October 21, 2018
info@rajakeeyaalu.com

చదివిన వారి సంఖ్య

 
Rajakeeyaalu

Rajakeeyaalu

నారా హమారా ...డ్రామా హమారా..

ముస్లింలపై కక్ష్య గట్టిన బాబు.. 

కపటప్రేమ చూపించడంలో చంద్రబాబును మించిన మాయగాడు మరొకరుండరంటే అతిశయోక్తి కాదు. ఆ కపటప్రేమ కూడా తననెవరైనా ప్రశ్నిస్తే విషంగా మారిపోతుంది. ప్రేమ కురిపించినంతసేపు కూడా ఉండలేరు. నారా హమారా అంటూ గుంటూరులో ఆడిన డ్రామాలో ఇదే బట్టబయలైంది.

ప్రశ్నించనే లేదు..కేవలం ప్లకార్డులు ప్రదర్శించారంతే . 24 గంటలకు పైగా పోలీస్ స్టేషన్లు తిప్పుతున్మారు. ముస్లిం వర్గాల నుంచి ఒత్తిడి అధికమవడంతో 24 గంటల అనంతరంబున అరెస్టు చూపించారు. ప్రజాస్వామిక హక్కుల్ని నిలువునా కాలరాసేశారు.

విధానాలు నచ్చకపోయినా...న్యాయం జరగకపోయినా శాంతియుతంగా నిరసన తెలుపుకునే హక్కును రాజ్యాంగమే కల్పించింది. ఈ ప్రాధమిక హక్కును కాలరాస్తూ..ప్రశ్నించే గళాల్ని టీడీపీ ప్రభుత్వం అణచివేస్తోంది. గుంటూరు లో బాబు తలపెట్టిన డ్రామా హమారా లో ప్లకార్డుల ద్వారా నిరసన తెలిపిన ముస్లిం యువకులపై బాబు జులుం ప్రదర్శించారు.. ముస్లింల కోసం ఏర్పాటుచేసిన ముస్లింల సభలో..ముస్లిం యువకుల్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ పగ తీర్చుకున్నారు. ముస్లింల నుంచి వ్యతిరేకత ఎక్కువవటంతో 24 గంటల తరువాత అరెస్టు చూపించారు. ఇదీ బాబుకు ముస్లింలపై ఉన్న ప్రేమ..

షరీఫ్ లాంటి పెద్దలు నోరెందుకు మెదపడం లేదు...

టీడీపీలో ఉన్న ఎమ్మెల్సీ షరీఫ్ లాంటి పెద్దలకు గుంటూరులో జరిగిన దౌర్జన్యం కన్పించడం లేదా..ప్లకార్డుల్ని ప్రదర్శించడమే నేరమా ?..అయినా ప్లకార్డుల్లో ఉన్నది వాస్తవం కాదా.? వక్ఫ్ ఆస్థుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అడగడం తప్పా..? ఉర్దూ మీడియం పాఠశాల ఏర్పాటుచేయమని అడగకూడదా..? మదర్సా విద్యార్ధులకు స్కాలర్ షిప్ కోరకూడదా.?ముస్లిం నాయకత్వాన్ని చంద్రబాబు మరిచారన్నది నిజం కాదా.? ఒకవేళ అబద్ధమైతే మీలాంటివారికి మంత్రి పదవి ఎందుకు రాలేదు ? నారా హమారా నహీ..అనడం సరైనదే కదా..? టీడీపీలో ముస్లింలకు న్యాయం జరగదని చెప్పడం కరెక్టే కదా..? 2012లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీ నాయకుడు బాబు ..ముస్లింలకు 15 సీట్లు ఇస్తానని చెప్పి మర్చిపోలేదా..? 15 సీట్లు ఇస్తానని చెప్పి కేవలం ఒక సీటు ఇచ్చినప్పుడు మీరెందుకు మాట్లాడలేదు..?

సభలో చెప్పిందంతా అబద్ధమేనా బాబూ..!

ముస్లింలపై మూకదాడులు జరగకుండా రక్షణ కల్పిస్తానని..అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకొస్తానని ఇదే డ్రామా హమారాలో బాబు ప్రకటన చేశారు. ముస్లింల జోలికి ఎవరొచ్చినా సహించేది లేదని చెప్పిన 24 గంటల్లోనే తనది కపటప్రేమ అని నిరూపించుకున్నారు. సహనం లేకుండా పోలీసులతో పగ తీర్చుకున్నారు.

ఇదంతా ముస్లిం వర్గాలైతే స్పష్టంగా గమనిస్తున్మాయి గానీ..ఆ పార్టీలో ఉన్న పరిమితమైన నేతలకు ఎప్పుడు అర్ధమవుతుందో..! 24 గంటల నుంచి అక్రమంగా తోటి ముస్లిం యువతను నిర్బంధిస్తే..నోరెందుకు మెదపడం లేదు..

మళ్లీ రావాలని ఎవరూ కోరుకోవడమ లేదు

అనకాపల్లి సభలో నిప్పులు చెరిగిన జగన్..

 

మళ్లీ నువ్వే రావాలి. ఎల్లో మీడియా సహకారంతో చంద్రబాబు చేస్తున్న నయా నాటకమిది. మానసికంగా ప్రజల మనసుల్ని ప్రభావితం చేస్ందుకు చేస్తున్న డ్రామా ఇది. ఇప్పటికే హోర్డింగులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించేశారు.. అందుకే జగన్ అనకాపల్లి సభలో ఇదే అంశంపైచేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది.

ప్రజా సంకల్పయాత్ర 249 వ రోజు అనకాపల్లి చౌరాస్తాలో కుక్కిరిసిన జనసంద్రం మధ్యన జగన్ ప్రసంగం సాగింది..బాబు తలపెట్టిన కొత్త డ్రామా, స్థానిక సమస్యల్ని ప్రధానంగా ప్రస్తావించారు. ముఖ్యంగా సహకార రంగం , చక్కెర రైతుల గురించి మాట్లాడిన తీరు ఆ రైతుల మనసుల్లో వెళ్లిందనే చెప్పాలి.

బాబూ..మళ్లీ నిన్నెందుకు కోరుకోవాలి

అన్ని వర్గాల్ని ఏకంగా వంచించినందుకు నిన్ను కోరుకోవాలా.. లేదా...ఒక్క హామీ కూడా నెరవేర్చనందుకు కోరుకోవాలా అంటూ జగన్ ఎద్దేవా చేశారు. రైతుల్ని నట్టేట ముంచినందుకా...ఏ కుటుంబంలోనూ ఆత్మీయత,అనురాగం లేకుండా చేసినందుకు నిన్ను రమ్మని కోరాలా అంటూ జగన్ ధ్వజమెత్తారు. అందర్నీ వంచించినందుకా ..అన్నపూర్ణ వంటి రాష్ట్రాన్ని అవినీతిమయం చేయనందుకు నిన్ను కావాలనుకోవాలా అని జగన్ ప్రశ్నించారు. ప్యాకేజీకు ఆశపడి..లేని ప్యాకేజీని ఉన్నట్టు చూపి..హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టినందుకు నిన్ను కోరుకోవాలా అంటూ మండిపడ్డారు. మట్టి నుంచి ఇసుక వరకూ.. అంతా దోచుకుంటూ భూ కబ్జాలు చేస్తున్నందుకు నిన్ను కోరుకోవాలా అంటూ విమర్శలు సంధించారు.

