేనని, వారితో కలిస్తే తమకు మేలే తప్ప కీడు కలగదనేది వారి అభిప్రాయం. ఇరువురి మధ్య అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కలిగితే వచ్చే ఎన్నికల్లో వామ జనసేన పక్షంగా పోటీ చేసే అవకాశాలున్నాయి.