October 21, 2018
info@rajakeeyaalu.com

చదివిన వారి సంఖ్య

 

Breaking News

|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|

రాజకీయాలు

వ‌ర్మ సినిమాలో బాబే అస‌లు విల‌న్‌..... !

వ‌ర్మ సినిమాలో బాబే అస‌లు విల‌న్‌..... !

Oct 20 2018 287 రాజకీయాలు Rajakeeyaalu

నిజాల‌ను స‌మాధి చేసి , అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేసుకుంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్న చంద్ర‌బాబుకు రానున్న రోజుల్లో పెద్ద జ‌ల‌క్ త‌గ‌ల‌నుంది. త‌న భ‌జ‌న మీడియాతో పాటు త‌న గురించి ప్ర‌చారం చేసుకోవ‌టానికి ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి బాలకృష్ణ 'ఎన్‌టిఆర్‌ కథానాయకుడు పేరుతో...

1500 రోజులు - 15 కుట్రలు, వైఫల్యాలు, మోసాలు  

Written by  Jul 16, 2018
  • 443 Views

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటితో 1500 రోజుల పాలన పూర్తిచేశారు. ఈ సందర్భంగా అయన గత నాలుగైదు రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు ఏకంగా ప్రకటనలు విడుదల చేసి "గ్రామ దర్శిని" పేరుతో సరికొత్త ప్రచార కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ సాకుతో పచ్చ మీడియాకు భారీగా ప్రకటనల పేరుతో నజరానా చెల్లించుకున్నారు. ఈ రోజునుండి 100 రోజుల పాటు చంద్రబాబు అయన తమ్ముళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు.

ఈ వంద రోజులపాటు గత 1500ల రోజులుగా తాను సాధించిన ఘనవిజయాలు ప్రజలకు చెప్పబోతున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముతో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ప్రచారం నిర్వహించబోతున్నారన్నమాట. కానీ వాస్తవానికి నిర్మొహమాటంగా విశ్లేషణ చేయవలసి వస్తే ఈ పదిహేనువందల రోజుల్లో అయన చేసిన తప్పిదాలు, అయన పాలనా వైఫల్యాలు, అయన పాలనలోని అసమర్ధత, అవినీతి స్పష్టంగా కనిపిస్తుంది.

ఇక్కడ మచ్చుకు 15 అంశాలను ప్రస్తావించి పరిశీలన చేద్దాం.

1. ఎన్నికల వాగ్దానాలు

చంద్రబాబు నాయుడి 2014 ఎన్నికల ప్రచారం మొత్తం రుణ మాఫీ వాగ్దానంపైనే నడిచింది. రైతులకు, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు పూర్తిగా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ప్రతిపక్ష పార్టీలు రుణమాఫీ సాధ్యం కాదని చెప్పినా అయన వినలేదు. రుణమాఫీ సాధ్యమేనని, తాను అమలుచేసి చూపిస్తానని ఎన్నికల సంఘానికి లిఖిత పూర్వకంగా ఇచ్చారు. కానీ వాస్తవానికి అయన ఎం చేశారు. రుణమాఫీ పూర్తిగా చేశారా? అధికారంలోకి వచ్చాక స్కెల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో లక్షన్నర వరకూ మాత్రమే రుణమాఫీ చేస్తానని, అదికూడా నాలుగైదు వాయిదాల్లో చేస్తానని చెప్పారు. ఇప్పటికి మూడు వాయిదాలే చెల్లింపులు జరిగాయి. ఇంకా చివరి విడత చెల్లింపు జరగవలసి ఉంది. ఇక డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చెల్లించకపోగా ఒక్కొక్క పొదుపు సంఘానికి మూడువేల నుండి ఐదువేలవరకు బ్యాంకు ఖాతాల్లో హామీగా జమచేసి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. చేనేత కార్మికులను అయన పూర్తిగా మర్చిపోయారు. వారికీ ఒక్కరూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. ఈ ప్రశ్న ఆంధ్ర ప్రదేశ్ లోని పచ్చమీడియా అడగడు, అడిగిన వారికి చంద్రబాబు సూటిగా జవాబు చెప్పరు.