చేదెక్కిన చెరకు రైతు..

నకాపల్లి  ప్రత్యేక జిల్లా..

అనకాపల్లి అంటేనే తియ్యని బెల్లం గుర్తుకు వస్తుంది.కానీ ఇవాళ చేదెక్కింది. ఓ వైపు పెట్టుబడులు పెరిగాయి..మరోవైపు రైతాంగం నష్టాలలో ఉంది..అప్పులు తీర్చలేక రైతులు భూములు అమ్ముకుంటున్న పరిస్థితి కన్పిస్తోందంటూ తమ గురించి పూర్తిగా చెప్పగానే ఆ రైతన్నల్లో ఆనందం కన్పించింది. తమ సమస్యలపై జగన్ కున్న అవగాహనకు ఆకర్షితులయ్యారు. తమ ప్రభుత్వం అధికారంలో వస్తే..చక్కెర రైతుల జీవితాలలో మళ్లీ తీపిని నింపుతానని జగన్ ఇచ్చిన హామీ ఆ రైతులలో నమ్మకాన్ని కల్గించింది. అనకాపల్లి ఆస్పత్రిలో వైద్యుల్లేక ప్రజారోగ్యం పాడవుతుందని..వైద్యం కోసం కేజీహెచ్ కు వెళ్లవలసిన పరిస్థితి వస్తోందని జగన్ తెలిపారు. అనకాపల్లిని గ్రేటర్ విశాఖలో కలిపినా ప్రయోజనం జరగలేదన్నారు. పైగా పన్నుల బాదుడు ఎక్కువైందన్మారు..తమ ప్రభుత్వం అధికారంలో వస్తే..అనకాపల్లిని ప్రత్యేకజిల్లాగా మారుస్తానంటూ జగన్ ఇచ్చిన హామీ సభలో మార్మోగిపోయింది.

పేదల ఉన్నత చదువు బాధ్యత తనదేనన్నారు జగన్. ఏం చదవాలనుకున్నా చదువుకోమని జగన్ ఇచ్చిన హామీ విద్యార్ధులలో ఆనందం నింపింది. ఎన్ని లక్ఖల ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుందంటూ జగన్ భరోసా ఇచ్చారు. పోటెత్తిన జనం మద్య జగన్ చేసిన ప్రసంగం అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది.

నారా హమారా కాదు..పరాయా

నారా ముస్లిం ద్రోహి అంటూ నినాదాలు..

                                                                    

అదేంటో ఆ పార్టీతో మిత్రత్వం చేసినంతసేపు బాబుకు ముస్లింలు అసలు గుర్తుకు రారు. బంధం చెడిన తరువాత మాత్రం గుర్తుకొచ్చేస్తారు. గతంలో అయితే కనీసం సీట్లైనా ఇచ్చేవారు. కేబినెట్ లో స్థానం కూడా కల్పించేవారు. ఇప్పుడది కూడా లేదు. గత ఎన్నికల్లో కనీసం ఓ సీటైనా ముస్లింలకు కేటాయించారా అంటే.. ఒక్క పీలేరు తప్ప మరెక్కడా లేదు. ఇప్పుడు బీజేపీతో బంధం చెడిన నేపధ్యంలో మళ్లీ ముస్లింలు గుర్తుకువచ్చారు బాబుకు. నారా హమారా...టీడీపీ హమారా అంటూ ఓ ఓట్లపై గాలం వేసేందుకు కుటిల యత్నాలు ప్రారంభించేశారు.

అప్పుడూ ఇంతే..

గతంలో అంటే 1998 పార్లమెంట్, 99 సాధారణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ముస్లింలను మర్చిపోయారు. అనంతరం 2004 ఎన్నికలకు ముందు ఆ పార్టీతో ఇంకెప్పుడూ స్నేహం చేయనంటూ బహిరంగంగా శపధం కూడా చేసేశారు. ముస్లిం ఓట్ల కోసం చాలా ప్రయాసపడ్డారు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని కూడా చెప్పిన బాబు...2014లో మళ్లీ మాట మార్చేశారు. ముస్లింలు ఏ మాత్రం ఇష్టపడని మోడీ నేతృత్వంలోని బీజేపీతో జత కట్టారు. ఈసారైతై మంతి పదవి కాదు కదా...కనీసం సీటు కూడా ఇవ్వలేదు. 175 నియోజకవర్గాల్లో పీలేరు తప్ప మరెక్కడా ముస్లింలకు ఆ పార్టీ కనీసం టికెట్ ఇవ్వలేదు. పీలేరులో కూడా తన రహస్య మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డికి మేలు చేయడానికి మాత్రమే ముస్లిం అభ్యర్ధికి టికెట్ ఇచ్చారు. పెద్దగా ప్రభావితం చేయలేని అభ్యర్ధికి టికెట్ ఇచ్చి..జై సమైక్యాంధ్ర పార్టీ గెలుపుకోసం ప్రయత్నించారు. బహుశా అందుకే అక్కడ టీడీపీ మూడో స్థానంలో నిల్చింది. అనంతర పరిణామాల్లో వైసీపీ నుంచి ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేల్ని చేర్చుకున్నా...పశ్చిమకు చెందిన షరీఫ్ కు ఎమ్మెల్సీ ఇచ్చినా మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం బీజేపీతో బంధం చెడిన నేపద్యంలో బాబుకు మళ్లీ ముస్లింలు గుర్తుకువచ్చారు. నారా హమారా అంటూ...డ్రామాలు మొదలెట్టారు.

నాలుగేళ్లుగా గుర్తుకు రాలేదా..

ముస్లింలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తానని..4 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడతానని గుంటూరు సభ సాక్షిగా హామీలిస్తున్నారు. హజ్ యాత్రకు అమరావతి నుంచి నేరుగా విమాన సదుపాయం కల్పిస్తానని అంటున్నారు. మొన్నటివరకూ తెగ పొగిడి ఆకాశానికెత్తిన మోడీపై...ఇప్పుడు ముస్లిం ఓట్ల కోసం విమర్శలు చేస్తున్నారు. కశ్మీర్ లో ఆసిఫా అత్యాచారానికి గురైనప్పుడు నోరెత్తని బాబు...ఇప్పుడు ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. నాలుగేళ్లుగా ముస్లింలకు మంత్రి వర్గంలో చోటు కల్పించని బాబు..ఇప్పుడు కల్పిస్తాననడం ఎంతవరకూ సమంజసమని ముస్లింలు ప్రశ్నిస్తున్నారు. మరో ఆరేడు నెలల్లో ప్రభుత్వం గడువు ముగుస్తుందనగా.. ఇప్పుడు కేబినెట్ లో స్థానం కల్పిస్తానంటూ దొంగ హామీలిస్తున్నారు బాబు.

