RajakeeyaaluRajakeeyaalu

Friday, February 23, 2018

కుటిల రాజకీయమే కేశినేని మూతకు కారణమా…! నానీని రాజకీయంగా అణగదొక్కడమే ఉద్దేశ్యమా…?

  • April 10, 2017 | UPDATED 13:00 IST Views: 27619
  • Share

 

కుటిల రాజకీయమే కేశినేని మూతకు కారణమా…!

నానీని రాజకీయంగా అణగదొక్కడమే ఉద్దేశ్యమా…?

ఎనిమిది దశాబ్ధాలు ఒక సంస్ధను నడపడమంటే మామూలు విషయం కాదు. ఎన్నో త్యాగాలు, వ్యయప్రయాసలను తట్టుకుని నిలబడితే కానీ అంత విజయవంతంగా ఒక వ్యవస్ధను నడపడం సాధ్యం కాదు. విజయవాడ కేంద్రంగా గడచిన ఎనభై సంవత్సరాలుగా ట్రాన్స్ పోర్ట్ రంగంలో సేవలందిస్తున్న కేశినేని ట్రావెల్స్ ఇంత అకస్మాత్తుగా మూత పడటం వెనుక అసలు కోణం ఏంటి..? స్వయంగా ఆ ట్రావెల్స్ యజమాని కేసినేని నాని పార్లమెంటు సభ్యుడిగా ఉండి అతను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధికారంలో ఉండి కూడా ఎందుకు ఆయన తాతల కాలం నాటి కుటుంబ వ్యాపారాన్ని మూసేయాల్సి వచ్చింది. ఇందులో నాని అసమర్ధత ఉందా లేక ఏదైనా రాజకీయ కోణం ఉందా…?

 

అయితే కర్ణుడి చావుకి వంద కారణాలన్నట్లు కేశినేని ట్రావెల్స్ మూసివేయడం వెనుక ఆర్థిక, నిర్వహణ, రాజకీయ కోణాలతో పాటు కొత్తగా వస్తున్న ట్రాన్స్ పోర్ట్ ఆపరేటర్ల నుంచి పోటీ తట్టుకోలేక పోవడం, ఇటీవల కాలంలో బస్సులను అప్ గ్రేడ్ చేసుకోలేకపోవడం వంటి అనేక కారణాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వీటిలో చాలా కారణాలను కేశినేని సంస్ధ గడచిన ఎన్నో దశాబ్ధాలుగా తట్టుకుని నిలబడింది. కానీ ఈ సారి కొత్తగా ఎదురైన రాజకీయ కారణాలను మాత్రం తట్టుకోలేక పోయిందని కేశినేని సంస్ధలో ఎన్నో ఏళ్లుగా పనేచేస్తున్న సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నానీ ముక్కుసూటి తనం… ఎవరి నుంచి మాట పడక పోవడం, విజయవాడ పార్లమెంట్ స్థానంపై విపరీతమైన ప్రేమ పెంచుకోవడం… స్వయంగా చొరవ తీసుకుని కేంద్రంలో లాబీయింగ్ చేసి నేరుగా విజయవాడ అభివృద్ధికి నిధులు తీసుకురావడం వంటి వ్యవహారాలు కేశినేని ట్రావెల్స్ కొంపముంచాయని నానీ సన్నిహితులు వాపోతున్నారు. నానీ రాజకీయాల్లోకి రాకుండా ఉంటే మరో వంద సంవత్సరాలు కేశినేని ట్రావెల్స్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సేవలందించేదని సంస్ధ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

వాస్తవానికి కేశినేని ట్రావెల్స్ రవాణా రంగంలో అనేక దశాబ్ధాలుగా తనదైన ముద్రవేసుకుని పురోగమించింది. అయితే గత ఐదారేళ్లుగా బస్సుల నిర్వహణ మీద శ్రద్ధ పెట్టకపోవడం… కొత్త బస్సులు కొనకపోవడం ఇదే సమయంలో ఒకరిద్దరు ట్రాన్స్ పోర్ట్ ఆపరేటర్లు ఫీల్డ్ లోకి వచ్చి కన్జ్యూమర్ ఫ్రెండ్లీ విధానాలతో బస్సులు నడుపుతుండటంతో కేశినేని ట్రావెల్స్ ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గిపోయింది. ఇదే సమయంలో రాష్ట్రం విభజన జరగడం… కేశినేని నాని క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నిక కావడంతో ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం మీద కన్నా రాజకీయాలపై ఎక్కువ దృష్టి సారించారు నాని. ఇక విభజన అనంతరం తెలంగాణలో కూడా పెద్ద పెద్ద ట్రాన్స్ పోర్ట్ ఆపరేటర్లు రవాణా రంగంలో క్రియాశీలమయ్యారు. దానికితోడు కేశినేని బస్సులు నడిపే ప్రధాన రూట్లలో తెలంగాణకి చెందిన ఆరెంజ్ ట్రాన్స్ పోర్ట్ తన బస్సులను విరివిగా నడపడం ప్రారంభించింది. ఇందుకు పరోక్షంగా తెలంగాణ సర్కార్ కూడా సహకరించి తెలంగాణలోకి వచ్చే కేశినేని ట్రావెల్స్ బస్సులను ఇబ్బందులను పెట్టడం ప్రారంభించింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ప్యాసింజర్లను క్యారీ చేసే ఓల్వో బస్సుల్లో భారీ పరిమాణంలో కార్గో కూడా క్యారీ చేసి నడిపేది కేశినేని ట్రావెల్స్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ఈ అక్రమ కార్గో వ్యాపారానికి అడ్డుకట్టపడింది. దీంతో ఓ పక్కన ఆక్యుపెన్సీ తగ్గడం… మరో పక్క అక్రమంగా కార్గో మీద వచ్చే ఆదాయం కూడా కోల్పోవడంతో క్రమక్రమంగా కేశినేని ట్రావెల్స్ నష్టాలబాట పట్టింది. తెలంగాణ ఆర్టీసి ఆదాయం పెరగాలన్నా, ఇక్కడి ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్ ఆపరేటర్లు నిలదొక్కుకోవాలన్నా హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు షిర్డీ, హైదరాబాద్ టు బెంగుళూరు ప్రధాన రూట్లు. ఈ రూట్లలో ఇప్పటికే ఆధిపత్యం చెలాయిస్తున్న కేశినేని ట్రావెల్స్ ను ఒక్క తొక్కు తొక్కే సరికి విలవిల్లాడిపోయారని ఓ ప్రచారం.