బెల్టు షాపుల రద్దు

అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున రాష్ట్రంలో విచ్చలవిడి మద్యం అమ్మకాలు నిరోధిస్తానని, బెల్టు షాపులు రద్దు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే వాస్తవానికి ఇంతవరకూ ఒక్క బెల్టు షాపు కూడా రద్దు చేయలేదు. పైగా ఎక్సయిజ్ అధికారులకు వసూళ్ళ టార్గెట్ పెట్టి మద్యం విక్రయాలు మరింత పెంచేశారు. నగరాల్లో లిక్కర్ మాల్స్ ప్రారంభించారు. సాధారణ మాల్స్ లో కూడా ఐస్క్రీమ్ పార్లర్లూ, కూల్ డ్రింక్ పార్లర్లలాగే లిక్కర్ పార్లర్లు ఏర్పాటు చేయించేశారు. ఏకంగా మంత్రితోటే బీర్ హెల్త్ డ్రింక్ అని చెప్పించేశారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఏకంగా పనికి ఆహారం పధకంలో పనులు జరిగే చోటుకే మద్యం సీసాలు సరఫరా అయ్యే ఏర్పాటు చేశారు. పనికి ఆహారం వేతనాలు చెల్లింపులూ అక్కడే, మద్యం విక్రయాలు అక్కడే జరిగే ఏర్పాట్లు తెలుగు తమ్ముళ్ళు చేస్తుంటే మౌనంగా చూస్తూ ఉండిపోయారు.

ఇంటికో ఉద్యోగం - నిరుద్యోగ భృతి

ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు. ఉద్యోగం కల్పించలేకపోతే నిరుద్యోగభృతి ఇస్తానని చెప్పారు. నాలుగేళ్ళు పూర్తయింది. తన పాలన మొదలై 1500 రోజులు గడిచింది. రాష్ట్రంలో చంద్రబాబు ఇంట్లో అయన కొడుకు లోకేష్ కు తప్ప రాష్ట్రంలో ఏ ఇంట్లోనూ ఉద్యోగం రాలేదు. అనంతపురంలోని కియా మోటార్ సంస్థలో చెప్పే ఉద్యోగాలు కూడా చాలా తక్కువ. ఇక నిరుద్యోగ భృతి ఇంతవరకు మొదలు కాలేదు. ఈ మధ్యనే నెలకు వెయ్యి రూపాయలు చెల్లిస్తామని ప్రకటించారు. ఇదికూడా ఎన్నికల సమయంలో తెలుగుదేశం కార్యకర్తలకు పనికివచ్చే కార్యక్రమమే తప్ప మరొకటి కాదు.

2. విదేశీ యాత్రలు - పెట్టుబడుల ఒప్పందాలు

ప్రచారానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు నాయుడు ఈ 1500 రోజుల్లో లెక్కలేనన్ని విదేశీ యాత్రలు చేసి రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టేశారు. పెట్టుబడుల ఆకర్షణ పేరుతొ చంద్రబాబు సందర్శించని దేశం లేదంటే ఆశ్చర్యం లేదు. తనతోపాటు ప్రతిసారి కనీసం రెండు డజన్ల మంది మంత్రులు అధికారులతో అయన షికార్లు చేశారు. విదేశీ యాత్రలు చాలక అయన విశాఖపట్నంలో మూడు పెట్టుబడి సదస్సులు ఆర్భాటంగా నిర్వహించారు. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రము అనే ఆలోచనే లేకుండా పారిశ్రామిక వేత్తలకు విందులూ, వినోదాలు నిర్వహించారు. టన్నులకొద్దీ కాగితాలపై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్నారు. వాటిలో వచ్చిన పెట్టుబడులేంటో రాష్ట్రంలో ఎవర్ని అడిగినా చెపుతారు. ఇది చాలదన్నట్టు ఈ 1500 రోజుల్లో ప్రతి పర్యటన ప్రత్యేక విమానంలోనే చేశారు. ప్రత్యేక విమానాల ఖర్చే తడిసి మోపెడైందని ఆర్ధిక శాఖ అధికారులు చెపుతున్నారు.