                                                                    

అందుకే సభలో నిరసనలు..

అంతు తేలుస్తానంటూ బాబు హెచ్చరిక

అందుకే గుంటూరు సభలో బాబుకు వ్యతిరేకంగా ముస్లిం యువకులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. నారా హమారా నహీ...నారా ముస్లిం ద్రోహి అంటూ నినాదాలు చేశారు. ముస్లింలకు టీడీపీలో న్యాయం జరగడం లేదని ప్రకార్డులు ప్రదర్శించారు. దీంతో అసహనానికి గురైన బాబు..అంతు తేలుస్తానంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఒకరిద్దరు గొడవ చేస్తే..భయపడతానని అనుకోవద్దని హెచ్చరించారు. పోలీసులకు ఆదేశాలు జారీ చేసి..ఆ ముస్లింలను ఈడ్చుకెళ్లేలా చేశారు. అక్కడ్నంచి పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేయిస్తున్నారు. అప్పటివరకూ ముస్లింలపై ప్రేమ ఉన్నట్టు నటించిన బాబు..అంతలోనే అదే ముస్లింలపై విరుచుకుపడటాన్నిచూసి అక్కడున్న టీడీపీ ముస్లిం ప్రతినిధులు అవాక్కయ్యారు. ఇప్పటికే బీజేపీతో స్నేహం నేపధ్యంలో దూరమైన ముస్లింలను ఎలా ఆకర్షించాలో తెలియక మధనపడుతున్న ఆ ప్రతినిధులు తాజా పరిణామం చూసి ఖంగుతిన్నారు.

ఇలాగయితే కష్టమే..

నెల రోజుల్నించి భీమవరం చుట్టూనే జనసేనాని..

                                                                         

ప్రశ్నించేందుకే అన్న పార్టీ ఇప్పుడు బయటకొచ్చేసింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. అధికారం లక్ష్యం కాదనుకున్న పార్టీ..ఇప్పుడదే అడుగుతోంది. అడపాదడపా నిర్వహించే పవన్ కళ్యాణ్ సభలు తప్ప..మరో అడుగు ముందుకేయలేని పార్టీ ఎన్నికలకు ఎలా వెళుతుందనేది సందేహంగా మారింది. పార్టీ నిర్మాణమే లేనప్పుడు ఎన్నికల సంగ్రామంలో ఎలా పోరాడుతుందో తెలియని పరిస్థితి నెలకొందిప్పుడు.

సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పురిటికష్టాల నుంచి ఇంకా బయటకు రాలేదు. పార్టీ స్థాపించి నాలుగేళ్లు దాటుతున్నా ఆ పార్టీ నిర్మాణం ఇంకా జరగలేదు. రాష్ట్ర్రస్థాయి కమిటీ నియామకాన్ని ఇంకా చేపట్టలేదు. నియోజకవర్గ స్థాయి బాధ్యతల్ని కూడా ఎవరికీ అప్పగించలేదు. నియోజకవర్గ స్థాయి నిర్మాణాన్నే దాటని పార్టీ..ఇక మండల, గ్రామ, బూతు స్థాయికి ఎప్పుడు చేరుకుంటుందో అన్నది అనుమానాస్పదంగా మారింది. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అని చెబుతున్నప్పుడు..అధికారం కోరుతున్నప్పుడు ఎన్నికల సంగ్రామానికి ఎలా సిద్ధమవాలో పార్టీకి తెలియడం లేదనే చెప్పాల్సి వస్తోంది పరిస్థితుల్ని చూస్తుంటే.

ఇలాగయితే కష్టమే..

నెలరోజుల్నించి బీమవరం దాటని జనసేనాని..

                                                                                

జనసేన..పేరుకు మాత్రమే పార్టీ ఉంది. ప్రజల్లో ఆకర్షణ కలిగిన ఓ నాయకుడున్నాడు. ఇది సరిపోదుందా ఎన్నికలకు వెళ్లడానికి అంటే సమాధానం లేదు. ఆవిర్భావం జరిగిన నాలుగేళ్ల వరకూ నిర్మాణంపై దృష్టి లేదు. మొన్నటివరకూ కూడా ఆ నాయకుడు సినిమాలకే పరిమితమైన పరిస్థితి. అయితే ఏప్రిల్ నెలలో పూర్తి స్థాయి రాజకీయాలు చేస్తానని ప్రకటించినప్పుడు...జనసేన జవసత్వాలు కూడదీసుకుంటుందని అందరూ భావించారు. పార్టీ నిర్నాణం జరుగుతుందని.. పటిష్టమవుతుందని అనుకున్నారు. నాలుగు నెలలు దాటుతున్నా సరే ఇంకా ఆ దిశగా కనీసం ప్రయత్నమే జరగలేదు. ఒక్క రాజకీయ వ్యవహారాల కమిటీ నియామకం తప్ప మరేదీ ఈ మధ్య కాలంలో పార్టీలో చోటుచేసుకోలేదు. ఉత్తరాంధ్ర పోరాట యాత్ర చేస్తున్నప్పుడు ఇక పార్టీ దారిలో పడిందనుకుని అంచనా వేశారు. ఆ యాత్రలో పార్టీ కేడర్ లో వచ్చిన ఊపును కొనసాగించడంలో విఫలమయ్యారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా యాత్రయితే..రెండడుగులు వెనుక్కే నడుస్తోంది. ఆ జిల్లాలో యాత్రకు శ్రీకారం చుట్టి నెలవుతున్నా..భీమవరం ప్రాంతాన్నే ఇంకా దాటలేదు. రెండ్రోజులు ఉండటం..తిరిగి వెళ్లిపోవడం..మళ్లీ రావడం.. భీమవరంలోనే బస చేయడం..మొత్తం నెల రోజుల్నించీ పవన్ కళ్యాణ్ యాత్రం భీమవరం చుట్టూనే తిరుగుతోంది. అసలు భీమవరంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. విజయవాడ వెళ్లడం..ఏదో సమావేశంలో పాల్గొనడం, హైదరాబాద్ వెళ్లడం..అక్కడో మీటింగ్ ఏర్పాటు చేయడం...తిరిగి తిరిగి మళ్లీ భీమవరంకే చేరడం ...అంతా గందరగోళంగా ఉంది. అసలు ఉత్తరాంధ్ర యాత్ర విశాఖలో ముగిసినప్పుడు..నేరుగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశిస్తారని పార్టీ నాయకులు భావిస్తే..అంతా రివర్స్ అయింది. కొన్నిరోజులు బ్రేక్ తీసుకుని పశ్చిమలో ప్రారంభించారు. పోనీ ఆ జిల్లా అయినా పూర్తవుతుందా అంటే గొంగళిపురుగు చందంగా ముందుకు కదలడం లేదు.

భీమవరంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కాని ప్రశ్న. ఆ ప్రాంతంపై పవన్ కు ఎందుకంత ఆసక్తో తెలియని పరిస్థితి. వాస్తవానికి ఆగస్టు 15వ తేదీనే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తానని చెప్పినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. కేవలం విజ‌న్ డాక్యుమెంట్ తో స‌రిపెట్టాల్సి వ‌చ్చింది. ఎన్నికలు సమీపించేస్తున్నాయి. అన్ని పార్టీలు ఆ ప్రయత్నాల్లో ఉన్నాయి. పార్టీ నిర్మాణమే లేని పార్టీ ఎన్నికలకు ఎలా వెళ్తుందన్నది కేడర్ ను వేధిస్తున్న ప్రధాన ప్రశ్న ఇప్పుడు. ఫలానా జిల్లాకు ఫలానా వ్యక్తి బాధ్యుడన్న పరిస్థితి గానీ..ఆ నియోజకవర్గానికి ఆ వ్యక్తి కన్వీనర్ అన్న పరిస్థితి గానీ ఇప్పటివరకూ లేదు. నాయకులు అడపాదడపా వస్తున్నారు. పార్టీలో చేరుతున్నారు. అంతకుమించి క్షేత్రస్థాయి నుంచి పార్టీ వెళ్లలేకపోతోంది. ఇప్పటికింకా నాలుగు జిల్లాల పర్యటన కూడా పూర్తి కాలేదు. ఇక మిగిలిన 9 జిల్లాలు ఎప్పుడు చేస్తారని కేడర్ ఆశగా ఎదురుచూస్తోంది. ఇవన్నీ చాలదన్నట్టు పార్టీ అధినేత పవన్ కు ఇప్పుడు కంటి సమస్య వచ్చి పడింది. పూర్తి స్థాయిలో విశ్రాంతి అవసరమన్న వైద్యుల మాటను కాదనే అవకాశాల్లేవు. అదే జరిగితే కనీసం మరో నెల రోజుల వరకూ పార్టీ ఇలాగే ఉండిపోనుంది.

వేగంగా అడుగులు వేయాల్సిన సమయంలో నత్తనడకన సాగుతోంది. ఇక పార్టీలో అంతర్గత సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. పార్టీలో చేరుతున్న నేతలు.. ఎవరికివారు వర్గాలు ఏర్పర్చుకోవడంలో నిమగ్నమయ్యారు. స్వార్ధప్రయోజనాల కోసం పార్టీ భ‌విష్య‌త్తును విస్మ‌రిస్తున్నార‌నే వాద‌న ఉంది. చివ‌ర‌కు ప్రతిష్ఠాత్మకం అనుకున్న పొలిటిక‌ల్ అడ్వ‌జ‌రీ క‌మిటీ కూడా అలాగే తయారైంది. ఒకే సామాజికవర్గంకు చెందిన వ్యక్తులే అందులో అత్యధికంగా ఉన్నారు. పార్టీకి విస్తృత స్థాయిలో యువత ఉన్నా.. సోషల్ మీడియాలో వెంటనే స్పందించే జనసైనికులున్నా పార్టీ మాత్రం అయోమయంగానే ఉంది. ఎంతగా అంటే.. ఆ పార్టీ నాయకుడి యాత్ర వివరాలు కూడా మీడియాకు చెప్పే పరిస్థితి లేకపోవడం. ఏ రోజు యాత్ర ఎలా ...ఎక్కడివరకూ సాగుతుందనేది ఆ పార్టీలో ఉన్న నాయకులకే తెలియడం లేదు..ఇక మీడియాకు ఎలా తెలుస్తుందనేది అసలు వ్యవహారమన్న మాట...

యనమల ప్రాబల్యం అయిపోయిందా..

వరుస ఓటములు..మళ్లీ అదే పరిస్థితి..

                                                                                                         

బళ్లు ఓడలవుతాయో లేదో కానీ...ఓడలు మాత్రం బళ్లవుతాయి రాజకీయాల్లో. ఎక్కడైనా ఈ సామెత పూర్తిగా వర్తిస్తుందో లేదో తెలియదు గానీ రాజకీయాల్లో కచ్చితంగా అమలవుతుంటోంది. తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్ని 3 దశబ్దాలకు పైగా శాసించిన ఆ వ్యక్తికి ఇప్పుడు అక్కడ సీన్ క్లోజ్ అయిపోయిందా.. మళ్లీ సమీప భవిష్యత్ లో కూడా ఆ కుటుంబం ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవదా.. పరిస్థితులు చూస్తుంటే అలాగే అన్పిస్తోంది. ఇక ఆ వ్యక్తికి గానీ..కుటుంబానికి గానీ అక్కడ ఎదురీతే..

యనమల ప్రాబల్యం..

తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం పేరు చెబితే గుర్చొచ్చేది యనమల మాత్రమే. అంతగా ఆ నియోజకవర్గ రాజకీయాల్ని శాసించినవ్యక్తి. ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా 30 ఏళ్లకు పైబడి ఏకఛత్రాధిపత్యంగా పాలించారు. నియోజకవర్గ ఆవిర్భావంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ప్రాంతాన్ని..టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీకి కంచుకోటగా మార్చేసిన వ్యక్తి. ఎన్టీఆర్ చలవతో రాజకీయాల్లోకి వచ్చిన ఆ సామాన్యవ్యక్తి ఇప్పుడు అసామాన్యుడే. అయనా సరే..ఆ ఎన్టీఆర్ నే పదవీచ్యుతుడిని చేయడంలో బాబుకు రైట్ హ్యాంట్ కూడా ఇతనే. 1955 నుంచి 1978 వరకూ వరుసగా కాంగ్రెస్ పార్టీనే ఇక్కడి నుంచి విజయం సాధించింది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో పరిస్థితి మారింది. అప్పట్న్నించి వరుసగా ఆరుసార్లు డబుల్ హ్యాట్రిక్ విజయాన్ని కైవసం చేసుకున్న వ్యక్తి యనమల రామకృష్ణుడు. 2004లో వైఎస్ ప్రభంజనంలోనూ..1989లో టీడీపీ వ్యతిరేకతలో కూడా విజయం సాధించారంటే అతనికున్న పట్టు ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.

సీన్ క్లోజ్ అవుతుందా..