ఇక కేశినేని ట్రావెల్స్ మూతపడటానికి మరో కారణంగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న మారో కారణం రాజకీయ కారణం. ఏ పనైనా శ్రద్ధగా ప్రేమించి చెయ్యడం కేశినేని నానీ లక్షణం. రాష్ట్ర విభజన సమయంలో రాజకీయాల్లోకి రావడం. అందునా తాను ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం రాజధాని పరిధిలోకి రావడంతో రెట్టించిన ఉత్సాహంతో పనియేయడం ప్రారంభించారు నాని. దశాబ్దాల తరబడి తనకు ట్రాన్స్ పోర్ట్ రంగం ద్వారా ఏర్పడిన పరిచయాలను విజయవాడ అభివృద్ధికి వాడుకోవాలన్న తలంపుతో ప్రఖ్యాత “టాటా” సంస్ధ యాజమాన్యాన్ని విజయవాడ తీసుకువచ్చి వారు తన నియోజవకర్గం పరిధిలో ఉన్న 263 గ్రామాలను దత్తత తీసుకునేలా ఒప్పించారు కేశినేని నాని. అదే కాకుండా కేంద్రంలో లాబీ చేసి దుర్గమ్మ ఫ్లై ఓవర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం, అలాగే బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి కూడా కేంద్ర సహాయం తెచ్చుకోవడం వంటి పలు లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ను సాల్వ్ చేశారు నాని. దీంతో విజయవాడలో నానికి అప్పటి వరకూ ఉన్న రఫ్ ట్రాన్స్ పోర్టర్ ఇమేజ్ పోయి ఓ నాయకుడి ఇమేజ్ వచ్చింది. అయితే ఇది చంద్రబాబుకు నచ్చని పరిణామమని ఆయన మనస్తత్వం తెలిసిన పార్టీ సీనియర్లు అంటున్నారు.

 

పైగా వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి తన కోడలు బ్రాహ్మణితో పోటీ చేయించాలనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం కూడా అవుతోంది. ఈ కారణంగా నియోజకవర్గంలో నానీ బలపడకుండా చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని కేశినేని నాని అభిమానులు అనుమాన పడుతున్నారు.

 

ఇందుకు వారు కొన్ని ఉదాహరణలు కూడా చెపుతున్నారు. ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ బాలసుబ్రమ్మణ్యంతో అయిన వాదోపవాదాల విషయంలో చంద్రబాబు వెంటనే రియాక్ట్ అయి కేశినేని నానిని ఆర్టీఎ కార్యాలయానికి పంపి మరీ బాలసుబ్రహ్మణ్యానికి సారీ చెప్పించారని అదే వనజాక్షి విషయంలో చింతమనేని అంత రచ్చ చేసి భౌతికంగా దాడి చేసినా రాజీ చేశారు తప్పితే అతనితో సారీ చెప్పించలేదని గుర్తుచేస్తున్నారు. అలాగే గన్నవరం ఎయిర్ పోర్ట్ లో జెసిదివాకర్ రెడ్డి చేసిన హంగామా విషయంలో కానీ, ముడుపుల కోసం రైల్వే అధికారులను బెదిరించినట్లు రికార్డెడ్ ఎవిడెన్స్ లు ఉన్నా కురుగుండ్ల రామాక్రిష్ణ, కోడెల శివరామక్రిష్ణల విషయంలో ఎందుకు చంద్రబాబు వారితో అధికారులకు సారీ చెప్పించ లేదని నానీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కావాలనే నానీ ఇగోని రెచ్చగొట్టి ట్రావెల్స్ మూసేసే స్ధితికి చంద్రబాబే తెచ్చారనేది వారి అభిప్రాయం. ఏది ఏమైనా ఓ ఎనభై ఏళ్ల చరిత్ర కలిగిన సంస్ధ కుటిల రాజకీయాల కారణంగా మూతపడింది. అందులో పని చేసే వేలాది ఉద్యోగస్తులు రోడ్డున పడ్డారు అన్నది మాత్రం వాస్తవం.