3. కాల్ మనీ కుంభకోణం - మహిళా రక్షణ

రాష్ట్రాన్ని కుదిపేసిన సంఘటన కాల్ మనీ కుంభకోణం. ఇది విజయవాడలో జరిగిన దారుణం. కొందరు అధికార పార్టీ నేతలు ప్రజలకు డబ్బు వడ్డీలకు ఇచ్చి మహిళలను బ్లాక్ మెయిల్ చేసి వ్యభిచారం చేయించిన సంఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో నిందితుల్ని అరెస్టు చేయించవలసిన ప్రభుత్వం తన పార్టీ నేతలను కాపాడుకునేందుకు కేసును వడ్డీ వ్యాపారంపైకి మార్చి రాష్ట్రము అంతటా వడ్డీ వ్యాపారులపై దాడులు చేయించి కేసును నీరుగార్చారు. వడ్డీ వ్యాపారం పేరుతో వ్యభిచారం చేయించారని, లేదా మహిళలను మోసం చేశారనే ఆరోపణలపై చర్యలు తీసుకోకపోగా పూర్తిగా ఆ కేసునే పక్కదారి పట్టించి అధికారపార్టీ నేతలను కాపాడుకున్నారు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది. విద్యార్థినులు, మహిళలపై భౌతిక, లైంగిక దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయి. చంద్రబాబుకి రాష్ట్ర పొలిసు శాఖపై పట్టుతప్పిందో లేక మహిళల రక్షణ పట్టలేదో కానీ దాడులు పెరుగుతున్నాయి., విచ్చలవిడి మద్యం అమ్మకాల వల్ల రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది.

4. అధికారులపై దాడులు

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కరువైంది. తెలుగు దేశం నేతలు, కార్యకర్తలు అధికారులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. గ్రామ స్థాయిలో అధికార పార్టీ కార్యకర్తలు చెప్పిందే శాసనంగా జరిగిపోతోంది. జన్మ భూమి కమిటీల రూపంలో తెలుగు తమ్ముళ్లు అధికారులను ఉత్సవ విగ్రహాలుగా తయారు చేసేశారు. రాష్ట్ర స్థాయిలో అధికారులు కేవలం సంతకాలకే పరిమితం అయ్యారు. కాదన్నవారిపై దాడులు జరిగాయి. ఇందులో చింతమనేని ప్రభాకర్ అధికారులు, ప్రజలపై చేసే దాడులకు అడ్డుకట్ట వేయలేకపోయారు చంద్రబాబు.

5. స్థానిక సంస్థల ఎన్నికలు

రాష్ట్రంలో 2014లో కొన్ని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, మరికొన్ని మేజర్ పంచాయితీలకు అనేక కారణాలవల్ల ఎన్నికలు జరగలేదు. వార్డుల రిజర్వేషన్లు, పట్టణాల విస్తరణ వంటి అంశాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ వంటి పెద్ద నగరాల్లో కూడా ఎన్నికలు జరగలేదు. అక్కడ అధికారులనే స్పెషల్ ఆఫీసర్లుగా నియమించి చంద్రబాబు కాలం గడిపేస్తున్నారు. చివరికి ఒక్క కాకినాడ నగరపాలక సంస్థకు మాత్రమే గత యేడాది కోర్టు మందలించడంతో ఎన్నికలు జరిపారు. మిగతావన్నీ అలా వదిలేశారు. చివరికి వచ్చే మే నాటికి స్థానిక సంస్థల పదవీకాలం పూర్తవుతున్నా ఎన్నికలు జరిపించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టలేదు. తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నా చంద్రబాబు మాత్రం అచేతనంగా ఉండిపోయారు.