అయితే ఆ ప్రాబల్యానికి ఇప్పుడు గండ్లు పడుతున్నాయి. వరుసగా 2009 నుంచి రెండుసార్లు ఓటమి చూస్తున్నారు. 30 ఏళ్లకు పైబడి విజయం సాధించిన నియోజకవర్గంలో ఇప్పుడు పట్టు కోల్పోతున్నారు. యనమల హవా తగ్గిపోయిందిప్పుడు. మితిమీరిన అహంకారం..దౌర్జన్యాలు..చెప్పుచేతల్లో ఉంచుకోవాలనే తత్వం ఇప్పుడు ఆ నియోజకవర్గానికే దూరం చేస్తున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం..బళ్లు ఓడలవుతుంటాయి..ఓడలు బళ్లవుతుంటాయి. కానీ స్వయం కృతాపరాధం ఎక్కువైతే శాశ్వతంగ సమాధి కడతారు ప్రజలు. నెగ్గిన ఆరు దఫాల్లో...మూడుసార్లు భారీ విజయాన్ని..మూడు సార్లు స్వల్పమెజార్టీని సాధించినా సరే..పట్టు మాత్రం కోల్పోలేదు. 2009లో కాంగ్రెస్ అభ్యర్ధి రాజా అశోక్ బాబు చేతిలో తొలిసారిగా ఓటమి చవి చూశారు. ఆ ఎన్నికల్లో 9 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైన యనమలకు...అనంతరం 2014 ఎన్నికల్లో కూడా ఓటమి భయం వెంటాడినట్టుంది. అందుకే తన సోదరుడు కృష్ణుడిని రంగంలో దింపారు. తాను వెనుక నుంచి మొత్తం కధ నడిపించినా సరే...వైఎస్సార్ పార్టీ అభ్యర్ధి రాజకీయాల్లో తొలిసారి అడుగెడిన యువకుడైన దాడిశెట్టి రాజా చేతిలో 18 వేల ఓట్ల భారీ తేడాతో ఓటమిపాలయ్యారు. వరుస రెండు ఓటములతో యనమల హవా ఈ నియోజకవర్గంలో చాలావరకూ తగ్గింది.

మంత్రిగా పెత్తనం..

తమ్ముడి అరాచకాలు..

                                                                                    

ఎన్నికల్లో ఓడినా..టీడీపీలో కీలకవ్యక్తి కావడంతో ఆర్ధికమంత్రి అయ్యారు ఈసారి. మంత్రి పదవితో నియోజవర్గంపై పెత్తనం చలాయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. స్థానిక ఎమ్మెల్యేను ఏ విషయంలోనూ పట్టించుకోకుండా శాసిస్తున్నారు. ప్రోటోకాల్ ను కూడా ఫాలో అవకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇతని విషయం ఇలా ఉంటే.. సోదరుడు కృష్ణుడి అరాచకాలు..దౌర్జన్యాలపై నియోజకవర్గంలో ఆరోపణలు ఎక్కువైపోయాయి. అన్నయ్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెత్తనం చలాయించడం ప్రజల్లో ఆగ్రహానికి గురైంది. వాస్తవానికి గత ఎన్నికల్లో కృష్ణుడికి టికెట్ ఇవ్వడం వల్లనే పార్టీ ఓటమి పాలైందన్న విమర్శలు కూడా ఆ పార్టీలో విన్పిస్తున్నాయి. కృష్ణుడిపై పెద్ద ఎత్తున ఆరోపణలు..విమర్శలూ వస్తున్నా యనమల అతనికే ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ నాయకత్వం కూడా కృష్ణుడిని ప్రోత్సహిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినా సరే..అతనికి ఏఎంసీ చైర్మ‌న్ పదవి ఇవ్వడం సొంత పార్టీ శ్రేణుల్లో వ్య‌తిరేక‌త‌కు కార‌ణ‌మైంది. మొత్తం పదవులన్నీ ఆ కుటుంబానికేనా అన్న ప్రశ్నలు విన్పిస్తున్నాయి తుని టీడీపీలో..2019 ఎన్నికల్లో కూడా టీడీపీ టికెట్ మరోసారి కృష్ణుడికే టికెట్ ఇస్తున్నట్టు ఇప్పటికే దాదాపు ఖరారైంది. దాంతో ఈసారైనా గెలుస్తామన్న ఆ పార్టీ వర్గాలు ఆశ నిరాశైంది. కృష్ణుడికి కాకుండా అదే కుటుంబంలో మరెవరికైనా టికెట్ ఇచ్చినా బాగుండేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా కృష్ణుడికే టికెట్ దాదాపు ఖరారైన నేపధ్యంలో ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ పరాజయం కన్ ఫాం అని టీడీపీ శ్రేణులే అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ఇక యనమల కుటుంబానికి రాజకీయ సమాధి పడినట్టేనని విశ్లేషకుల అంచనా.

అధికారపార్టీకి మరో షాక్..

వ్యతిరేకమవుతున్న మాజీ అధికార్లు..

                                                                      

ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బే తగులుతోంది. ఇన్నాళ్లూ అధికార్ల అండతో రెచ్చిపోయిన ఆ పార్టీకి ఆ వర్గాల నుంచే షాక్ తగులుతోంది. ఉద్యమాన్ని అణచివేయడంలో గానీ..అవినీతిని ఇష్టారాజ్యంగా విస్తరించడంలో గానీ చంద్రబాబు ఉపయోగించుకున్నంతగా అధికారవ్యవస్థను ఎవరూ ఉపయోగించుకోరు. బాబు హయాంలో కీలకమైన స్థానంలో ఉన్న అధికార్లు ఇప్పుడు ఆయనకు షాక్ ఇస్తున్నారు. కొందరు ఆయనకు వ్యతిరేకంగా గళమెత్తుతుంటే.. మరి కొందరు ప్రతిపక్షనేత జగన్ ను కలుస్తున్నారు.

జగన్ ను కలిసిన మాజీ డీజీపీ..

విశాఖ జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న జగన్ కు అన్నీ సానుకూల పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ కంచుకోటలైన నర్శీపట్నం, పాయకరావుపేట, ఎలమంచిలి సభలకు పోటెత్తిన జనంతో పార్టీ ఉత్సాహంతో ఉండగా..మాజీ అధికార్లు జగన్ ను కలుస్తుండటం మరింత ఉత్సాహాన్నిస్తోంది. అనకాపల్లి సమీపంలోని రాంబిల్లి మండలంలో పాదయాత్ర సందర్భంగా ...వైఎస్ జగన్ ను మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు. నేరుగా జగన్ తో కాస్సేపు సమావేశమయ్యారు. త్వరలో ఆయన పార్టీలో చేరుతున్నట్టు సాంబశివరావు స్పష్టం చేయకపోయినా...ఎంపీ విజయసాయిరెడ్డి నిర్ధారించారు. మొన్నటి వరకూ ఏపీ డీజీపీగా..అంతకుముందు ఆర్టీసీ ఛైర్మన్ గా పని చేసిన ఆయనకు ఐపీఎస్ వర్గంలో మంచి పేరుంది. క్రమశిక్షణ కలిగిన అధికారిగా పేరు సంపాదించుకున్న సాంబశివరావు జగన్ ను కలవడం వైసీపీకు లాభించే పరిణామమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బాబుకు వ్యతిరేకమవుతోన్న అధికార్లు..

 

కీలకమైన మాజీ అధికార్ల నుంచి టీడీపీకు గట్టి దెబ్బే తగులుతోంది. ఇటు ఐఏఎస్ అటు ఐపీఎస్ కేడర్ లో మాజీలైన ఆ అధికార్లలో కొందరు బాబుకు వ్యతిరేకంగా గళమెత్తుతుంటే..మరి కొందరు వైసీపీలో చేరుతున్నారు. ఇప్పటికే ఇద్దరు మాజీ సీఎస్ లు చంద్రబాబుకు వ్యతిరేకంగా తీవ్రమైన విమర్శలు చేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు చంద్రాబాబుకు వ్యతిరేకంగా మారారు. బాబు అవినీతిపై..చాలా సందర్భాల్లో విరుచుకుపడ్డారు కూడా. మ‌రో మాజీ సీఎస్ అజ‌య్ క‌ల్లాం ది కూడా అదే పరిస్థితి. రాజధాని ప్రాంతంలో జరిగిన అవినీతిపై ఆయన ఆధారాలతో సహా పుస్తకమే రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాదయాత్రలో మరో మాజీ ఐపీఎస్ అధికారి మొహిద్దీన్ జగన్ ను కలిసి..పార్టీలో చేరారు. ఇప్పుడు విశాఖ జిల్లా పాదయాత్రలో మాజీ డీజీపీ సాంబశివరావు జగన్ ను కలవడం టీడీపీకు ఊహించని పరిణామమే. కాపు సామాజికవర్గానికి చెందిన ఈయన జగన్ ను కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి పార్టీలో చేరే విషయమై ఆయన ఏ ప్రకటనా చేయకపోయినా...త్వరలో పార్టీలో రానున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి నిర్ధారించడం విశేషం. వచ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న బ‌రిలో దిగే అవ‌కాశాలున్నాయ‌నే ప్ర‌చారం ఊపందుకుంది ఇప్పుడు. ముఖ్యంగా ప్ర‌కాశం జిల్లాకు చెందిన సాంబ‌శివ‌రావుకి ఆ జిల్లాలో అసెంబ్లీ సీటుగానీ...లేదా ఆ సామాజికవర్గ ఓట్లు అధికంగా ఉన్న కాకినాడ ఎంపీ సీటు గానీ కేటాయించే అవ‌కాశాలున్నట్టు విశ్లేషణలు ఊపందుకుంటున్నాయి.

మాజీల రాక జగన్ కు కలిసొచ్చే అంశమే..

ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి మాజీ అధికార్లు జగన్ ను కలవడం గానీ..పార్టీలో చేరడం కానీ కచ్చితంగా జగన్ కు రాజకీయంగా కలిసొచ్చే అంశమే. ఎందుకంటే జగన్ పై ఉన్న కేసులకు సంబంధించి ఎల్లో మీడియా గానీ..టీడీపీ గానీ చాలాకాలంగా తీవ్రమైన వ్యాఖ్యల్ని చేసుకుంటూవస్తోంది. జగన్ ను నమ్ముకుంటే అధికార్లు జైలు పాలవుతారంటూ టీడీపీ వర్గాలు ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారాన్ని చేస్తున్నాయి. మాజీ అధికార్లు జగన్ ను కలవడం వల్ల...టీడీపీ అండ్ ఎల్లో మీడియా చేస్తున్న ఈ విష ప్రచారానికి చెక్ పెట్టవచ్చని విశ్లేషకుల అంచనా. ఓవైపు ఈ విష ప్రచారానికి తెరపడటమే కాకుండా..బాబు హయాంలో జరిగిన దౌర్జన్యాలు..అవినీతి మరింత వివరంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు ఇప్పుడు వైసీపీకుంటాయి. ముఖ్యంగా కాపు ఉద్యమ సమయంలో ప్రభుత్వ అణచివేత ధోరణి, తుని రైలు దహనం కేసులో అధికారపార్టీ నేతల ప్రమేయంపై ఉన్న ఆరోపణలు అన్నీ ఇప్పుడు వాటంతటవే బయకు వస్తాయని తెలుస్తోంది.

శ్రీనివాస్ వర్సెస్ శ్రీనివాస్..

విశాఖ రాజకీయంలో ఎవరెటు..

                                                                         

విశాఖ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఊహించని పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. మొన్నటివరకూ ఒకేవర్గంగా ఉన్న ఆ ఇద్దరూ ఇప్పుడూ వైరివర్గంగా మారారు. ఒకేపార్టీలో ఉంటూనే కత్తులు దూసుకుంటున్నారు. ఇరువురు శ్రీనివాస్ ల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరు విశాఖలో ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఈ ఆధిపత్యపోరు..ఎవరో ఒకరిని పార్టీని మారేలా చేస్తుందా అంటే అవుననే విన్పిస్తోంది.

ఒకరు మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే...మరొకరు ఎంపీ అవంతి శ్రీనివాస్. ఇద్దరూ కాపు సామాజికవర్గమే. ఇద్దరూ విశాఖ జిల్లాకు వలసనేతలే. ఒకరు నెల్లూరు నుంచి వలసొస్తే..మరొకరు కృష్ణా నుంచి చేరుకున్నారు. మొన్నటివరకూ గంటా శ్రీనివాస్ రావు వర్గంగా ఉన్న అవంతి ఇప్పుడు పాతుకుపోయారు. తనకంటూ వర్గం ఏర్పర్చుకుని గంటాకు ఎదురేగుతున్నారు. ఆయన సీటుకే ఎసరు పెడుతున్నారు. ఇదే ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో ఊహించని పరిణామంగా మారి..హాట్ టాపిక్ అవుతోంది. ఇద్దరి ఆధిపత్యపోరులో ఎవరు పై చేయి సాధిస్తారో తెలియకపోయినా..కచ్చితంగా ఒకరు పార్టీ మారేలా పరిస్థితులు మారుతున్నాయి.

గంటా శ్రీనివాస్ రావు..