6. అమరావతి

రాష్ట్ర రాజధాని అమరావతి నగరం విషయంలో చంద్రబాబు పూర్తి వైఫల్యం కనిపిస్తోంది. రైతులు 33 వేల ఎకరాల భూమి ఇచ్చి మూడేళ్ళు అవుతున్నా ఇంతవరకూ కనీసం నగర ప్రణాళిక కానీ, ప్రభుత్వ భవనాల ఆకృతులు కానీ సిద్ధం కాలేదు. ప్రపంచంలో అత్యంత గొప్ప ఆర్కిటెక్చర్ సంస్థకు బాధ్యతలు అప్పగించినా ఇంతవరకు భవనాల నమూనాలు సిద్ధం కాలేదంటేనే చంద్రబాబు సమర్ధత ఏంటో తెలిసిపోతుంది. నార్మన్ పోస్టర్ కంటే బాహుబలి చిత్ర దర్శకుడు రాజమౌళి మంచి ఆర్కిటెక్ అని చంద్రబాబు భ్రమించడం వల్లే భవనాల ప్రణాళిక కూడా ఆలస్యం అవుతోంది. ఏది కావాలో, ఏది కూడదో తేల్చుకోలేని అయోమయంలో అయన ఉన్నారు. ఇంతకూ అమరావతిలో సంపూర్ణంగా జరిగిన పని ఏదైనా ఉందంటే అది సింగపూర్ సంస్థలకు 1691 ఎకరాలు కట్టబెట్టడం. ఈ ఒక్కపని మాత్రం చంద్రబాబు పూర్తి చేశారు.

7. పోలవరం

రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అయింది. అంతకు ముందు కూడా ఈ ప్రాజెక్టుకు అంతే ప్రాధాన్యత ఉంది. అయితే తెలంగాణలోని కొంత ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండడం వల్ల అప్పట్లో తెలంగాణ ఓట్లకోసం పాలకులు ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. అయితే విభజన సమయంలో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పూర్తి నిధులు కేంద్రమే భరించే ఏర్పాటు చట్టంలో ఉండడంతో చంద్రబాబు ద్రుష్టి ఈ ప్రాజెక్టుపై పడింది. గతంలో ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు కేంద్ర నిధుల కారణంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఏకంగా ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రం నుండి చేజిక్కించుకున్నారు. అంచనాలు భారీగా పెంచేశారు. ప్రాజెక్టులోని సివిల్, ఇంజనీరింగ్ పనుల అంచనాలతో పాటు భూసేకరణ, పునరావాసం వంటి కార్యక్రమాల అంచనాలు వేలకోట్లకు పెంచేశారు. కేంద్రం ఇందులు ఇస్తున్నా మొత్తం ప్రాజెక్టు తనవల్లే పూర్తవుతోందనే భ్రమ ప్రజల్లో కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం ఒక్కటే కాదు రాష్ట్రంలో దాదాపు 30 నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలోనూ చంద్రబాబు ఇదే పద్దతి అమలుచేస్తున్నారు. ప్రాజెక్టు అంచనాలు పెంచి భారీగా తనవారికి దోచిపెడుతూ తనవాటా తాను తీసుకుంటున్నారు.

8. జిల్లాకు ఒక విమానాశ్రయం

అధికారం చేపట్టిన తొలి రోజునుండి చంద్రబాబు చేసే వాగ్దానం పారిశ్రామికాభివృద్ధి. జిల్లాకో పరిశ్రమ, ఒక విమానాశ్రయం నిర్మిస్తానని చంద్రబాబు అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చారు. అయన పాలన 1500 రోజులు పూర్తయినా ఒక్క విమానాశ్రయం కూడా పూర్తికాలేదు. చివరికి గన్నవరం విమానాశ్రయం విస్తరణ కూడా పూర్తికాలేదు. ఇదీ ఈ 1500 రోజుల్లో చంద్రబాబు సాధించిన విజయం.

9. ఓటుకు నోటు

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే ఓటు కొనే ప్రయత్నం చేసిన చంద్రబాబు దేశంలో రాష్ట్ర ప్రజల పరువు తీసేశారు. ఐదుకోట్లకు బేరం ఆడి 50 లక్షలు లంచం ఇస్తూ చంద్రబాబు అనుచరుడు రేవంత్ రెడ్డి దొరికిపోయారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు సదరు ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడిన సంభాషణ కూడా రికార్డు అయింది. ఈ కేసు దెబ్బతో పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పై అధికారం వదులుకోని అర్ధరాత్రి విజయవాడకు పారిపోయి వచ్చారు. హైదరాబాద్ లో ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పెడతా అంటూ ప్రగల్భాలు పలికి చివరికి హైద్రాబాద్ వదిలేసి వచ్చారు.

10. పుష్కరాలు

చంద్రబాబు హయాంలో గోదావరి, కృష్ణా నదులకు పుష్కరాలు వచ్చాయి. గోదావరి పుష్కరాల్లో ప్రచార ఆర్భాటం కోసం, డాక్యుమెంటరీ తీసుకునే ప్రయత్నంలో భాగంగా అయన చేసిన నిర్వాకం 30మంది ప్రాణాలు బలిగొంది. సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుని పక్కన పెట్టుకొని చంద్రబాబు గోదావరి నది వడ్డున సాధారణ ప్రజలు స్నానాలు చేసే ఘాట్ లో సినిమా తీసే ప్రయత్నంలో జరిగిన ఈ ఘటనను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. తనవల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిసినా నిస్సిగ్గుగా చంద్రబాబు ఈ అంశాన్ని ప్రజల్లో క్రమశిక్షణ లేకపోవటం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అంటూ ప్రజలపైకే నెపం నెట్టేశారు, ఈ పుష్కారాల మరణాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. రాష్ట్రంలో విజయవాడలో కృష్ణా నదిలో, ఇతరచోట్ల గోదావరి నదిలో పడవలు మునిగిపోయి పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. ఈ మారణహోమం ఆగేపరిస్థితి కనిపించడం లేదు.

11. ప్రత్యేక హోదా

 

రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది కీలకమైన అంశంగా మారింది. హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, తద్వారా ఉపాధి సౌకర్యాలు పెరుగుతాయని ప్రజలు ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే ఈ హామీని గాలికి వదిలేసి హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజి ప్రకటించారు. ప్యాకేజీని చంద్రబాబు ఆహ్వానించారు. శాసనసభలో ప్యాకేజి ఇచ్చినందుకు బీజేపీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం కూడా చేశారు. ఇది చాలదన్నట్టు ఏకంగా ఢిల్లీ వెళ్ళి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి ఘాన సత్కారం చేశారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా అని ఎవరు నినదించినా అయన విమర్శించారు. కేసులు పెట్టించారు. విద్యార్థులను, వారితల్లిదండ్రులను జైల్లో పెడతామని బెదిరించారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, ప్యాకేజి మాట పక్కనపెట్టి హోదా నినాదం అందుకుని మొసలి కన్నీరు కారుస్తున్నారు.


12. ఫిరాయింపులు

రాష్ట్రంలో ప్రజల పరువు తీసిన మరో ఘనకార్యం ఫిరాయింపులు. ఈ 1500 రోజుల్లో చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రతిపక్ష పార్టీనుండి ఎమ్మెల్యేలు, ఎంపీలను సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు. అది చాలదన్నట్టు నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఏకంగా మంత్రుల్ని చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రతిపక్ష పార్టీని అణచివేసేందుకు, ప్రతిపక్ష పార్టీయే లేకుండా చేసేందుకు అనేక కుట్రలు చేశారు. ఇంకా అలాంటి కుట్రలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో శాసనసభను తెలుగుదేశం సభగా మార్చేసి ప్రతిపక్షం గొంతు నొక్కేశారు. ఇది చంద్రబాబు నియంతృత్వానికి నిదర్శనం.