                                                                               

1999లో అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గంటా శ్రీనివాసరావు పార్టీలు మారుతూ తన ప్రస్థానాన్ని ప్రాబల్యాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. 2004లో చోడవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి..అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. అనంతరం పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం నేపధ్యంలో మంత్రి పదవి సాధించారు. 2014లో తిరిగి టీడీపీలో చేరిపోయిన ఆయన ఈసారి భీమిలి నుంచి నెగ్గి రెండోసారి మంత్రి పదవి సాధించారు. ముచ్చటగా మూడు పార్టీలు మారినా సరే..తన రాజకీయ ప్రాబల్యాన్ని మాత్రం ఎక్కడా తగ్గించుకోకుండా నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఆయనకు పరిస్థితి వ్యతిరేకంగా మారుతోంది. అతని అనుచరుడిగా ఉన్న అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్..ఇప్పుడు ఎదురు తిరిగారు. అది కూడా సీటు విషయంలో. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న భీమిలి నియోజకవర్గంపై కన్నేసారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచే పోటీ చేయాలన్న అవంతి ఆలోచన..ఇద్దరినీ ప్రత్యర్ధుల్లా మార్చేసింది. ఈ ఇద్దరి మద్య నెలకొన్న వైరాన్ని పరిష్కరించడానికి చంద్రబాబు సమక్షంలో రాజీయత్నాలు జరిగినా ఫలితం లేకపోయింది. విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సైతం ఇద్దరినీ రాజీ కుదర్చడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇదే సమయంలో భీమిలి కేంద్రంగా జరిగిన భూ కబ్జాల్లో ప్రమేయం కారణంగా..గంటా భీమిలి నుంచి గెలిచే అవకాశాలు లేవంటూ సొంత పత్రిక ఆంధ్రజ్యోతి కధనం ఇంకా సంచలనమైంది. ఇదంతా తనకు వ్యతిరేకంగా కావాలనే రాయించారన్నది గంటా ఆలోచన. అప్పట్నించీ వ్యూహాలకు మరింత పదును పెడుతూనే.. టీడీపీ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఓ దశలో పార్టీని వీడిపోయారన్న వార్తలు షికారు చేసినా..టీడీపీ వర్గాలు నచ్చజెప్పాయి. ఇప్పుడు కూడా తనకంటూ సొంతంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తప్పిస్తే..పార్టీ సమావేశాల్లో హాజరుకావడం లేదు. తాజాగా పదిహేను రోజుల క్రితం జరిగిన జిల్లా సమన్వయ సమావేశానికి కూడా దూరంగా ఉండటంతో టీడీపీలోనే ఆగ్రహం వ్యక్తమైంది. మంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్పలు బాహాటంగానే గంటా వైఖరిని విమర్శించిన పరిస్థితి ఎదురైంది. అందుకే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ దిశగా అధినేత జగన్ తో సంప్రదింపులు జరిగాయట. తనతో పాటు మరో ఇద్దరు ముగ్గురికి స్థానం కల్పించాలని గంటా చేసిన ప్రతిపాదన విషయంలో వైసీపీ చేరిక ఆగినట్టు తెలుస్తోంది. గంటా ఒక్కరికే స్థానం కల్పిస్తామని వైసీపీ అధినేత స్పష్టం చేసినట్టు పక్కా సమాచారం. ఈ విషయంలో స్పష్టత వస్తే..విశాఖ రాజకీయాలు శరవేగంగా మారిపోనున్నాయి. వైసీపీలో మారాలన్న ఆలోచన..ఒత్తిడి మంత్రి గంటా సతీమణి నుంచి ఎక్కువగానే ఉన్నట్టు అతని సన్నిహితవర్గాలంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ భీమిలి నియోజకవర్గం చేజారిపోకుండా ఉండటమే కాకుండా..తనకే ఎదురు తిరిగిన అవంతి రాజకీయ జీ్వితానికి చెక్ పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకోవాలన్నది ఆయన ఆలోచన. జనసేన టికెట్ ను కూడా గంటా ఆశించినా అక్కడ సానుకూలం లేదని..పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించడం లేదని పరిస్థితులు ఇప్పటికే స్పష్టం చేశాయి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ప్రధాన కారణం గంటా అని పవన్ నమ్మడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

అవంతి శ్రీనివాస్..

                                                                                                             

ఇక 2009 ఎన్నికల్లో భీమిలి నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ఆరంభించిన అవంతి శ్రీనివాస్..2014లో మాత్రం టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో అనకపాల్లి ఎంపీకు మారాల్సివచ్చింది. దాంతో వచ్చే ఎన్నికల్లో తిరిగి తన సొంత నియోజకవర్గానికి వెళ్లాలన్న పట్టుదలతో.. తన గురువైన గంటాకే ఎదురు తిరిగారు. పార్టీ అధినేత చంద్రబాబు కూడా భీమిలి సీటు విషయంలో అవంతికే మొగ్గుచూపుతున్నట్టు అర్ధమవుతోంది. ఒకవేళ మంత్రి గంటా..తన వియ్యంకుడైన మంత్రి నారాయణ ఒత్తిడితో అడ్డు తగిలిన పక్షంలో పార్టీ మారేందుకు కూడా దాదాపు సిద్ధమైపోయారు. ఇతని ముందు రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. ఒకటి సొంత సామాజికవర్గ నేపధ్యంతో ఉన్న జనసేన. రెండోది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తనకు భీమిలి సీటు దక్కకపోతే.. ఈ రెండు పార్టీల్లో ఓ పార్టీలో మారిపోనున్నానన్న సంకేతాల్న్ని ఇప్పటికే అనుచరులతో పార్టీ అధిష్టానానికి పంపేశారు అవంతి శ్రీనివాస్. భీమిలి సీటు గంటాకు లభిస్తే మాత్రం కచ్చితంగా అవంతి శ్రీనివాస్..పార్టీ మారి ఇదే సీటు నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ వైసీపీనా..లేదా జనసేనా అన్నది ఇంకా తేలకపోయినా.. జనసేనవైపే మొగ్గు చూపడానికి అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఎందుకంటే తన రాజకీయజీవితానికి పునాది వేసింది ప్రజారాజ్యం పార్టీనే కాబట్టి.. జనసేనలో వెళ్లితే పరిస్థితులు సానుకూలంగా ఉంటాయన్నది ఆయన ఆలోచన. ఇటు ఆ నియోజకవర్గంలో ఉన్న గంటా అనుచరులు కూడా తనవైపుకు రావచ్చేనేది మరో వ్యూహంగా తెలుస్తోంది. గంటాకు బ్రేక్ పడాలన్నా..తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలన్నా..భీమిలి నుంచి పోటీ చేయడమే పరిష్కారమని అవంతి గట్టిగా నమ్ముతున్నారు.

సో..కారణాలేవైనప్పటికీ భీమిలి సీటు సమస్య ఇద్దరిలో ఒకరిని పార్టీ వీడేలా చేస్తోందన్నది మాత్రం కన్ ఫార్మ్. ఎన్నికల్లో ఎవరు పైచేయి సాధిస్తారు..ప్రాబల్యం కలిగిన కాపు సామాజికవర్గం ఎవరివైపు నిలుస్తుందనేది వేచి చూడాల్సిందే.

పవన్ టార్గెట్ జగనేనా..

లింగమనేని ములాఖత్ లో అదే జరిగిందా..

                                                                           

ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పోటీలో ఉన్న మూడు ప్రాంతీయ పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్ర్రాలు సంధించుకోవడం సర్వ సాధారణం. త్రికోణపోటీ ఉన్నప్పుడు ప్రధానంగా అధికార పార్టీపైనే మిగిలిన రెండు పార్టీలు విరుచుకుపడుతుంటాయి. ఎందుకంటే ప్రభుత్వ వ్వతిరేక ఓటును ఎవరు చీల్చుకోగలిగితే వారికి లాభం చేకూరుతుందన్నది అందరికీ తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అధికార పార్టీతో పాటు మరో పార్టీ జనసేన కూడా ప్రధాన ప్రతిపక్షం జగన్ ను టార్గెట్ చేశాయి.

అధికారం లక్ష్యం కాదంటూ ప్రచారానికి తెరలేపిన పవన్ కళ్యాణ్ నెమ్మదిగా ఆలోచన మార్చుకున్నారు. అదికారమే పరమావధిగా మందుకు వెళుతున్నారు. టీడీపీతో బంధానికి బ్రేక్ పడిన తరువాత ఎన్నికలపై దృష్టి పెట్టకపోయినా పార్టీ నిర్మాణం కోసం సభలు సమావేశాలు ప్రారంభించారు. దాదాపు రెండు నెలల క్రితం వరకూ తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో ఇరుకునపెట్టే ప్రయత్నంలో భాగంగా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. లోకేష్ అవినీతిపై తనకు పూర్తి సమాచారముందని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలంతా ఎక్కడికక్కడ అవినీతిలో కూరుకుపోయారని..చంద్రబాబు, లోకేష్ ల అవినీతి తారాస్థాయికి చేరుకుందంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఈ పరిణామంతో ఉలిక్కిపడిన టీడీపీ..కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. అదే సమయంలో ఈ ఇద్దరి పరస్పర ఆరోపణలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లబ్ది పొందుతుందన్న ఆలోచన కలిగింది ఆ రెండు పార్టీల్లోని కొందరికి.

లింగమనేనిలో ఏం జరిగింది..                                                                              

అందుకే రహస్య మంతనాలు సాగాయి. రెండు నెలల క్రితం లింగమనేని రమేశ్ కు చెందిన ఓ ఆలయం శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రాబాబు, పవన్ కళ్యాణ్ లు ఇద్దరూ చేరుకున్నారు. ఇద్దరికీ ఓ గదిలో...లింగమనేని రహస్య ఏకాంత సమావేశం ఏర్పాటు చేశారు. అప్పట్నించి పవన్ వైఖరి మారింది. టీడీపీతో పాటు.. జగన్ ను టార్గెట్ చేయడం ప్రారంభించారు. జగన్ అసెంబ్లీని వదిలి పారిపోయారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారు. అన్ని స్థానాల్లో పోటీ చేయ‌బోతున్న‌ట్టు ఆపార్టీ ప్ర‌క‌టించడమే కాకుండా.. అధికారంలోకి వ‌స్తామ‌ని ధీమా కూడా వ్య‌క్తం చేశారు. ఇందులో భాగంగానే...రాజ‌కీయ ల‌క్ష్య సాధన‌తో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్ని టార్గెట్ చేసింది జనసేన. జగన్ దృష్టి పెట్టిన ఉభయగోదావరి జిల్లాలపైనే జనసేనాని పవన్ కూడా ఫోకస్ పెట్టారు. సామాజికవర్గం కూడా అధికంగా ఉన్నది ఈ రెండు జిల్లాల్లోనే కావడంతో జగన్ ను నిలువరించడానికి ఇదే సరైన మార్గంగా ఎంచుకున్నారు. కాపులకు రిజర్వేషన్ల అంశంపై జగన్ చేసిన వ్యాఖ్యల్ని అనుకూలంగా మల్చుకోడానికి ప్రయత్నించారు. వాస్తవానికి రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పిన పవన్. జగన్ ను ఇరుకున పెట్టడం కోసం మాట మార్చేశారు. కాపు రిజర్వేషన్లను 9 వ షెడ్యూల్ లో చేరుస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని టార్గెట్ చేశారు. ఆ పార్టీ నేతల్ని లాక్కోవడం ద్వారా...కేడర్ ను నిస్తేజపర్చాలన్నది పవన్ వ్యూహం. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కే అవకాశాలు లేనివారని ముందుగా లక్ష్యం చేసుకుంది పార్టీ. కాకినాడకు చెందిన ముత్తా గోపాలకృష్ణ. ముత్తా శశిధర్ లను పార్టీలోకి తీసుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ ను ఆహ్వానించింది. మరోవైపు ముమ్మిడివరం వైసీపీ టికెట్ ఆశించిన పితాని బాలకృష్ణపై దృష్టి పెట్టింది. మండల స్థాయి నేతలు మరికొందర్ని ఇప్పటికే పార్టీలోకి తీసుకున్నారు పవన్ కళ్యాణ్. అన్నింటికంటే ముఖ్యంగా గత ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన తోట చంద్రశేఖర్ ఇప్పుడు జనసేనలో నెంబర్ టూ స్థానంలో ఉన్నారు. ఇలా...వైసీపీ నేత‌ల‌ను పార్టీలోకి చేర్చుకోవ‌డం ద్వారా ఆ పార్టీని బలహీన పర్చాలన్న ల‌క్ష్యంతో జ‌న‌సేన ముందుకు వెళ్తోంది. రెండు నెలల క్రితం లింగమనేని ఏర్పాటు చేసిన ములాఖత్ లోనే ఈ వ్యూహాలు సిద్ధమైనట్టు పక్కా సమాచారం. గత ఎన్నికల్లో నేరుగా టీడీపీకు మద్దతివ్వడం ద్వారా...ఆ పార్టీ అధికారంలో రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పరోక్షంగా సహకరిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈసారి ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో నేరుగా ఎన్నికల బరిలో దిగి..వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా టీడీపీకు లబ్ది చేకూర్చాలన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే టీడీపీపై విమర్శనాస్త్ర్రాలు సంధిస్తూ బరిలో దిగిన పవన్..నెమ్మదిగా జగన్ ను టార్గెట్ చేశారు. వైసీపీ నేతల్ని సాధ్యమైనంత ఎక్కవ సంఖ్యలో తమ పార్టీలో లాక్కోవడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒకవేళ టీడీపీతో రహస్య లాలూచీ వ్యవహారం లేకపోతే..చంద్రబాబు, లోకేష్ ల అవినీతిపై తనవద్ద ఆధారాలున్నాయని చెప్పిన పవన్ కళ్యాణ్ వాటిని ఎందుకు బయటపెట్టలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అధికారం లక్ష్యం అని ప్రకటించినప్పుడు బాబు, లోకేష్ ల అవినీతిపై తన వద్ద ఉన్న ఆధారాల్ని బయటపెట్టి..లబ్ది పొందవచ్చుకదా అనేది ప్రధాన ప్రశ్న. తనవద్దనున్న అవకాశాల్ని ఎందుకు కాదనుకుంటున్నారు.. వైసీపీ నేతల్ని టార్గెట్ చేసినట్టు టీడీపీ నేతల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకోలేదు.. ఈ ప్రశ్నలకు సమాధానాన్ని జనసేన ఇవ్వకపోయినా.. ప్రజలకు మాత్రం జవాబు స్పష్టంగా తెలుస్తోంది.

Google Ad

Subscribe