13. పొత్తులు - ఎత్తులు - జిత్తులు

చంద్రబాబు నాయుడు జిత్తులమారి నక్క. అవకాశవాదానికి నిలువెత్తు నిదర్శనం. గత ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు ఉండదని ప్రకటించిన చంద్రబాబు దేశవ్యాప్తంగా మోడీ గాలి వీస్తుండడం, రాష్ట్రంలో జగన్ అనుకూల వాతావరణం కనిపించడంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పటికే నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ తనకు మద్దతు ప్రకటించకపోవడంతో ఏకంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఆయన్ను బ్రతిమాలుకొని తనకు మద్దతుగా ప్రకటనలు ఇప్పించుకున్నారు. ఎన్నికలు పూర్తయి అధికారం చేతిలోకి వచ్చాక చంద్రబాబు తన అసలు రంగు బయటపెట్టి చివరి యేడాదిలో మోడీ, పవన్ కళ్యాణ్ ఇద్దరితో పొత్తు తెగతెంపులు చేసుకున్నారు. అయినా మహారాష్ట్ర బీజేపీ మంత్రి భార్యను టీటీడీ బోర్డు సభ్యురాలిగా నియమించి బీజేపీతో పరోక్ష బంధం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది చాలదన్నట్టు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని తన సామజిక వర్గం నేతల సహాయంతో చంద్రబాబు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

బీజేపీతో పొత్తు తెంచుకున్నాక చంద్రబాబు కేంద్రంపై ధర్మపోరాటం పేరుతొ ఆందోళనలు చేస్తున్నారు. ఇంతకుముందు ఎలాంటి ఆందోళనలు అనుమతించని చంద్రబాబు ఇప్పుడు ఆయనే స్వయంగా ఆందోళనలు చేస్తున్నారు. అదికూడా ప్రభుత్వ ఖర్చుతో. ఆందోళనలు ఢిల్లీలో చేయాలిగాని ఇక్కడేంటి అనే చంద్రబాబు ఇప్పుడు ఆయనే ఢిల్లీలో కాకుండా ఇక్కడ గల్లిలో ఆందోళనలు చేస్తున్నారు.


14. విద్యా వ్యాపారం

రాష్ట్రంలో ఈ 1500 రోజుల్లో ప్రభుత్వ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన ఘనత చంద్రబాబు నాయుడుదే. ప్రయివేటు విద్యాసంస్థల నిర్వాహకుడు నారాయణను మంత్రివర్గంలో పెట్టుకుని విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థులు పదుల సంఖ్యల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. పైగా ప్రభుత్వ పాఠశాలలను నారాయణకు అప్పగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. విద్యా సంస్థల్లో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యను అయన పూర్తిగా నీరుకార్చి తన సామజిక వర్గానికి చెందిన దోషులను కాపాడుకున్నారు.


15. పార్టీపై సడలిన పట్టు

గతంలో చంద్రబాబు నాయుడికి పార్టీపై గట్టి పట్టు ఉండేది. పార్టీలో ఏ నాయకుడు చంద్రబాబు అనుమతి లేకుండా మాట్లాడే పరిస్థితి లేదు. కానీ ఈ 1500 రోజుల్లో పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. ఎంతోమంది నాయకులు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. చింతమనేని ప్రభాకర్ వంటి వాళ్ళు విచ్చలవిడిగా దోపిడీ, దౌర్జన్యాలు చేసినా అయన మాట్లాడలేక పోతున్నారు. జె సి దివాకర్ రెడ్డి, రాయపాటి సాంబశివ రావు వంటి వారు ప్రత్యేక హోదా, కేంద్రంతో పోరాటం వంటి విషయాలపై విమర్శలు చేసినా, అవహేళనగా మాట్లాడినా చంద్రబాబు కంట్రోల్ చేయలేని పరిస్థితి. అలాగే బోండా ఉమ వంటి వారు మంత్రి పదవి రాలేదని బహిరంగంగా విమర్శలు చేసినా, నిరసన వ్యక్తం చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రతిపక్షంలో ఉన్న పదేళ్ళు పార్టీ నిర్వహణకు పెట్టుబడిపెట్టిన నేతలు ఎంతోమంది ఇప్పుడు చంద్రబాబును కట్టడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.


ఇదీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా గత 1500 రోజుల్లో చేసిన ఘనకార్యాలు, అయన సాధించిన విజయాలు. వీటితో అయన మరో వంద రోజ్జులు తన ఉపన్యాసాలతో జనాలకు విసుగుపుట్టించే పని మొదలుపెట్టారు. దానిపేరు గ్రామా దర్శిని.

 

Last modified on Monday, 16 July 2018 12:05

Google Ad

Subscribe